Share News

Teachers: రాయాలా.. వద్దా

ABN , Publish Date - Nov 03 , 2025 | 05:45 AM

రాష్ట్రంలో ప్రస్తుతం 1.8 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. అందరూ టెట్‌ ఉత్తీర్ణులు కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2011కు ముందు డీఎస్సీల ద్వారా నియామకమైన....

Teachers: రాయాలా.. వద్దా

  • టెట్‌పై అయోమయంలో ఇన్‌ సర్వీస్‌ టీచర్లు

  • లక్ష మంది టీచర్లపై టెట్‌ ప్రభావం

  • ఇప్పటిదాకా 6 వేల మంది దరఖాస్తు

  • రివ్యూ పిటిషన్‌కు సర్కారు నిర్ణయం

  • సుప్రీంకోర్టు తీర్పుపైనే భవితవ్యం

రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) రాయాలా? వద్దా? అనే విషయంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. టెట్‌ లేని వారంతా రెండేళ్లలో టెట్‌ ఉత్తీర్ణత సాధించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీచేసిన టెట్‌ నోటిఫికేషన్‌లో ఇన్‌ సర్వీస్‌ టీచర్లకూ టెట్‌ రాసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, టెట్‌ మినహాయింపు కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో మళ్లీ టెట్‌ మినహాయింపుపై టీచర్లలో ఆశలు చిగురించాయి. అయితే, సుప్రీంకోర్టు తుది తీర్పుపైనే టీచర్ల ‘టెట్‌’ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ప్రస్తుతం 1.8 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. అందరూ టెట్‌ ఉత్తీర్ణులు కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 2011కు ముందు డీఎస్సీల ద్వారా నియామకమైన టీచర్లంతా టెట్‌ రాసి ఉత్తీర్ణత సాధించాలి. వారిలో ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి మినహాయింపు ఉంది. అయితే, ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నప్పటికీ పదోన్నతి పొందాలంటే మాత్రం తప్పనిసరిగా టెట్‌ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీం స్పష్టం చేసింది. కాగా, పీఈటీ, పీడీలకు టెట్‌ అవసరం ఉండదు. దీంతో సుమారు లక్ష మంది టీచర్లు ఇప్పుడు టెట్‌ రాయాల్సి ఉంటుంది. ఐదేళ్లలోపు సర్వీసు ఉండి పదోన్నతి దక్కదు అనుకునేవారు టెట్‌కు దూరంగా ఉంటారు. కానీ, ఐదేళ్లు దాటి సర్వీసు ఉన్నవారు, ఐదేళ్లలోపు సర్వీసు ఉండి పదోన్నతి దక్కే అవకాశం ఉన్నవారు టెట్‌ ఉత్తీర్ణత సాధించాలి.


5,916 మంది దరఖాస్తు

టెట్‌ నుంచి మినహాయింపు లభిస్తుందని చాలా మంది టీచర్లు ఆశిస్తుంటే టెట్‌ రాయాలని కొందరు టీచర్లు ఇప్పటికే నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు 5,916 మంది టీచర్లు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. డిసెంబరు 10 నుంచి ప్రారంభమయ్యే టెట్‌ పరీక్షలకు వీరు హాజరుకానున్నారు. కాగా, ఇప్పటివరకు మొత్తంగా 53,560 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 18,982 మంది పురుషులు, 34,578 మంది మహిళలు ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఈ ఏడాది సెప్టెంబరు 1న వచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం అప్పటినుంచి రెండేళ్లలోపు టెట్‌ లేని వారు టెట్‌ అర్హత సాధించాలి. దీంతో మినహాయింపుపై ఆశలు పెట్టుకోకుండా చాలా మంది టీచర్లు టెట్‌ రాయాలనే యోచనలో ఉన్నారు. కాగా, ఉపాధ్యాయ సంఘాల నేతలు మాత్రం టెట్‌ నుంచి మినహాయింపు లభిస్తుందని, వేచిచూడాలని టీచర్లకు సలహా ఇస్తున్నారు.


ఆ సబ్జెక్టుల టీచర్ల ఆందోళన

దాదాపు 20 ఏళ్ల సర్వీసు తర్వాత ఇప్పుడు పోటీ పరీక్ష రాయడం అంత సులభం కాదని టీచర్లు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా టెట్‌కు సన్నద్ధమై ఉతీర్ణత సాధించడం కష్టమనేది వారి వాదన. అందులోనూ గణితం, సైన్స్‌ టీచర్లకు టెట్‌ మరింత కష్టంగా మారనుంది. భాషా సబ్జెక్టులు, సోషల్‌ స్టడీస్‌లో దాదాపు సగం ప్రశ్నలు సంబంధిత సబ్జెక్టు నుంచి వస్తాయి. కానీ గణితం, ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌... మూడు సబ్జెక్టులకు కలిపి ఒకే పరీక్ష రాయాలి. ఆయా సబ్జెక్టుల్లో ఒక్కో దాని నుంచి 20 మార్కులకే ప్రశ్నలు వస్తాయి. దీంతో 150లో 20 మినహా మిగిలినవి ఇతర సబ్జెక్టులు, జనరల్‌ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. దీంతో ఆ సబ్జెక్టుల టీచర్లు మరింత ఆందోళనలో ఉన్నారు. 150 మార్కులకు జరిగే టెట్‌లో ఓసీలు 90 మార్కులు, బీసీలు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు 60 మార్కులు దక్కించుకుంటేనే ఉతీర్ణత సాధిస్తారు.


మినహాయింపు దక్కకపోతే?

ఇన్‌ సర్వీసు టీచర్లకు సుప్రీంలో మినహాయింపు దక్కకపోతే ఉద్యోగానికే ప్రమాదం ఏర్పడుతుంది. ఐదేళ్లకు మించి సర్వీసు ఉన్న టీచర్లు రెండేళ్లలోపు టెట్‌ ఉత్తీర్ణత సాధించాలి. లేనిపక్షంలో ఉద్యోగం కోల్పోతారు అని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోంది. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్నవారికి మాత్రం మినహాయింపు ఉంది. ఇప్పటికే పలు రాష్ర్టాల ప్రభుత్వాలు, ఉపాధ్యాయ సంఘాలు సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్లు వేశాయి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా వారితో పాటు రివ్యూ పిటిషన్‌ వేయనుంది. అయినా, సుప్రీంలో టెట్‌పై మినహాయింపు దక్కకపోతే పరిస్థితి ఏంటని టీచర్లలో ఆందోళన పెరుగుతోంది.

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి: యూటీఎఫ్‌

అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ఇన్‌ సర్వీసు టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ఆదివారం విజయవాడలో యూటీఎఫ్‌ రాష్ట్ర మధ్యంతర కౌన్సి ల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టెట్‌ మినహాయింపు కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులకు 12శాతం ఐఆర్‌ ప్రకటించాలని, ఆర్థిక బకాయి లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ గోపీమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2025 | 05:47 AM