Share News

టెన్త్‌, ఇంటర్‌లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:39 AM

పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలని, ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖలు, కేజీబీవీ, విద్యా శాఖ అధికారులు, వసతిగృహాల సంక్షేమ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

టెన్త్‌, ఇంటర్‌లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

గురుకులాలు, ఆశ్రమాలు, వసతిగృహాల్లో విద్యార్థులపై దృష్టి

సబ్టెక్టుల వారీగా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి

బాలికల హాస్టళ్లల్లోకి అన్యులను అనుమతించొద్దు

అధికారులకు కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశం

అనకాపల్లి రూరల్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలని, ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖలు, కేజీబీవీ, విద్యా శాఖ అధికారులు, వసతిగృహాల సంక్షేమ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రధానంగా గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీలు, వసతిగృహాల్లో మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాల మెరుగుకు తీసుకోవాల్సిన చర్యలు, పరీక్షల ముందస్తు ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సబ్జెక్టుల వారీగా ప్రత్యేక శిక్షణ అందించాలన్నారు. చదవటం, రాయటంపై నిత్యం తర్ఫీదు చేయాలని, మోడల్‌ పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని, ప్రతి విద్యార్థి తప్పనిసరిగా పరీక్షలకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్రాంతి సెలవులకు ఇంటికి వెళ్లిన విద్యార్థులు.. స్కూళ్లు తెరిచిన రోజే తిరిగి వచ్చేలా చూడాలని, అందుకు వసతిగృహా అధికారులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. వసతిగృహాల పరిసరాలు పరిశుభ్రంగా వుండాలని, మురుగునీరు నిల్వ లేకుండా చూడాలని, తుప్పలు వుంటే తొలగించాలని, కుక్కలు లోనికి రాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. విద్యార్థులకు షెడ్యూల్‌ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు. వసతిగృహం నుంచి పాఠశాలకు విద్యార్థుల రాకపై రోజూ సంబంధిత ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని, విద్యార్థులపై నిత్య పర్యవేక్షణ వుండాలని స్పష్టం చేశారు. బాలికల వసతిగృహాల్లోకి సిబ్బంది తప్ప ఇతరులను అనుమతించవద్దన్నారు. విద్యార్థులకు రక్షిత మంచినీరు, నాణ్యమైన భోజనం అందించాలన్నారు. ఇటీవల సంభవించిన తుఫాన్‌కు భవనాలు దెబ్బతింటే వెంటనే బాగు చేయించాలని తెలిపారు. సమావేశానికి డీఈవో జి.అప్పారావునాయుడు, బీసీ సంక్షేమ అధికారి కె.శ్రీదేవి, సాంఘిక సంక్షేమ అధికారి బి.రామనాఽథం, తదితరులు హాజరయ్యారు.

Updated Date - Nov 05 , 2025 | 12:39 AM