Share News

దర్శికి తీపికబురు

ABN , Publish Date - Dec 10 , 2025 | 02:28 AM

దర్శి మునిసిపాలిటీ పరిధిలోని ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు అమృత్‌ పథకం అమలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఎన్నో సంవత్సరాలుగా వాయిదా పడుతూ వచ్చి తాజాగా టెండర్లు పిలవడంతో లైన్‌క్లియర్‌ అయింది.

దర్శికి తీపికబురు
దర్శి పట్టణంవ్యూ

‘అమృత్‌’ అమలుకు లైన్‌క్లియర్‌

టెండర్లు పిలిచిన అధికారులు

దర్శి, డిసెంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): దర్శి మునిసిపాలిటీ పరిధిలోని ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు అమృత్‌ పథకం అమలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఎన్నో సంవత్సరాలుగా వాయిదా పడుతూ వచ్చి తాజాగా టెండర్లు పిలవడంతో లైన్‌క్లియర్‌ అయింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కేంద్రప్రభుత్వం పట్టణాలకు అమృత్‌ పథకం కింద నిధులు విడుదల చేసింది. ఇం టింటికీ కొళాయి ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించాలన్నదే దీని ప్రధాన ఉద్దేశం.

గతంలో టెండర్‌ పిలిచి వదిలేశారు

అమృత్‌ పథకం కింద దర్శి మునిసిపాలిటీకి రూ.130.60 కోట్లు మంజూరయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వంలోనే టెండర్లు పిలిచారు. అప్పటి పాలకుల అసమర్థతతో టెండర్లు ఖారారైనప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మార్పులుచేసి పథకం ప్రారంభా నికి శ్రీకారం పలికారు. తాజాగా ఈనెల 6న టెండర్లు పిలిచారు. ఈనెల 2న టెండర్లు ఓపెన్‌ చేసి ప్రభుత్వా నికి నివేదిస్తారు. టెండర్లు ఖరారైన తర్వాత పనులు ప్రారంభమవుతాయని మునిసిపల్‌ ఈఈ శ్రీనివాస్‌ సంజీవ్‌ తెలిపారు.

30 ఏళ్లకు సరిపడా రూపకల్పన

దర్శి మునిసిపాలిటీలో 40వేల మందికిపైగా జనాభా ఉన్నారు. పట్టణ సమీపంలోని పులిపాడు చెరువును మంచినీటి చెరువుగా మార్చి ఫిల్టర్‌బెడ్లు ఏర్పాటు చేసి శుద్ధిజ లాలను పైపులైన్ల ద్వారా ఇంటింటికీ కొళాయి ద్వారా అందిస్తారు. రోజుకు 13 మిలియన్‌ లీటర్ల నీటిని శుద్ధిచేసేవిధంగా పథకాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 30 సంవత్సరాల వరకు పెరిగే జనాభాకు సరిపడా మంచి నీరు అందించేలా పథకాన్ని రూపకల్పన చేశారు. ‘అమృత్‌’ అమలైతే దర్శి మునిసిపాలిటీలోని ప్రజలకు తాగునీటి సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ప్రస్తుతం ఎన్‌ఏపీ రక్షిత పథకం ద్వారా నీరందిస్తున్నారు. అధిక శాతం పట్టణ ప్రజలకు ఇస్తున్నందున పథకంలోని శివారు గ్రామాలకు సక్రమంగా అందడం లేదు. అమృత్‌ పథకం అమలైతే ఎన్‌ఏపీ పథకం నీరు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలకు వినియోగించే అవకాశం ఉంటుంది. తద్వారా పల్లె ప్రజలకు తాగునీటి సమస్య తగ్గుతుంది.

Updated Date - Dec 10 , 2025 | 02:28 AM