Share News

గర్భం దాల్చిన కేజీబీవీ విద్యార్థిని?

ABN , Publish Date - Dec 10 , 2025 | 01:03 AM

మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని గర్భం దాల్చినట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న విద్యాలయం సిబ్బంది...బాలిక అమ్మమ్మను రప్పించి, ఆమెతో ఇంటికి పంపినట్టు చెబుతున్నారు.

గర్భం దాల్చిన కేజీబీవీ విద్యార్థిని?

అమ్మమ్మను పాఠశాలకు రప్పించి, బాలికను ఇంటికి పంపిన అధికారులు

గొలుగొండ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి):

మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని గర్భం దాల్చినట్టు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న విద్యాలయం సిబ్బంది...బాలిక అమ్మమ్మను రప్పించి, ఆమెతో ఇంటికి పంపినట్టు చెబుతున్నారు.

గొలుగొండ మండలంలో ఒక గ్రామానికి చెందిన బాలిక ఇక్కడ కేజీబీవీలో పదో తరగతి చదువుతున్నది. తండ్రి మృతిచెందడంతో తల్లి మరో పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి అమ్మమ్మ సంరక్షణలో బాలిక పెరుగుతున్నది. కాగా బాలికకు రెండు రోజుల నుంచి వాంతులు అవుతుండడంతో విద్యాలయం సిబ్బంది వైద్య సేవలు అందించారు. అయినా వాంతులు తగ్గకపోవడంతో అనుమానం వచ్చి పరీక్ష చేయించగా బాలిక గర్భవతి అని తేలడంతో అమ్మమ్మకు కబురు చేశారు. ఆమె వచ్చి మనవరాలిని ఇంటికి తీసుకువెళ్లినట్టు తెలిసింది.

కాగా గొలుగొండ కేజీబీవీలో పరిస్థితులు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. గత వారం ఒకరోజు రాత్రి బాలికలకు భోజనం వడ్డించడంలో తీవ్ర జాప్యం జరిగింది. బాలికలు అన్నం తినేసరికి రాత్రి 11 గంటలు దాటింది. అలాగే రెండు రోజుల క్రితం పిల్లలను కలిసేందుకు తల్లిదండ్రులు ఇక్కడకు రాగా...ప్రిన్సిపాల్‌ సుధ నిరాకరించారు. దీంతో వారు గేటువద్ద ఆందోళన చేశారు. తాజాగా ఒక విద్యార్థిని గర్భం దాల్చిన విషయం బయటకు పొక్కడంతో ప్రిన్సిపాల్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయినట్టు ప్రచారం జరిగింది. దీనిపై ఇన్‌చార్జి ఎంఈవో సత్యనారాయణు వివరణ కోరగా...ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని, ఆమెకు ఫోన్‌ చేయగా...తాను రిజైన్‌ చేయలేదని చెప్పారని ఆయన తెలిపారు.

Updated Date - Dec 10 , 2025 | 01:03 AM