అన్నదాతలకు కడగండ్లు
ABN , Publish Date - Nov 04 , 2025 | 01:30 AM
తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు శారదా నది ఉధృతంగా ప్రవహించడంతో మండలంలో పలుచోట్ల నది గట్లు కోతకు గురయ్యాయి.
తుఫాన్ వరదలతో నదుల గట్లకు గండ్లు
కొట్టుకుపోయిన కాజ్‌వేలు
ఏటవతల ఉన్న పొలాలకు వెళ్లడానికి తీవ్ర ఇక్కట్లు
చోడవరం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):
తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు శారదా నది ఉధృతంగా ప్రవహించడంతో మండలంలో పలుచోట్ల నది గట్లు కోతకు గురయ్యాయి. కాజ్‌వేలు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయి. నదిలో వరద పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు ఆయా గ్రామాల రైతులు పొలాలకు వెళ్లడానికి వీలుకాని పరిస్థితి నెలకొంది. తగరంపూడి గ్రోయిన్ వద్ద ఏటిగట్టుకు గండి పడడంతో భోగాపురం, చాకిపల్లి, పీఎస్‌పేట, తదితర గ్రామాల రైతులకు పొలాలకు ఎలా వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడ గట్టు పూర్తిగా తెగిపోయి ఉంటే పంటపొలాలు ముంపునకు గురయ్యేవని, పశువులు వరద నీటిలో కొట్టుకుపోయాయని అంటున్నారు. మరోవైపు గవరవరం వద్ద కాజ్‌వే కొట్టుకుపోయింది. దీంతో నదికి అవతల వైపున వున్న సుమారు రెండు వేల ఎకరాల పంటపొలాలకు వెళ్లేందుకు దగ్గర దారి లేకుండా పోయింది. కాజ్‌వే మీదుగా కె.కోటపాడు మండలం పైడంపేట, చౌడువాడ ప్రాంతాల ప్రజలు చోడవరానికి రాకపోకలు సాగిస్తుంటారు. కాజ్‌వే కొట్టకుపోవడంతో రైతులు చుట్టూ తిరిగి పొలాలకు వెళ్లాల్సి వస్తున్నది. బెన్నవోలు వద్ద నది గట్టు బలహీనంగా మారింది. మరోసారి వరద వస్తే గండ్లు పడడం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. ఇక రాయపురాజుపేట ఎర్రిగెడ్డపై ఉన్న కాజ్‌వే గతంలోనే కొట్టుకుపోగా, ఊరగెడ్డ వద్ద ఉన్న చిన్న వంతెన గత నెలలో కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో రాయపురాజుపేట రైతులు ఊరగెడ్డకు అవతల వైపు వున్న పంట పొలాలకు వెళ్లిరావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి చోడవరం మండల పరిధిలో పెద్దేరు, శారదా నదుల గట్ల పటిష్ఠతకు చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.