డ్రంక్ అండ్ డ్రైవ్.. అదుపులో ప్రైవేట్ బస్సు డ్రైవరు
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:13 PM
విజయవాడ నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో డ్రైవరు డ్రంక్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడ్డాడు. మార్టూరు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మండల పరిధిలోని బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. ఈ సంఘటనతో దాదాపు రెండు గంటల సేపు బస్సులోని ప్రయాణికులు స్టేషన్ వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విజయవాడ నుంచి బెంగళూరు వెళుతున్న ట్రావెల్ బస్సు
బొల్లాపల్లి టోల్‌ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు
రెండు గంటల సేపు బస్సులోని ప్రయాణికులు స్టేషన్ వద్ద పడిగాపులు
ఎట్టకేలకు రెండో డ్రైవరుతో బయలుదేరిన బస్సు
మార్టూరు, నవంబరు4(ఆంధ్రజ్యోతి) : విజయవాడ నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సులో డ్రైవరు డ్రంక్ డ్రైవ్ తనిఖీలలో పట్టుబడ్డాడు. మార్టూరు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి మండల పరిధిలోని బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద చోటుచేసుకుంది. ఈ సంఘటనతో దాదాపు రెండు గంటల సేపు బస్సులోని ప్రయాణికులు స్టేషన్ వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయవాడలో సాయంత్రం బెంగళూరుకు బయలుదేరిన ట్రావెల్ బస్సు సుమారు 9 గంటల సమయంలో బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద చేరుకుంది. ఈ క్రమంలో మార్టూరు ఎస్‌ఐ సైదా తన సిబ్బందితో కలిసి డ్రంక్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా బస్సు డ్రైవరు మద్యం సేవించి ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు బస్సు స్టేషన్‌కు తరలించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఊహించని విధంగా ప్రమాదాలు బారినపడుతుండటం, ప్రయాణికుల ప్రాణాలు పోతుండటంతో సీఐ శేషగిరిరావు జాతీయరహదారిపై ప్రత్యేక నిఘా చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా బస్సు డ్రైవరు పట్టుబడటంతో, ముందు జాగ్రత్త చర్యగా ప్రమాదాన్ని పోలీసులు నిలువరించగలిగారు. ఇదిలా ఉండగా తాము ప్రయాణిస్తున్న ట్రావెల్ బస్సు డ్రైవరు మద్యం సేవించి ఉన్నారన్న విషయం బయటపడటంతో ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. వారం రోజుల వ్యవధిలో ఉభయరాష్ట్రాలలో జరిగిన ప్రైవేటు ట్రావెల్ బస్సుల ప్రమాదాలలో జరిగిన సంఘటనతో భీతిల్లుతున్న ప్రయాణికులు ఈ సంఘటనతో దిగ్భాంత్రికి గురయ్యారు. పోలీసుల తనిఖీ వల్ల మద్యం మత్తులో ఉన్న డ్రైవరు కారణంగా తమ బస్సు ప్రమాదానికి గురికాకుండా కాపాడారని ప్రయాణికులు పోలీసులను అభినందించారు. ఎట్టకేలకు రాత్రి 10 గంటల 45 నిమిషాల తర్వాత బస్సుకు చెందిన రెండో డ్రైవరు ఆధ్వర్యంలో బస్సు స్టేషన్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. ప్రయాణికులను దగ్గరుండి సీఐ శేషగిరావు స్వయంగా బస్సులో ఎక్కించి పంపించారు. అదేవిధంగా డ్రంక్ డ్రైవ్‌లో పట్టుబడిన డ్రైవరుపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.