కొర్రీల సీసీఐ
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:06 AM
భారీ వర్షాలు, తుఫానలతో తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను సీసీఐ మరింతగా వేధిస్తోంది. అనేక సాకులతో కొర్రీలు పెట్టి ఇబ్బందులపాలు చేస్తోంది.
నిబంధనల పేరిట రైతులకు ఇబ్బందులు
స్లాట్ బుక్ చేసుకున్నా సమస్యలే..
రోడ్డెక్కిన పత్తి రైతులు
కర్నూలు- కోడుమూరు రహదారిలో భారీగా వాహనాలు
(ఆంధ్రజ్యోతి, కర్నూలు)
భారీ వర్షాలు, తుఫానలతో తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను సీసీఐ మరింతగా వేధిస్తోంది. అనేక సాకులతో కొర్రీలు పెట్టి ఇబ్బందులపాలు చేస్తోంది. అరకొరగా చేతికి వచ్చిన పత్తిని అమ్ముకుందామంటే సీపీఐ రోజుకో మాట చెప్పి ఆందోళనకు గురి చేస్తోంది. రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు కాటన కార్పొరేషన ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ రోజుకో నిబంధన జారీ చేస్తుండటంతో పత్తి విక్రయాలకు అటంకాలు కలుగుతున్నాయి. సోమవారం వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు గూడూరు మండలం పెంచికలపాడు పత్తి జిన్నింగ్ కేంద్రంలోని సీసీఐ కేంద్రానికి వాహనాల్లో పత్తి తీసుకొని చేరుకున్నారు. ఉదయం 8.30 గంటలకు అధికారులు కొనుగోలు ప్రారంభించారు. ఎకరాకు ఆరు క్వింటాళ్లు మాత్రమే కొంటామని, ఇది ప్రభుత్వ తాజా నిర్ణయమని అన్నారు. ముందస్తుగా రైతులు స్లాట్ బుక్ చేసుకున్నా.. తమ కంప్యూటరులో చూపడం లేదని, కాబట్టి పత్తి కొనమని తేల్చి చెప్పారు. దీంతో ఆగ్రహించిన పత్తి రైతులు ఎకరాకు పది క్వింటాళ్ల నిబంధనతో ఆనలైనలో ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకున్నామని, ఇప్పుడు మళ్లీ కొత్త నిబంధనల పేరుతో అన్యాయం చేస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. కర్నూలు-కోడుమూరు ప్రధాన రోడ్డుపై పత్తి వాహనాలు అడ్డం పెట్టి ధర్నాకు దిగారు. సీసీఐ కేంద్రాన్ని ముట్టడించారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. గంటకు పైగా రాస్తారోకో చేయడంతో వాహనాలు బారులు తీరాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, సీసీఐ గుంటూరు జనరల్ మేనేజర్‌తో మాట్లాడి తక్షణమే కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.
ట్రాఫిక్‌లో ఇరుక్కున్న ఎంపీ బస్తిపాటి :
ఆలూరు మండలం పెద్దహొత్తూరులో జరిగే ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు బయలుదేరారు. పెంచికలపాడుకు చేరుకోగానే రైతుల ధర్నాతో వాహనాలు బారులు తీరడంతో ఎంపీ ట్రాఫిక్‌లో ఇరుక్కున్నారు. అక్కడి నుంచి సీసీఐ కేంద్రానికి వెళ్లి రైతులతో మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, గుంటూరులో ఉంటున్న సీసీఐ కేంద్రం మేనేజర్‌కు ఫోన్లు చేసి నిబంధనలు, సాంకేతిక సమస్యల పేరుతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, తక్షణమే కొనుగోలు చేపట్టాలని గట్టిగా నిలదీశారు. ఎట్టకేలకు సీసీఐ అధికారులు కొనుగోలు చేసి తుకాలు వేస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు.
స్లాట్ బుక్ చేసుకున్నా తూకాలు వేయమన్నారు
పెంచికలపాడు వద్ద ఉన్న జిన్నింగ్ పరిశ్రమలోని సీసీఐ కేంద్రంలో పత్తి అమ్మకానికి స్లాట్ బుక్ చేసుకున్నాం. సోమవారం 30 క్వింటాళ్ల పత్తి తీసుకువచ్చాను. ఇక్కడ మా వివరాలు లేవని, పత్తి కొనుగోలు చేయమని సీసీఐ అధికారులు చెబుతున్నారు.
-మధు, కె. మార్కాపురం, కల్లూరు మండలం
నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు
పత్తి ధరలు పతనమయ్యాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాలకు అమ్ముదామని వస్తే.. నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతున్నారు. ఎకరాకు 6 క్వింటాళ్ల మించి తీసుకోమంటున్నారు. రైతులంటే అధికారులకు అలుసుగా మారింది.
- ఆర్. రామకృష్ణ, పత్తిరైతు, కల్లూరు మండలం