అంతకుమించి..
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:54 AM
జోగి రమేశ్ ఆస్తుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తనకు రూ.10 కోట్ల ఆస్తులే ఉన్నాయని ప్రకటించుకున్న ఆయన రూ.25 కోట్లు పెట్టి అంబాపురంలో అగ్రిగోల్డ్ ఆస్తులు కొన్నారా? లేదా ఆక్రమించుకున్నారా? అనే అనుమానాలతో పాటు ఆయన బినామీల ఆస్తులు, మంత్రిగా ఉన్న సమయంలో కొన్న స్థలాల లెక్కలు తీస్తే ఆశ్చర్యం కలగకమానదు.
వైసీపీ నేత జోగి రమేశ్ అక్రమాల అంతస్థులెన్నో..
తన ఆస్తి రూ.10 కోట్లు.. అప్పులున్నాయని జోగి ప్రకటన
అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల విలువే రూ.25 కోట్లు
జోగి పీఏ కొన్న భవనం విలువ రూ.1.30 కోట్లు
అవికాక మైలవరం, హైదరాబాద్‌లో భూముల కొనుగోలు
నకిలీ మద్యం వ్యాపారంతోనే కొన్నారా? అనే అనుమానాలు
కల్తీ మద్యం కేసులో అరెస్టయిన మాజీమంత్రి, వైసీపీ నేత
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : తనకు రూ.10 కోట్ల ఆస్తులే ఉన్నాయంటున్న మాజీమంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ కుటుంబం అంబాపురంలో రెవెన్యూ-సీఐడీ నిర్ధారించిన అగ్రిగోల్డ్ భూములను ప్రైవేట్ వ్యక్తి వద్ద కొన్నామని చెబుతోంది. కొద్దిరోజుల ముందు ఓ టీవీ చానల్‌లో జోగి రమేశ్ ఈ విషయం చెప్పడం విడ్డూరంగా ఉంది. ఈ అగ్రిగోల్డ్ భూముల విలువ రూ.25 కోట్ల వరకు ఉంటుంది. రూ.10 కోట్ల ఆస్తులు కలిగి, చాలా అప్పులు ఉన్నాయని చెబుతున్న జోగి రమేశ్‌కు రూ.25 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్నది చర్చనీయాంశంగా మారింది.
అగ్రిగోల్డ్ భూములు కొన్నారా? కొట్టేశారా?
అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూములను కొనకుండా తప్పుడు డాక్యుమెంట్లు, ఫోర్జరీ పత్రాలతో రిజిస్ర్టేషన్ చేయించుకున్నారని జోగి రమేశ్‌పై అభియోగం. తాను అసలు భూములే అమ్మలేదని పోలవరపు మురళీమోహన్ అనే వ్యక్తి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. జోగి రమేశ్ మాత్రం ఇప్పటికీ తాము ఆ భూములను కొన్నామనే చెబుతున్నారు. ఈ భూములను కొంటే ఆస్తికి మించి డబ్బు ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? కల్తీ మద్యం వ్యాపారం నుంచే వచ్చిందా? అనే విషయంపై చర్చ నడుస్తోంది.
అనుచరులకు అన్ని ఆస్తులా..?
జోగి రమేశ్ అనుచరులు కూడా భారీగా ఆస్తులు కొనడంపై అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. జోగి పీఏ ఆరేపల్లి రాము ఆయన బినామీ అని అందరూ అంటుంటారు. తన పీఏ భారీ జీతం కూడా తీసుకోలేదని చెబుతున్న రాము రూ.1.30 కోట్లతో ఇబ్రహీంపట్నంలో రెండంతస్థుల భవనాన్ని ఎలా కొన్నాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ భవనాన్ని జోగి రమేశ్ తన బినామీ పేరుతో కొన్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో మైలవరం నియోజకవర్గంలో దాదాపు 50 ఎకరాలు కొన్నట్టు సమాచారం. ఇవికాకుండా హైదరాబాద్‌లో మరో 10 ఎకరాలు కొన్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల అఫిడవిట్ లెక్కలు తప్పా..?
2024 ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్‌లో తాను, తన భార్య స్థిరచరాస్తులన్నీ కలిపి రూ.4 కోట్లుగా జోగి రమేశ్ చూపారు. అప్పులు మాత్రం అంతకుమించే ఉన్నట్టు తెలిపారు. ఇలాంటపుడు జోగి రమేశ్ తనకు రూ.10 కోట్ల మేర ఆస్తులు ఉన్నాయని తాజాగా చెప్పడం ఎన్నికల సంఘానికి కూడా తప్పుదారి పట్టించినట్టే అవుతుంది. జోగి రమేశ్ గతంలో ఒక పాత పెంకుటిల్లులో ఉండేవారు. రూ.10 కోట్లతో ఆధునిక భవనాన్ని ఎలా సమకూర్చుకున్నారో? ఆయనే చెప్పాలి. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నకిలీ మద్యం వ్యాపారం నుంచే వచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.