PM Modi To Kurnool: కర్నూలు గడ్డపై.. మూడో ప్రధాని ..
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:48 PM
రాయలసీమ ముఖద్వారమైన కందనవోలు గడ్డపై అడుగు పెట్టుబోతున్న మూడో ప్రధానమంత్రి.. శ్రీశైల జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలు దర్శించనున్న ఐదో ప్రధానిగా మోదీ నిలిచారు.
గతంలో వచ్చిన మన్మోహన సింగ్, పీవీ నరసింహారావు
శ్రీశైలాన్ని సందర్శించిన నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ
నేడు ప్రధాని హోదాలో రానున్న మోదీ
కర్నూలు, శ్రీశైలంలో పర్యటనకు ఏర్పాట్లు సిద్ధం
3 లక్షలకు పైగా జనసమీకరణలో కూటమి నేతలు
కర్నూలు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ ముఖద్వారమైన కందనవోలు గడ్డపై అడుగు పెట్టుబోతున్న మూడో ప్రధానమంత్రి.. శ్రీశైల జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలు దర్శించనున్న ఐదో ప్రధానిగా మోదీ నిలిచారు. కేంద్ర ఎన్టీఏ ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకొచ్చింది. నాలుగు స్లాబుల నుంచి రెండు స్లాబులకు కుదించింది. పలు వస్తు, సేవలకు జీఎస్టీ జీరో చేసింది. ఫలితంగా ఏడాదికి దేశ ప్రజలపై రూ.1.50 లక్షలు జీఎస్టీ భారం తగ్గనుంది. జీఎస్టీ 2.0 ఫలాలు ఇంటింటికి అందించాలని సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వినూత్న పద్దతులు (వేర్వేరు థీమ్స్) ద్వారా అక్టోబరు 19 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 65 వేల కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రన్న సంకల్పం. అందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా కర్నూలు వేదికగా సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ పేరిట గురువారం భారీ ప్రజా అవగాహన సభ నిర్వహిస్తున్నారు. నగర శివారులో రాగమయూరి గ్రీన హిల్స్‌లో మూడు లక్షలకు పైగా జన సమీకరణతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సభలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకళ్యాణ్, విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ సహా కూటమి పార్టీల ప్రముఖ నాయకులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం ద్వారా కర్నూలు ఖ్యాతి జాతీయ స్థాయికి చేరనుంది. రాష్ట్ర మంత్రులు, పీఎం ప్రొగ్రాం స్పెషల్ ఆఫీసర్ వీరపాండియన, జిల్లా కలెక్టర్ డాక్టర్ అట్టాడ సిరి, ఎస్పీ విక్రాంత పాటిల్ పర్యవేక్షణలో కర్నూలు, శ్రీశైలం ప్రధాని పర్యటన ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి కొన్ని గంటల్లో కర్నూలు గడ్డపై ప్రధాని మోదీ అడుగు పెట్టేబోతున్నారు. ఈ ఘట్టం కోసం ఎదురు చూస్తున్న కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధం అంటున్నారు.
అధికారిక పర్యటనలో మూడో ప్రధాని మోదీ
కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అధికారికంగా ప్రటించబోతున్న మూడవ ప్రధాని నరేంద్రమోదీ. 2019 ఎన్నికల్లో ప్రచార సభలో పాల్గొన్నా.. బీజేపీ అగ్రనాయకుడిగా కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ప్రధాని హోదాలో పాల్గోనడం ఇదే ప్రథమం. జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి భీజం వేయనున్నారు. 2,612 ఎకరాల్లో రూ.2,786 కోట్లతో ఓర్వకల్లు ఇండసీ్ట్రయల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి, రూ.2,886 కోట్లతో కర్నూలు పీఎస్-3 వద్ద పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం అదనపు వపర్ గ్రిడ్ నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. 1991-96 మధ్య నంద్యాల ఎంపీగా ఉన్న ఆనాటి ప్రధాని పీవీ నరసింహారావు నంద్యాలలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దేశ పార్లమెంట్ చరిత్రలో అత్యధిక మెజారీతో గెలిచిన ఎంపీగా పీవీ నంద్యాల నుంచి విజయం సాధించి చరిత్ర నెలకొల్పారు. 2004లో ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లెలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అప్పటి ప్రధాని మన్మోహనసింగ్‌ను కదిలించింది. ఆయన సోమయాజులపల్లెలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటంబాన్ని పరమార్శించారు. అక్కడే చెరువు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలాగే.. శ్రీశైల జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలు దర్శించబోతున్న ఐదవ ప్రధాని మోదీ. శ్రీశైలం జలాశయం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు వచ్చిన గత ప్రధానులు జవహార్‌లాల్ నెహ్రు, ఇందిరాగాంధీ, ఆ తరువాత రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావులు శ్రీశైలం సందర్శించారు.
