Share News

ఆలయాలకు కార్తీక శోభ

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:07 AM

కార్తీక సోమవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాలకు కార్తీక శోభ సంతరించుకుంది.

ఆలయాలకు కార్తీక శోభ
కర్నూలు నగరంలోని లలితాపీఠంలో కోలాట ప్రదర్శన

కర్నూలు కల్చరల్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): కార్తీక సోమవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాలకు కార్తీక శోభ సంతరించుకుంది. వివిధ ఆలయాల్లో, ధార్మిక క్షేత్రాల్లో కార్తీక మాస దీపోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు సామూహికంగా తరలి వచ్చిన ఈ దీపోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కర్నూలులోని పాతనగరంలోని శ్రీలలితా పీఠంలో పీఠాధిపతి గురు మేడా సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం లలితాదేవికి, సుందరస్వామి వార్లకు అభిషేకాలు, అర్చనలు, అష్టోత్తర పారాయణాలు నిర్వహించారు. సాయంత్రం మహిళలు పెద్ద సంఖ్యలో దీపోత్సవాల్లో పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని హరిహర క్షేత్రం, కొత్తపేటలోని రామాలయం, శివాలయం, షిరిడీ సాయిబాబా మందిరం, పాతనగరంలోని శివాలయం, పేట రామాలయం, నిమిషాంబాదేవి ఆలయం, అశోక్‌నగర్‌లోని మల్లికార్జున స్వామి ఆలయం, హనుమాన, ద్వారకామాయి ఆలయం, కేసీ కెనాల్‌ సమీపంలోని సత్యనారాయణ స్వామి ఆలయాల్లో మహిళలు సామూహిక దీపోత్సవాల్లో పాల్గొని పూజలు చేశారు.

Updated Date - Nov 04 , 2025 | 12:07 AM