Share News

రిటైర్డ్‌ అయ్యాక... వ్యవసాయం చేస్తా..: కలెక్టర్‌

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:10 AM

‘వ్యవసాయం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను కలెక్టర్‌గా పనిచేసి రిటైర్డ్‌ అయ్యాక వ్యవసాయం చేస్తా..’ అని కలెక్టర్‌ డాక్టర్‌ సిరి అన్నారు.

రిటైర్డ్‌ అయ్యాక... వ్యవసాయం చేస్తా..: కలెక్టర్‌
మాట్లాడుతున్న కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. సిరి

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘వ్యవసాయం అంటే నాకు ఎంతో ఇష్టం. నేను కలెక్టర్‌గా పనిచేసి రిటైర్డ్‌ అయ్యాక వ్యవసాయం చేస్తా..’ అని కలెక్టర్‌ డాక్టర్‌ సిరి అన్నారు. సోమవారం కర్నూలు నగరంలోని ఏ. క్యాంపులో ఉన్న ఉద్యాన భవనంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రజాభాగస్వామ్య ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ట్రైనీ ఇంటర్నల్‌ క్లస్టర్‌ రీసోర్స్‌ పర్సన్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయం అంటే తనకు చాలా ఇష్టమని, పదవి విరమణ పొందిన అనంతరం వ్యవసాయం చేస్తానని తెలిపారు. వైజాగ్‌లో తాను జాయింట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో సహజ వ్యవసాయం ఎక్కువగా అరకు, పాడేరు ప్రాంతాల్లో రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించామన్నారు. సహజ వ్యవసాయం ద్వారా పండించిన పంట ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్‌ ఉంటుందన్నారు. ప్రస్తుత ప్రజలు అనేక రోగాలతో సతమతమవుతున్నారని, నాణ్యత కలిగిన పంట ఉత్పత్తులపై ఆసక్తి పెంచుకుంటున్నారన్నారు. అందువల్ల రైతులు ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించాలన్నారు. భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతుల మీదే ఉందన్నారు. పురుగుల మందులు ఎక్కువగా రైతులు ఉపయోగించడం వల్ల భూమి దెబ్బతింటుందని, కాలుష్యం పూర్తిగా కంట్రోల్‌ తప్పుతుందన్నారు. నేల సారవంతం కోల్పోయి దిగుబడి తగ్గిపోతాయన్నారు. తాను జిల్లాకు కలెక్టర్‌గా వచ్చిన వెంటనే ఉల్లి సమస్యను ఎదుర్కోవడం జరిగిందన్నారు. మహారాష్ట్రతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల్లో ఉల్లి పంటను అధికంగా సాగు చేయడం వల్ల కర్నూలు జిల్లా ఉల్లికి డిమాండ్‌ తగ్గిందన్నారు. ఈ సమావేశంలో జేడీ వరలక్ష్మి, ఇనచార్జి ఉద్యా న శాఖ అధికారి మదనమోహన గౌడు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శాలురెడ్డి, ప్రాజెక్టు మేనేజర్‌ మాధురి పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 12:10 AM