Share News

ఆదోని జిల్లాపై సందిగ్ధం..

ABN , Publish Date - Dec 09 , 2025 | 11:15 PM

ఆదోని జిల్లా ఏర్పాటు గురించి మంగళవారం విజయవాడలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో జరిగిన జిల్లా నాయకుల భేటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఆదోని జిల్లా ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది.

ఆదోని జిల్లాపై సందిగ్ధం..
మాట్లాడుతున్న ఆదినారాయణరెడ్డి

ఎమ్మెల్యే పార్ధసారధి, టీడీపీ ఇన్‌చార్జి మీనాక్షి నాయుడుతో మంత్రి నిమ్మల భేటీ

నేడు రెవెన్యూ మంత్రి అనగానితో సమావేశం

నేడు ఆదోని బంద్‌కు పిలుపునిచ్చిన ప్రజాసంఘాలు

కర్నూలు, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆదోని జిల్లా ఏర్పాటు గురించి మంగళవారం విజయవాడలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో జరిగిన జిల్లా నాయకుల భేటీ సమావేశం అసంపూర్తిగా ముగిసింది. ఆదోని జిల్లా ఏర్పాటుపై సందిగ్ధత కొనసాగుతోంది. జిల్లా ఏర్పాటు చేయాల్సిందే అంటూ ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదోని జిల్లా సాధన అనే డిమాండ్‌ పశ్చిమ ప్రాంత ప్రజల సెంటిమెంటుగా మారింది. రిలే నిరాహారదీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు ర్యాలీలు వంటి నిరసనలతో ప్రజా ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతు న్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు సీఎం చంద్రబాబును కలిసి ప్రజల ఆకాంక్షను వివరించారు. ఇప్పటికే ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి ఆదోని జిల్లాతో పాటు నియోజకవర్గాన్ని నాలుగు మండలాలుగా విభజించాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రజా ఆందోళనల ఉధృతం నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్థానిక నాయకులతో చర్చించాలంటూ జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయిన నిమ్మల రామానాయుడుకు సూచించారు. అందులో భాగంగానే మంగళవారం జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఆదోని ఎమ్మెల్యే డా. పార్థసారధి, టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడుతో ఇన్‌చార్జి మంత్రి అయిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల ఆదోని జిల్లా ఏర్పాటు పై సుదీర్ఘంగా చర్చించారు. ఏర్పాటు ఆవశ్యకత, వనరులు, స్థానిక పరిస్థితులు, నైసర్గిక స్వరూపం తదితర అంశాలను నిమ్మల అడిగి తెలుసుకున్నారు. అదే క్రమంలో ఎన్నికల ముందుగానీ, ఆ తర్వాత అంతకుముందు కూటమి ప్రభుత్వం గానీ, కూటమి పార్టీలు గానీ ఏమైనా హామీలు ఇచ్చాయా? అంటూ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారఽథి, ఇన్‌చార్జి మీనాక్షినాయుడు ఆదోని జిల్లా సాధన ఉద్యమం ఉధృతం అవుతున్న తీరు వివరించారు.

రెవెన్యూ మంత్రి అనగానితో మరో భేటీ:

ఆదోని జిల్లా ఏర్పాటుపై మంత్రివర్గ ఉప సంఘం కన్వీనర్‌, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో బుధవారం మరోసారి జిల్లా నాయకులు భేటీ కానున్నారు. ఈ భేటీలో ఇన్‌చార్జి మంత్రి నిమ్మల, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, ఎమ్మెల్యే పార్థసారధి, టీడీపీ ఇన్‌చార్జి మీనాక్షినాయుడుతో పాటు ఎమ్మిగనూరు, పత్తికొండ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. సుదీర్ఘ చర్చల అనంతరం తుది నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేస్తారు. జిల్లా ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే.. జనవరి 1వ తేదీ నుంచి జనగణన చేపట్టనుండటంతో ఆదోని జిల్లా ఏర్పాటు సాధ్యమా.. ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందాని పలువురు చర్చిస్తున్నారు.

నేడు ఆదోని బంద్‌

ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ నియోజకవర్గాలను కలుపుతూ ఆదోనిని నూతన జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ రోజురోజుకూ బలపడుతోంది. వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఆదోని జిల్లా సాధన సమితి, జేఏసీ ఆధ్వర్యంలో ఆదోని బంద్‌కు పిలుపునిచ్చారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య దుకాణాలు బంద్‌ చేయనున్నారు. వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛంద బంద్‌కు ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది.

ఈ సమావేశంలో విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్‌ అరుణ్‌, రైతు కూలీ సంఘం నాయకులు సుంకన్న తదితరులు మాట్లాడుతూ ఆదోని జిల్లా ఏర్పాటు కోసం ప్రజలు మరింతగా పోరాడాలని వారు తెలిపారు.

శాస్త్రీయంగా మండల విభజన చేయాలి : ఆదినారాయణరెడ్డి

ఏ గ్రామ ప్రజలకూ ఇబ్బంది లేకుండా ఆదోని మండలాన్ని విభజన చేయాలని పెద్దహరివాణం మండల సాధన సమితి కన్వీనర్‌ ఆదినారాయణరెడ్డి కోరారు. మంగళవారం కర్నూలులోని ప్రజా వైద్యశాల సమావేశ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదోని మండలంలోని ఆరు గ్రామాలు, హొళగుంద మండలంలోని 6 గ్రామాలు, కౌతాళం మండలంలోని ఒక గ్రామం కలిపి 13 గ్రామాలతో మండలం ఏర్పాటు చేయాలని తాము మొదటి నుంచి డిమాండ్‌ చేశామని తెలిపారు. ప్రభుత్వం ఆదోని మండలంలోని 17 గ్రామాలతో పెద్దహరివాణం మండలం ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిందని, మిగిలిన 16 గ్రామాలు దీనిని వ్యతిరేకిస్తున్నట్లు ప్రజల్లో గందరగోళం సృష్టించడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలోనే అతి పెద్ద మండలమైన ఆదోని మండలాన్ని ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా విభజన చేయాలని, సూదూర గ్రామాలను సమీప మండలంలోనే ఉంచాలని కోరారు. ప్రభుత్వం 13 గ్రామాలతో పెద్దహరివాణం మండలం ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని, అదే క్రమంలో ప్రజా ఆకాంక్షను అర్థం చేసుకుని ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు.

Updated Date - Dec 09 , 2025 | 11:15 PM