డీఈవోగా రేణుక
ABN , Publish Date - Dec 10 , 2025 | 02:29 AM
జిల్లా విద్యాశాఖాధికారిగా సీవీ రేణుక నియమితులయ్యారు. ఈమేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆమె ప్రస్తుతం గుంటూరు డీఈవోగా ఉన్నారు. ఇప్పటి వరకూ ఇక్కడ పనిచేస్తున్న ఎ.కిరణ్‌కుమార్ గుంటూరు జిల్లా బోయపాలెం డైట్‌కు బదిలీ అయ్యారు.
బోయపాలెం డైట్‌కు కిరణ్‌కుమార్ బదిలీ
బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయనపై అనేక ఆరోపణలు
ఒంగోలు కలెక్టరేట్, డిసెంబరు 9 (ఆంఽధ్రజ్యోతి) : జిల్లా విద్యాశాఖాధికారిగా సీవీ రేణుక నియమితులయ్యారు. ఈమేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆమె ప్రస్తుతం గుంటూరు డీఈవోగా ఉన్నారు. ఇప్పటి వరకూ ఇక్కడ పనిచేస్తున్న ఎ.కిరణ్‌కుమార్ గుంటూరు జిల్లా బోయపాలెం డైట్‌కు బదిలీ అయ్యారు. కిరణ్‌కుమార్ డీఈవోగా గత ఏడాది అక్టోబరు 26న బాధ్యతలు స్వీకరించారు. 14 నెలలపాటు ఆయన పనిచేశారు. ఆరంభం నుంచే ఆయన వ్యవహారశైలిపై అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. బాధ్యతలు స్వీకరించిన వారంరోజుల్లోనే అప్పటి కలెక్టర్ అన్సారియా నిర్వహించిన సమావేశానికి గైర్హాజరవడంతో షోకాజ్ నోటీసు జారీచేశారు. ఆతర్వాత కూడా ఆయన వ్యవహారశైలిపై అనేక విమర్శలు వచ్చాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయుల బదిలీల్లో ఆయన సక్రమంగా వ్యవహరించలేదన్న ఆరోపణలు వచ్చాయి. బదిలీలను కోరుకునే సమయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని అప్పట్లో ఉపాధ్యాయులు ధ్వజమెత్తారు. మరోవైపు ప్రైవేటు పాఠశాలలకు అనుమతులు ఇచ్చే విషయంలో కూడా కిరణ్‌కుమార్‌పై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. అందుకోసం పెద్దమొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదులు వెళ్లడంతో దానిపై విచారణ కూడా చేశారు. మరోవైపు డీఈవో కార్యాలయంలో కూడా ఆయన అనేక ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన కార్యాలయంలో అందుబాటులో ఉండకుండా మరో చోట ఉంటూ అక్కడకు పైళ్లు తీసుకురావాలని ఆదేశాలు జారీచేయడంతో కార్యాలయ సిబ్బంది రాత్రి సమయంలో అనేక ఇబ్బందులు పడిన ఘటనలు కూడా ఉన్నాయి. మరోవైపు కిరణ్‌కుమార్ గతంలో పనిచేసిన చోట ఒక వేధింపుల కేసుపై ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు వెళ్లినట్లు సమాచారం. అన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం వెంటనే ఆయనపై బదిలీ వేటు వేసినట్లు తెలిసింది.