Share News

World Smart City Forum President: దొనకొండలో అంతర్జాతీయ క్యాన్సర్‌ సెంటర్‌

ABN , Publish Date - Nov 04 , 2025 | 04:36 AM

ప్రకాశం జిల్లా దొనకొండలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాన్సర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని వరల్డ్‌ స్మార్ట్‌ సిటీస్‌ ఫోరం(డబ్ల్యూఎస్‌సీఎఫ్‌- సౌత్‌ కొరియా) అధ్యక్షుడు పీటర్‌ చున్‌ తెలిపారు.

World Smart City Forum President: దొనకొండలో అంతర్జాతీయ క్యాన్సర్‌ సెంటర్‌

  • 4,800 కోట్లతో ఏర్పాటు.. వరల్డ్‌ స్మార్ట్‌ సిటీ ఫోరం అధ్యక్షుడు పీటర్‌ చున్‌ వెల్లడి

విజయవాడ సిటీ, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా దొనకొండలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్యాన్సర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని వరల్డ్‌ స్మార్ట్‌ సిటీస్‌ ఫోరం(డబ్ల్యూఎస్‌సీఎఫ్‌- సౌత్‌ కొరియా) అధ్యక్షుడు పీటర్‌ చున్‌ తెలిపారు. చన్‌ జాంగ్‌ యున్‌ చల్లా పేరుతో 25 ఎకరాల్లో రూ. 4,800 కోట్లతో ఈ సెంటర్‌ను నెలకొల్పనున్నట్లు వివరించారు. విజయవాడలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సోమవారం ఆయన ఈ వివరాలు వెల్లడించారు. చన్‌ జాంగ్‌ యున్‌ క్యాన్సర్‌ సెంటర్‌ ఇప్పటికే చెన్నైలో ప్రారంభించామని తెలిపారు. క్యాన్సర్‌ సెంటర్‌ విస్తరణలో భాగంగా మందుల తయారీ సైతం ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్న సమయంలో చల్లా గ్రూప్‌ అధినేత ప్రసాద్‌ సూచన మేరకు ఏపీలో తమ సేవలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఓమెక్సా బయోలజీస్‌, ఎంఏసీఈ, చల్లా గ్రూప్‌, ఐ హోల్డింగ్‌ కంపెనీల భాగస్వామ్యంతో ఈ క్యాన్సర్‌ సెంటర్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించి ఉచితంగా ఆపరేషన్‌లు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాక ఈ క్యాన్సర్‌ సెంటర్‌ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చామని, ఈ సెంటర్‌ ద్వారా 4 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. చల్లా గ్రూప్‌ అధినేత చల్లా ప్రసాద్‌ మాట్లాడుతూ, తెలుగు రాష్ర్టాల్లోని పేదలకు ఈ క్యాన్సర్‌ సెంటర్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం భాగస్వామ్య సంస్థల మధ్య ఎంవోయులు జరిగాయి.

Updated Date - Nov 04 , 2025 | 04:36 AM