Share News

‘పార్కింగ్‌’ టెండర్ల మాయ!

ABN , Publish Date - Dec 10 , 2025 | 01:14 AM

కార్పొరేషన్‌లో వైసీపీ పాలకపక్షం తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌ సెల్లార్‌ పార్కింగ్‌కు టెండర్ల గడువు ముగియగా, కేబీఎన్‌ సెల్లార్‌ పార్కింగ్‌కు జనవరిలో గడువు ముగియనుంది. ఈ రెండు చోట్ల నూతన టెండర్లు పిలవాల్సి ఉన్నా పాత కాంట్రాక్టర్లకు మరో ఏడాది పొడిగిస్తూ స్టాండింగ్‌ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు చోట్ల ఆదాయం బాగానే వస్తున్నా.. కొత్త టెండర్లు పిలవక పోవడంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ పాలక పక్షం నిర్వాకంపై బుధవారం జరిగే కౌన్సిల్‌ సమావేశంలో విపక్షలు గళం విప్పనున్నాయి.

‘పార్కింగ్‌’ టెండర్ల మాయ!

- కార్పొరేషన్‌లో వైసీపీ పాలక పక్షం తీరుపై విమర్శలు

- ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌ సెల్లార్‌ పార్కింగ్‌కు ముగిసిన టెండర్ల గడువు

- కేబీఎన్‌ సెల్లార్‌ పార్కింగ్‌కు జనవరిలో ముగియనున్న గడువు

- ఈ రెండు చోట్ల పాత కాంట్రాక్టర్లకు మరో ఏడాది పొడిగింపు

- ఆదాయం వస్తున్నా.. కొత్త టెండర్ల ఊసెత్తలేదు

- స్టాండింగ్‌ కమిటీలో వైసీపీ పాలక పక్షం నిర్వాకం

- నేటి కౌన్సిల్‌ సమావేశలో గళం విప్పనున్న విపక్ష కార్పొరేటర్లు

కార్పొరేషన్‌లో వైసీపీ పాలకపక్షం తీరు పలు విమర్శలకు దారితీస్తోంది. ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌ సెల్లార్‌ పార్కింగ్‌కు టెండర్ల గడువు ముగియగా, కేబీఎన్‌ సెల్లార్‌ పార్కింగ్‌కు జనవరిలో గడువు ముగియనుంది. ఈ రెండు చోట్ల నూతన టెండర్లు పిలవాల్సి ఉన్నా పాత కాంట్రాక్టర్లకు మరో ఏడాది పొడిగిస్తూ స్టాండింగ్‌ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు చోట్ల ఆదాయం బాగానే వస్తున్నా.. కొత్త టెండర్లు పిలవక పోవడంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. వైసీపీ పాలక పక్షం నిర్వాకంపై బుధవారం జరిగే కౌన్సిల్‌ సమావేశంలో విపక్షలు గళం విప్పనున్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