మోదీ పర్యటన సక్సెస్ కోసం కృషి
ఉమ్మడి జిల్లాకు రాబోతున్న ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు రాష్ట్ర పాలన, ప్రభుత్వ యంత్రాంగం సర్వశక్తులు ఒడ్డుతోంది. మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్ధనరెడ్డి, టీజీ భరత, ఎనఎండీ ఫరూక్, నారాయణ, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్, వంగలపుడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రాంప్రసాద్‌రెడ్డి, సబిత సహా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన మాధవ్, టీడీపీ కర్నూలు, నంద్యాల జిల్లాల అధ్యక్షులు పి.తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు అక్కంతోట రామకృష్ణ, అభిరుచి మధు, జనసేన ఇనచార్జి చింతా సురేశ, ఎంపీలు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి, ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, భూంరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, బొగ్గల దస్తగిరి, బీవీ జయనాగేశ్వర రెడ్డి, కేఈ శ్యాంబాబు, డాక్టర్ పార్థసారథి, భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, గిత్తా జయసూర్య, కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కేడీసీసీబీ చైర్మన విష్ణువర్ధనరెడ్డి, డీసీఎంఎస్ చైర్మన నాగేశ్వరరావు యాదవ్, నందికొట్కూరు. ఆదోని, ఆలూరు, మంత్రాలయం టీడీపీ ఇనచార్జిలు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు, వైకుంఠం జ్యోతి, ఎన.రాఘవేంద్రరెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ రీజినల్ చైర్మన పూల నాగరాజు, టీడీపీ రాష్ట్ర మీడియా ఇనచార్జి బి.వెంకటరాముడు సహా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు ప్రధాని పర్యటన విజయవంతం కోసం ఏర్పాట్లు, జన సమీకరణలో కృషి చేస్తున్నారు.
ప్రతి క్షణం.. ఏర్పాట్లలో నిమగ్నం
ప్రధాని మోదీ పర్యటన స్థలం ఎంపిక మొదలు సభా ప్రాంగణం, పార్కింగ్, రోడ్లు ఏర్పాటు, సౌకర్యాల కల్పన, భద్రతా, బందోబస్తు ఏర్పాట్లలో పీఎం ప్రొగ్రాం స్పెషల్ ఆఫీసర్ వీరపాండియన, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత పాటిల్ ప్రతి క్షణం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రముఖ రియాల్టర్ కేజే రెడ్డికి చెందిన రాగమయూరి గ్రీనహిల్స్‌లో ప్రధాని మోదీ పాల్గొనే సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ సభా ప్రాంగణం, 11 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. హైవే నుంచి సభా ప్రాంగణం వరకు దాదాపు 4 కిలోమీటర్లు నాలుగు వరుసల ప్రధాన రహదారి ఆధునికీకరణ చేయడం ద్వారా ఆ కాలనీ వాసులకు చిరకాల స్వప్నం ప్రధాని పర్యటన ద్వారా తీరినట్లైంది. ప్రధాని పర్యటన ఏర్పాట్లు, తరలివచ్చే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, రవాణా, తాగునీరు, ఆహారం, పారిశుద్ధ్యం, భద్రతా, బందోబస్తు.. ఇలా వివిధ రూపాల్లో దాదాపుగా రూ.150-200 కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అనధికారి అంచనా వేస్తున్నారు.