దర్జాగా కబ్జా
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:21 PM
అక్రమార్కుల ఆగడాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
రెచ్చిపోతున్న అక్రమార్కులు
ఆక్రమణకు గురవుతున్న కోట్ల విలువ చేసే భూములు
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
అక్రమార్కుల ఆగడాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని లక్షలు సంపాదిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలున్నాయి. పత్తికొండ పట్టణంలో 90 సెంట్ల స్థలాన్ని గతంలో సివిల్ సప్లై గోదాము నిర్మాణానికి అధికారులు కేటాయించారు. ఆ విలువైన స్థలంపై అక్రమార్కుల కన్ను పడింది. కబ్జా చేసేందుకు యత్నించినా మండగేరి వాసులు అడ్డుకున్నారు. సర్వే నెంబరు 306-3లో 5.1ఎకరా, 306-4లో 3.51 ప్రభుత్వ భూములున్నాయి. వీటిలోని కొంతభాగంలో వృద్ధాశ్రమం, దేవాలయం నిర్మించారు. మిగిలిన స్థలంలో కూడా పట్టాల రూపంలో అమ్ముకునేందుకు అక్రమార్కులు రంగం సిద్ధం చేసుకున్నారు.
పత్తికొండ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): పట్టణంలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను అక్రమార్కులు దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఆదోని రహదారిలో ప్రధాన రోడ్డు పక్కన ఉన్న 90 సెంట్ల స్థలంతో పాటు, ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న సుమారు మూడెకరాల స్థలంలో కన్నెసిన అక్రమార్కులు దర్జాగా వాటిని అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ శాఖాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఆశాఖలో పనిచేస్తున్న అధికారుల సహకారంతోనే ఈ తతంగం జరుగుతోందన్న ఆరోపణలున్నాయి.
సివిల్ సప్లై గోదాముకు కేటాయించిన స్థలం
పట్టణంలో ఆదోని రహదారిలో గల మండగేరి గ్రామపంచాయతీ సర్వే నెంబరు 616-2లో సుమారు 90 సెంట్ల స్థలాన్ని గతంలో సివిల్ సప్లై గోదాము నిర్మాణానికి అధికారులు కేటాయించారు. గతంలో పనిచేసిన కలెక్టరు, జాయింట్ కలెక్టరు కూడా ఈ స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలంలో గోదాము నిర్మాణం పెండింగ్ పడడంతో ప్రధాన రహదారి పక్కన ఉన్న ఆవిలువైన స్థలంపై అక్రమార్కుల కు కన్ను పడింది. ఆరు నెలల క్రితమే ఆస్థలంలో రాళ్లు పాతి ప్లాట్లు వేసేందుకు ప్రయత్నించారు. మండగిరికి చెందిన ప్రజలు తమ గ్రామ పరిధిలో గల ఆ స్థలంలో తమ గ్రామస్థులకే పట్టాలు కేటాయించాలని రాళ్లను తొలగించి ఆందోళనకు దిగారు. ఈ విషయంపై విచారణ చేసిన రెవెన్యూ అధికారులు ఆ స్థలంలో ఎవరికి పట్టాలు ఇవ్వమని, ప్రభుత్వ నిర్మాణాలకు వాడుకుంటామని వారికి తేల్చి చెప్పారు.
నకిలీ పత్రాలు అడ్డుపెట్టుకుని..
పది రోజుల క్రితం హోసూరుకి చెందిన వైసీపీ నాయకుడు 1998లోనే తనకు 6 సెంట్ల స్థలం కేటాయించినట్లు నకిలీ పత్రాలు అడ్డుపెట్టుకుని స్థలాన్ని చదును చేసుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు చదును చేసే యంత్రాన్ని స్టేషన్‌కు తరలించారు. పత్రాలను పరిశీలన కోసం తహసీల్దార్ కార్యాలయానికి పంపారు. ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టడంగాని, దానిపై వివరణ ఇవ్వడం గాని చేయలేదు.
వారం రోజుల క్రితం..
కోట్లు విలువచేసే స్థలంపై కన్నెసిన అక్రమార్కులు వారం రోజుల క్రితం తిరిగి రాళ్లు పాతి ఆస్థలాన్ని విక్రయించినట్లు తెలిసింది. 90 సెంట్లలో 20 మందికి 20ప్లాట్లుగా అనధికార లేఅవుట్ కూడా పూర్తిచేసినట్టు సమాచారం. ఇందుకు రెవెన్యూ అధికారులు తమవంతు సహకారం చేసినట్లు తెలిసింది. గతంలో ఇన్ చార్జి తహసీల్దార్‌గా పనిచేసి ఆదోనికి బదిలీపై వెళ్లిన ఓ అధికారి అక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ సస్పెండ్ అయ్యారు. సదరు అధికారి ఈ స్థలంలో పట్టాలు ఇచ్చినట్లు అక్రమార్కులు రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ రికార్డులు సృష్టించినట్లు సమాచారం.
సుమారు ఎకరా స్థలం..
పట్టణంలోని సర్వేనెంబరు 306-3లో 5.1ఎకరా, 306-4లో 3.51 ప్రభుత్వ భూములున్నాయి. ఈ స్థలాన్ని గతంలో ఇరిగేషన్ శాఖకు స్థలం కేటాయించగా కార్యాలయ నిర్మాణం జరగలేదు. ఇదే ప్రాంతంలో వృద్ధాశ్రమ నిర్మాణానికి గతంలో స్థలం మంజూరు చేయడంతో ఆశ్రమాన్ని ఏర్పాటుచేశారు. మరోవైపు అమ్మవారి దేవాలయాన్ని ఏర్పాటుచేయడంతో సుమారు ఎకరా స్థలం దేవాలయం హద్దులుగా జెండాలు పాతారు. గత ప్రభుత్వ హయాంలో మండలస్థాయి ప్రజాప్రతినిధి తన అనుచరులతో కలిసి భూమిని పట్టాలుగా మార్చి లక్షల రూపాయలకు అమ్ముకున్నాడు. ప్రస్తుతం మిగిలిన స్థలంలో కూడా పట్టాల రూపంలో అమ్ముకునేందుకు అక్రమార్కులు రంగం సిద్ధం చేసుకున్నారు.
పట్టాలు కేటాయించ లేదు
616-2లోగాని 306-3, 306-4లోగాని మేము ఎలాంటి పట్టాలను మంజూరు చేయలేదు. గతంలో తమకు పట్టాలు మంజూరు చేశారని, కొందరు ఆ స్థలాలను చదును చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈవిషయంపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నాం. అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
హుస్సేన్ సాహెబ్, తహసీల్దారు, పత్తికొండ