నగరంలోని కార్పొరేషన్‌ వాణిజ్య సముదాయాల్లో గవర్నర్‌పేటలోని ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌ ఒకటి. ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌ సెల్లార్‌, ఎన్టీఆర్‌ - ఏఎంసీ కాంప్లెక్స్‌ల మధ్యన పార్కింగ్‌ ఫీజు వసూలు చేసుకోవటానికి గత సంవత్సరం టెండర్లు పిలిచారు. ఈ నెలలో టెండర్ల గడువు ముగియటంతో ఇటీవల స్టాండింగ్‌ కమిటీకి దీనికి సంబంధించిన ప్రతిపాదన వచ్చింది. టెండరుదారుడు ఎలాంటి బకాయిలు లేకుండా రూ. 92 లక్షలను చెల్లించినట్టుగా కార్పొరేషన్‌ ఎస్టేటు విభాగం అధికారులు ఆ ప్రతిపాదనలో పొందుపరిచారు. కాంట్రాక్టర్‌ బకాయిలు లేకుండా చెల్లింపులు జరిపారంటే ఆదాయం వచ్చినట్టుగానే భావించాలి. రూ. 92 లక్షల ఆదాయం వచ్చిందంటే.. ఏడాది కాలంలో పెరిగే వాహనాలు, అవసరాల ప్రాతిపదికన చూస్తే.. ఖచ్చితంగా ఇంకా ఆదాయం పెరుగుతుంది. టెండర్లు పిలిస్తే రూ. కోటిన్నర ఆదాయం వచ్చేదేమో ఎవరికి తెలుసు. టెండర్లు పిలిస్తే పాటదారులు ముందుకు వస్తారు. వారి మధ్య పోటీ పెరిగేది. దీంతో ఎక్కువ ఆదాయం రావటానికి అవకాశం ఉంటుంది. అసలు టెండర్లే పిలవ కపోతే పోటీ అనేది ఉండదు. ఎలాంటి పరిస్థితులలో టెండర్లను పొడిగించాల్సి వచ్చిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. నష్టాలు రాకపోయినా.. టెండర్లు పిలవకపోవటం వెనుక ఎవరి ప్రయోజనాల కోసమన్న తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. కార్పొరేషన్‌ ఎస్టేటు విభాగం ప్రతిపాదిస్తే వైసీపీ పాలకపక్షం గుడ్డిగా ఆమోదిస్తుందా ? వైసీపీ పాలక పక్షం ఎందుకు లాలూచీ పడిందన్నది వెలుగు చూడాల్సి ఉంది. కార్పొరేషన్‌ ఎస్టేటు విభాగమే ప్రతిపాదిస్తే.. ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి స్టాండింగ్‌ కమిటీలో ప్రతిపాదన రాగానే వైసీపీ పాలకపక్షం తిరస్కరించాల్సింది పోయి.. మరో ఏడాది పాటు అప్పనంగా కారు చౌకగా పాతవాళ్లకే కట్టబెట్టేశారు. ఈ ప్రతిపాదన రాగానే.. టెండర్లు ఎందుకు పిలవకూడదని వైసీపీ పాలకపక్షం ప్రశ్నించలేదు. ఎందుకు పొడిగిస్తున్నారన్నది కూడా తెలుసుకోలేదంటే.. ఏం జరిగి ఉంటుందో ఊహించుకోవాల్సిందే. అధికార పక్షంలో ఉన్నామన్న ఉద్దేశ్యంతో వైసీపీ పాలకపక్షం దీపం ఉండగానే చక్కదిద్దుకునే కార్యక్రమాలను చేపడుతోందన్న తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. స్టాండింగ్‌ కమిటీలో విపక్షాలకు బలం లేదు కాబట్టి.. ప్రతిపాదనను ఆమోదించేశారు. దీంతో కార్పొరేషన్‌కు మరో రూ.అర కోటి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా కాలదన్నుకోవాల్సి వచ్చింది.

కేబీఎన్‌ సెల్లార్‌ పార్కింగ్‌ కూడా పొడిగింపు

కార్పొరేషన్‌కు చెందిన కేబీఎన్‌ సెల్లార్‌ పార్కింగ్‌, చిట్టూరి కాంప్లెక్స్‌ రోడ్డు సైడు పార్కింగ్‌ ప్రాంతాల్లో పార్కింగ్‌ ఫీజు వసూలు చేయటానికి కిందటి ఏడాదిలో టెండర్లు పిలిచారు. జనవరిలో దీని లీజు గడువు ముగుస్తోంది. దీనికి సంబంధించి కూడా కాంట్రాక్టర్‌ నుంచి ఎలాంటి బకాయిలు లేవు. నిర్దేశిత లీజు ఫీజు రూ.11.34 లక్షలను చెల్లించారు. దీనికి టెండర్లు పిలిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో రూ.9 లక్షల వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అంటే రూ.20 లక్షల మేర కార్పొరేషన్‌కు డబుల్‌ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కానీ కార్పొరేషన్‌ ఆ పని చేయకుండా.. పాత కాంట్రాక్టర్‌కే మరో ఏడాది పొడిగించారు. ఇలా చేయటం వల్ల ఎవరికి ప్రయోజనమో వైసీపీ పాలకపక్షం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

- నేడు కౌన్సిల్‌ సమావేశం.. అడ్డగోలు నిర్ణయాలను విపక్షాలు ప్రశ్నిస్తాయా ?

కౌన్సిల్‌ సాధారణ సమావేశం బుధవారం జరగనుంది. స్టాండింగ్‌ కమిటీలో ఎలాగూ బలం లేదు కాబట్టి అధికార వైసీపీ పక్షం తీసుకున్నదే నిర్ణయం. వైసీపీ పాలకపక్షం తీసుకున్న నిర్ణయాల వల్ల కార్పొరేషన్‌కు జరుగుతున్న న ష్టం గురించి, వైసీపీ విధానాలను ఎండగట్టడానికి విపక్షాలకు ఇది మంచి అవకాశం. టీడీపీకి చెందిన కార్పొరేటర్లు ఈ అడ్డగోలు నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకించారు. మరి బుధవారం ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే !

Updated Date - Dec 10 , 2025 | 01:14 AM