Share News

కురిసిన వర్షం

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:30 PM

పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం వర్షం కురిసింది.

కురిసిన వర్షం

ఆత్మకూరు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వర్షం కురిసింది. పట్టణంలోని కేజీరోడ్డు, తిక్కయ్యస్వామి దర్గా, అప్పారావువీధి తదితర ప్రధాన రహదారులపై వర్షపునీరు నిలిచింది. లోతట్టు కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో జనం అసౌకర్యానికి లోనయ్యారు. తహసీల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలో వర్షపునీరు నిలువడంతో జనం ఇబ్బందులు పడ్డారు. వర్షాలు వల్ల పంటకోతలు జరిపేందుకు వీల్లేక రైతులు అల్లాడిపోతున్నారు.

నందికొట్కూరు: పట్టణంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలైన మారుతి నగర్‌, హాజీ నగర్‌లు జలమయమయ్యాయి. పట్టణానికి ఎగువన ఉన్న 340-సి నేషనల్‌ హైవే వద్ద నిలిచిన వర్షపు నీటిని మున్సిపల్‌ చైర్మన దాసి సుధాకర్‌రెడ్డి, కమిషనర్‌ బేబీ పరిశీలించారు. ఎగువ నుంచివస్తున్న వర్షపు నీటిని ఎలా మల్లిస్తే పట్టణానికి వరద తగ్గుతుందన్న అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు. వర్షం వచ్చిన ప్రతి సారి నాయకులు అధికారులు, నేషనల్‌ హైవే పైన, లోతట్టు ప్రాంతాల్లో పర్యటించడం తప్పా.... శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

పగిడ్యాల: మండలంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. మొక్కజొన్న పొలాల్లో వర్షపు నీరు నిలిచింది. దాంతో పంటను నూర్పిడి చేసేందుకు ఇబ్బందిగా మారింది. మండలంలో రాత్రి 24.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

Updated Date - Nov 04 , 2025 | 11:30 PM