Share News

రక్తమోడిన రహదారి

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:39 AM

స్థానిక మునిసిపాలిటీ పరిధిలోని కొక్కిరాపల్లి వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

రక్తమోడిన రహదారి

కొక్కిరాపల్లి వద్ద ఘోర ప్రమాదం

ఆగి ఉన్న ఆటోను వెనుకనుంచి బలంగా ఢీకొన్న టాటా మ్యాజిక్‌ వాహనం

రోడ్డు పక్కకు బోల్లా పడిన ఆటో

ఇద్దరి మృతి, ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

మరి కొందరికి స్వల్ప గాయాలు

కొద్దిసేపటికి అదే మార్గంలో వెళుతూ కాన్వాయ్‌ని ఆపించిన మంత్రి అనిత

క్షతగాత్రులను త్వరగా ఆస్పత్రులకు తరలించేలా చర్యలు

ఎలమంచిలి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):

స్థానిక మునిసిపాలిటీ పరిధిలోని కొక్కిరాపల్లి వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి వేగంగా వస్తున్న టాటా మ్యాజిక్‌ వాహనం బలంగా ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సమయంలో విశాఖ నుంచి నక్కపల్లి వెళుతున్న రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత.. వెంటనే తన కాన్వాయ్‌ని ఆపించారు. పోలీసు సిబ్బందితోపాటు స్థానికుల సాయంతో వాహనాల్లో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను త్వరగా బయటకు తీయించి, ఆస్పత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. ఈ సంఘటను సంబంధించి పోలీసులు, క్షతగాత్రులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

గాజువాక శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన బండి సాలేమ్‌రాజు కాకినాడ జిల్లా పిఠాపురంలో తమ బంధువుల ఇంట పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యేందుకు ఏడుగురు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం టాటా మ్యాజిక్‌ వాహనంలో బయలుదేరారు. అదే ప్రాంతానికే చెందిన కె.నానిబాబు డ్రైవింగ్‌ చేస్తున్నాడు. ఉదయం 10.20 గంటల సమయంలో ఎలమంచిలి మునిసిపాలిటీ కొక్కిరాపల్లి పరిధి ప్రేమసమాజం వద్దకు వచ్చేసరికి.. అక్కడ కశింకోట మండలం తాళ్లపాలెం నుంచి ఎలమంచిలి వెళుతున్న సర్వీసు ఆటో ప్రయాణికులు దిగడానికి ఆగింది. టాటా మ్యాజిక్‌ డ్రైవర్‌ ముందు వెళుతున్న లారీని ఎడమ వైపు నుంచి ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో అక్కడ ఆగి వున్న ఆటో దగ్గరకు వచ్చే వరకు కనిపించలేదు. దీంతో వేగంగా వచ్చి, ఆటోను వెనుక నుంచి బలంగా ఢీకొన్నాడు. దీంతో ఆటో రోడ్డు పక్కన వున్న సిమెంట్‌ పిరమిడ్‌లను ఢీకొని బోల్తా పడింది. టాటా మ్యాజిక్‌ వాహనం ముందు భాగం, ఆటో వెనుక భాగం నుజ్జయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ ధనుంజయరావు, ఎస్‌ఐ ఉపేంద్ర, పోలీసులు అక్కడకు చేరుకుని, హైవేపై వెళుతున్న వాహనదారులతోపాటు స్థానికుల సహకారంతో ప్రమాదానికి గురైన వాహనాల్లో ఇరుక్కుపోయిన క్షతగాత్రులను బయటకు తీశారు. ఆటోలో ప్రయాణిస్తున్న కశింకోట మండలం తీడ గ్రామానికి చెందిన గొంది పెంటయ్య (56), నర్సీపట్నం మునిసిపాలిటీ దనిమిరెడ్డి వీధికి చెందిన బాదంపూడి లక్ష్మి(65), చింతకాయల రమణమ్మ (మల్లవరం), పక్కుర్తి అప్పలరాజు (సంతపాలెం), గొంది లక్ష్మి(తీడ), టాటా మ్యాజిక్‌లో ప్రయాణిస్తున్న బండి జాస్మిన్‌, బండి కరుణ, బండి ఆనంద విజయ, బండి అబ్బాయిలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో వున్న డ్రైవర్‌ జామి సూర్యనారాయణ (సింగవరం), కె.హేమలత(పెదపూడి), చింతకాయల యశ్వంత్‌ (మల్లవరం), వై.అమ్మాజీ(రామన్నపాలెం), వెంకటలక్షి (రామన్నపాలెం), శ్రీహరిపురానికి చెందిన టాటా మ్యాజిక్‌ డ్రైవర్‌ కె.నానిబాబు, బండి నరసింగరావు అలియాస్‌ సాలేమ్‌రాజు, నడిగట్ల విజయ, ఎస్‌.రాజ్‌కుమార్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి వైపు నుంచి నక్కపల్లి వెళుతున్నారు. ఆమె వెంటనే కాన్వాయ్‌ను ఆపించి, క్షతగాత్రులను త్వరగా ఆస్పత్రులకు తరలించేలా చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు ధైర్యం చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారిని అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి, మిగిలిన, వారిని ఎలమంచిలి సీహెచ్‌సీకి పంపారు. అప్పటికే సమాచారం అందుకున్న ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ ఎలమంచిలి ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. కాగా అనకాపల్లి పంపిన క్షతగాత్రుల్లో గొంది పెంటయ్య(56), బాదంపూడి లక్ష్మి(65) చికిత్స పొందుతూ మృతిచెందారు. మిగిలిన వారికి ప్రథమ చికిత్స అనంతరం విశాఖపట్నం కేజీహెచ్‌కు, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ఎలమంచిలి ఆస్పత్రికి తరలించిన క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి పంపారు. అప్పటి వరకు మంత్రి అనిత, ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌ ఆస్పత్రిలోనే వుండి పర్యవేక్షించారు. ఈ ప్రమాదంపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపారు.

Updated Date - Nov 04 , 2025 | 01:39 AM