శతాబ్ది ఉత్సవాల వేళ... అభివృద్ధి మేళా
ABN , Publish Date - Dec 10 , 2025 | 01:16 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రస్తుతం శతాబ్ది వేడుకలు జరుపుకుంటోంది. ఇవి పూర్తయ్యే నాటికి రూ.270 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
రూ.270 కోట్లతో ఏయూ అధికారుల ప్రతిపాదనలు
కేంద్రం రూ.170 కోట్లు, రాష్ట్రం రూ.100 కోట్లు...
కొత్తగా సెంట్రల్ అడ్మినిస్ర్టేషన్ భవనం నిర్మాణం
1,000 మంది విద్యార్థులకు సరిపడేలా రెండు వసతి గృహాలు
సిబ్బంది కోసం నివాస గృహాలు
ఇంకా సాంస్కృతిక వేదికలు, సమావేశ మందిరాలు, అతిథి గృహాల నిర్మాణానికి ప్రణాళికలు
విశాఖపట్నం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రస్తుతం శతాబ్ది వేడుకలు జరుపుకుంటోంది. ఇవి పూర్తయ్యే నాటికి రూ.270 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ‘పూర్వోదయ’ పథకం కింద సుమారు రూ.170 కోట్లు పొందేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో రూ.100 కోట్లు తీసుకోవాలని భావిస్తున్నారు. వేడుకలు పూర్తయ్యే నాటికి రూ.270 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతోపాటు కొన్ని కీలక ప్రాజెక్టులను పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల విడుదలకు గ్రీన్‌సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు ఆయా అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసినట్టు రిజిస్ర్టార్ ప్రొఫెసర్ కె.రాంబాబు తెలిపారు.
కీలక ప్రాజెక్టులు ఇవే..
నార్త్, సౌత్ క్యాంపస్‌లలో 1,000 మంది విద్యార్థులకు సరిపడేలా రెండు వసతి గృహాలను నిర్మించనున్నారు. ఒక్కొక్కటి 500 మందికి వసతి కల్పించేలా నిర్మించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అలాగే, కీలక విభాగాలకు చెందిన కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటి స్థానంలో నూతన భవనాలను నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా సిబ్బందికి నివాస గృహాలను నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుతం మద్దిలపాలెం, సిరిపురం, చినవాల్తేరు, పెదవాల్తేరు ప్రాంతాల్లో ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది నివాస గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటి స్థానంలో నూతన గృహాలను నిర్మించనున్నారు. సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు 100, డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లు 50 నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అలాగే, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరికొన్నిచోట్ల సాంస్కృతిక వేదికలు, సమావేశ మందిరాలు, అతిథి గృహాలను నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధంచేశారు. వీటితోపాటు కొత్తగా సెంట్రల్ అడ్మినిస్ర్టేషన్ బ్లాక్ నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఉన్న బ్లాక్ పురాతనమైనది. దీనిని కొనసాగిస్తూ సెంటినరీ సెలబ్రేషన్స్‌కు గుర్తుగా అత్యాధునిక భవనాన్ని నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇంకా 24 వేల చదరపు అడుగుల్లో సెంట్రలైజ్డ్ కిచెన్, భోజనశాల నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కేంద్ర పరిశోధన కేంద్రం నిర్మించనున్నారు. ఇందులో అత్యాఽధునిక పరిశోధన పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. వర్సిటీ వందేళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో కీలకమైన ప్రాజెక్టులను చేపట్టాలన్న ఉద్దేశంతో ప్రణాళికలు రూపొందించామని రిజిస్ర్టార్ రాంబాబు తెలిపారు. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాయన్నారు. రానున్న 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టులను చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.
13న ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశం
ఈ ఏడాది థీమ్ మహిళా సాధికారిత
ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్, మూర్తి ట్రస్ట్ చైర్‌పర్సన్ సుధామూర్తి
ఏయూ అలూమ్ని అసోసియేషన్ చైర్మన్ కేవీవీ రావు
పూర్వ విద్యార్థులను వర్సిటీతో అనుసంధానం చేస్తాం
వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్
విశాఖపట్నం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల వార్షిక సమావేశాన్ని ‘వేవ్స్-2025 కార్యక్రమాన్ని ఈ నెల 13న నిర్వహిస్తున్నట్టు ఏయూ అలూమ్ని అసోసియేషన్ చైర్మన్ కేవీవీ రావు వెల్లడించారు. మంగళవారం ఉదయం అలూమ్ని జీఎంఆర్ సెమినార్ హాల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. మహిళా సాధికారిత థీమ్‌తో ఈ ఏడాది అలూమ్ని సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న రాజ్యసభ ఎంపీ, రచయిత, ఇన్ఫోసిస్ ఫౌండేషన్, మూర్తి ట్రస్ట్ చైర్‌పర్సన్ సుధామూర్తి హాజరవుతున్నారన్నారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. అలూమ్ని వ్యవస్థాపక అధ్యక్షులు గ్రంథి మల్లికార్జునరావు, తదితరులు పాల్గొంటారన్నారు. ఇప్పటివరకూ పది వేల మంది రిజిస్ర్టేషన్ చేసుకున్నారని, రెండు వేల మందికిపైగా హాజరవుతారన్నారు. ప్రధాన వేదికతోపాటు ప్రాంగణం వెలుపల ప్రత్యేక స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఏయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ మాట్లాడుతూ 13వ తేదీ మధ్యాహ్నం ఏయూ పరిపాలనా భవనం వద్ద ఉన్న వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి ముఖ్య అతిథి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారన్నారు. వార్షిక పూర్వ విద్యార్థుల సమావేశానికి వర్సిటీపరంగా సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన ఏయూ పూర్వ విద్యార్థులను అనుసంధానిస్తామని, విశ్వవిద్యాలయ అభివృద్ధిలో వారిని భాగస్వామ్యులను చేస్తామని చెప్పారు. విశ్వవిద్యాలయం భవిష్యత్తు ప్రణాళికలను వారికి వివరించే ప్రయత్నం చేస్తామన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో పూర్వ విద్యార్థులను భాగస్వామ్యులను చేస్తామన్నారు.
డిసెంబర్ 13వ తేదీ ఉదయం ప్రతి విభాగంలో పూర్వ విద్యార్థులతో ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల వార్షిక సమ్మేళనం వేవ్స్-2025 కార్యక్రమ వివరాలతో కూడిన పోస్టర్‌ను వీసీ ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ అలూమ్ని చైర్మన్ కేవీవీ రావుతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ కె.కుమార్‌రాజ, జనరల్ సెక్రటరీ ఆకుల చంద్రశేఖర్, ఈసీ సభ్యులు డాక్టర్ ఎస్‌కేఈ అప్పారావు, ప్రొఫెసర్ బి.మోహనవెంకటరామ్, వైవీ అనురాధ, తదితరులు పాల్గొన్నారు.