Police Investigation: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:40 AM
ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. బీజాపూర్ జిల్లా పామేడు పోలీసుస్టేషను పరిధిలో...
ఎక్స్‌కవేటర్ యజమాని గొంతుకోసి హత్య
చింతూరు, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. బీజాపూర్ జిల్లా పామేడు పోలీసుస్టేషను పరిధిలో ఇటీవల రహదారుల నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులోభాగంగా రహదారుల పనుల నిర్మాణ కాంట్రాక్టర్‌కు ఎక్స్‌కవేటర్‌ని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇంతియాజ్ అలీ అద్దెకు ఇచ్చారు. ఈ క్రమంలో రెండురోజుల క్రితం గుమస్తా బీరేంద్ర ఎక్స్‌వేటర్ పనిచేస్తున్న ప్రదేశానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న మావోయిస్టులు అతన్ని కిడ్నాప్ చేశారు. బీరేంద్రను మావోయిస్టుల చెరనుంచి విడిపించేందుకు ఇంతియాజ్ అలీ సోవవారం మావోయిస్టుల వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో మావోయిస్టులు ఇంతియాజ్‌ను బంధించి గొంతు కోసి హత్య చేశారు. ఇంతియాజ్ మృతదేహాన్ని రహదారిపై పడేసిన మావోయిస్టులు అక్కడి నుంచి రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు. బీరేంద్రను విడిచిపెట్టడంతో పామేడు చేరుకొని పోలీసులకు, ఇంతియాజ్ కుటుంబానికి సమాచారం అందించాడు. పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని ఇంతియాజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.