అద్దెకు స్టీల్ ప్లాంటు క్వార్టర్లు
ABN , Publish Date - Dec 10 , 2025 | 01:10 AM
స్టీల్‌ప్లాంటు యాజమాన్యం వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఉత్సాహం ప్రదర్శిస్తోంది.
యాజమాన్యం నిర్ణయంపై ఉద్యోగ వర్గాల విస్మయం
రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వడానికి నిరాకరణ
హెచ్‌పీసీఎల్ ఉద్యోగులకు మాత్రం అవకాశం
విశాఖపట్నం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి):
స్టీల్‌ప్లాంటు యాజమాన్యం వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఉత్సాహం ప్రదర్శిస్తోంది. ఉక్కు ఉద్యోగుల కోసం నిర్మించిన క్వార్టర్లను ఇప్పుడు హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) ఉద్యోగులకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై ఉక్కు ఉద్యోగ వర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. స్టీల్ ప్లాంటులో మూడు దశాబ్దాలకు పైగా పనిచేసి ఇక్కడే రిటైరైనవారు ఉండడానికి సింగిల్ బెడ్ రూమ్ క్వార్టర్ అద్దెకు ఇవ్వమంటే కుదరదని చెబుతున్న యాజమాన్యం మరో సంస్థ ఉద్యోగులకు ఎలా ఇస్తుందని ప్రశ్నిస్తున్నారు. స్టీల్ ప్లాంటు జనరల్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేసిన ఒకామె సెక్టార్-1లో ఉంటున్నారు. ఆమెకు మనోవైకల్యం కలిగిన 30 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల ఆమె రిటైరయ్యారు. తన కుమారుడి ఆరోగ్య రీత్యా అదే క్వార్టర్‌లో కొనసాగుతానని, మార్కెట్‌లో ఎంత అద్దె వస్తుందో అంత చెల్లిస్తానని లేఖలు మీద లేఖలు రాస్తుంటే ఏడాదిగా ఆమెకు అవకాశం ఇవ్వడం లేదు. రిటైరైనా ఇంకా ఉంటున్నారని జరిమానాతో అద్దె వసూలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంటు కోసమే పనిచేసిన వారికి ఉండడానికి అవకాశం ఇవ్వని యాజమాన్యం హెచ్‌పీసీఎల్‌కు ఎలా ఇస్తుందని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
స్టీల్ ప్లాంటులో 14 వేల మంది ఉద్యోగులు ఉండేవారు. వారి సంఖ్యను 9,500కు తీసుకువచ్చారు. ప్లాంటును పూర్తిస్థాయిలో నడపాలంటే ఇంకో రెండు వేల మందిని రిక్రూట్ చేసుకోవాలి. ఉద్యోగుల కోసం మూడు దశాబ్దాల క్రితం ఆరు వేల క్వార్టర్లు నిర్మించారు. కొన్ని నిర్వహణ లేకపోవడంతో పాముల నిలయాలుగా మారాయి. పొదలు పెరిగిపోయాయి. టౌన్‌షిప్‌కు ఓ మూలగా సెక్టార్-12లో సి, డి-టైప్ క్వార్టర్లు ఉన్నతాధికారుల కోసం నిర్మించారు. 1,300 చ.అ. విస్తీర్ణంలో 3 బెడ్‌రూమ్స్ ఉంటాయి. వీటిని ఇప్పుడు హెచ్‌పీసీఎల్ ఉద్యోగులకు అద్దెకు ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. దీనిపై హెచ్‌పీసీఎల్ యాజమాన్యం వారి ఉద్యోగులకు లేఖలు పంపుతోంది. ఆ క్వార్టర్లను తీసుకోవడానికి ఎవరికైనా ఆసక్తి ఉంటే సమాధానం ఇవ్వాలని, దాని ప్రకారం స్టీల్ ప్లాంటుతో ఒప్పందం చేసుకుంటామని చెబుతోంది. ఇలా డి-టైప్ క్వార్టర్లలో ఓ 20 వరకు అద్దెకు ఇవ్వడానికి అనువుగా ఉన్నాయి. వాటి ద్వారా మహా వస్తే నెలకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల అద్దె వస్తుంది. ఆ ఆదాయం కోసం మరో సంస్థకు అద్దెకు ఇవ్వాల్సిన అవసరం ఉందా?...అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఎవరూ చేరకపోవడం వల్లనే
ఇటీవల ఉద్యోగులు అందరికీ బలవంతంగా క్వార్టర్లు కేటాయిస్తున్నారు. అయినా చాలామంది ఈ సి, డి క్వార్టర్లు తీసుకోవడానికి ముందుకురావడం లేదు. ఖాళీగా ఉంటే పాడైపోతాయని, ఎంతో కొంత ఆదాయం వస్తుందనే ఆలోచనతోనే ఈ ప్రతిపాదన చేశామని ప్లాంటు యాజమాన్యం చెబుతోంది.