Share News

వాడవాడలా అరకు కాఫీ ఘుమఘుమలు

ABN , Publish Date - Nov 03 , 2025 | 01:08 AM

అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన అరకు ఫిల్టర్‌ కాఫీ ఘుమఘుమలు ఇప్పుడు వాడవాడలా వ్యాపించబోతున్నాయి. పొదుపు సంఘాల మహిళలతో అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటు చేసి వారికి జీవనోపాధిని మరింత మెరుగుపరచడానికి సెర్ప్‌ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. బాగా రద్దీగా ఉండే ప్రదేశాలలో స్టాల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా సెర్ప్‌ అధికారులు నేటివ్‌ సంస్థలో ఒప్పందం చేసుకున్నారు.

వాడవాడలా అరకు కాఫీ ఘుమఘుమలు
నేటివ్‌ అరకు కాఫీ స్టాల్‌

రద్దీ ప్రదేశాల్లో స్టాళ్లు ఏర్పాటు చేయాలని అధికారుల నిర్ణయం

పొదుపు సంఘాల మహిళలకు ఉపాధి కల్పన

‘నేటివ్‌ అరకు కాఫీ’తో సెర్ప్‌ ఒప్పందం

త్వరలో బలిఘట్టంలో కాఫీ స్టాల్‌

నర్సీపట్నం, నవంబరు (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన అరకు ఫిల్టర్‌ కాఫీ ఘుమఘుమలు ఇప్పుడు వాడవాడలా వ్యాపించబోతున్నాయి. పొదుపు సంఘాల మహిళలతో అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటు చేసి వారికి జీవనోపాధిని మరింత మెరుగుపరచడానికి సెర్ప్‌ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. బాగా రద్దీగా ఉండే ప్రదేశాలలో స్టాల్స్‌ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా సెర్ప్‌ అధికారులు నేటివ్‌ సంస్థలో ఒప్పందం చేసుకున్నారు. ఒక్కొక్క యూనిట్‌కు రూ.5.9 లక్షలు అవసరమని గుర్తించారు. పీఎంఎఫ్‌ఎంఈ పథకం ద్వారా రూ.4.02 లక్షలు రుణం ఇచ్చి 35 శాతం రాయితీ మంజూరు చేస్తారు. మిగిలిన పెట్టుబడికి స్త్రీనిధి నుంచి రుణం ఇస్తారు. తొలుత నర్సీపట్నం, పాయకరావుపేట, అనకాపల్లి, చోడవరం, ఎస్‌.రాయవరంలో పెట్టాలని అధికారులు ప్రతిపాదించారు. ముందుగా నర్సీపట్నం మండలం అమలాపురానికి చెందిన ఎస్‌హెచ్‌జీ మహిళకు యూనిట్‌ మంజూరు చేశారు. శారదానగర్‌ మెయిన్‌ రోడ్డు నుంచి బలిఘట్టం వెళ్లే మలుపులో అరకు కాఫీ స్టాల్‌ ఏర్పాటు చేస్తారు. అమ్మకాలు అధికంగా జరిగే రద్దీ ప్రదేశాలలో కాఫీ స్టాల్స్‌ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. పొదుపు సంఘాల నుంచి స్టాల్స్‌ పెట్టుకోవడానికి ముందుకు వస్తే ప్రోత్సహిస్తామని వెలుగు డీపీఎం సత్యనారాయణ తెలిపారు. యాజమాన్యం అనుమతితో అరకు ఫిల్టర్‌ కాఫీతో పాటు కాఫీ పొడి, ఇతర ఉత్పత్తులు కూడా విక్రయించుకోవచ్చు.

Updated Date - Nov 03 , 2025 | 01:08 AM