Share News

Registration Department: ఇదేంది సారూ.. ఇలా చేశారు?!

ABN , Publish Date - Dec 01 , 2025 | 04:59 AM

సబ్‌రిజిస్ట్రార్‌ ఆనందరెడ్డికి రేణిగుంటలోనే డిప్యుటేషన్‌పై పోస్టింగ్‌ ఇవ్వడం వెనక ఏం జరిగింది? అక్కడే ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వాలని ఎవరు నిర్ణయించారు? ఎవరు ఆదేశించారు..

Registration Department: ఇదేంది సారూ.. ఇలా చేశారు?!

  • సబ్‌రిజిస్ట్రార్‌ ఆనందరెడ్డికి పోస్టింగుపై వివరణ పేరిట అసలు గుట్టు రట్టు!

  • రిజిస్ట్రేషన్‌ ఐజీ అంబేడ్కర్‌ వివరణపై అనేక అనుమానాలు

  • వేర్వేరు జిల్లాల డీఐజీలు ఆనందరెడ్డి అక్రమాలు నిర్ధారించారు

  • ఆయన సస్పెన్షన్‌ను హైకోర్టు ఆపేస్తే ఎందుకు అప్పీల్‌కు వెళ్లలేదు?

  • ప్రభుత్వ నిర్ణయం కోసం ఎందుకు ఎదురుచూడలేదు.. రిజిస్ర్టేషన్‌ వర్గాల్లో చర్చ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సబ్‌రిజిస్ట్రార్‌ ఆనందరెడ్డికి రేణిగుంటలోనే డిప్యుటేషన్‌పై పోస్టింగ్‌ ఇవ్వడం వెనక ఏం జరిగింది? అక్కడే ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వాలని ఎవరు నిర్ణయించారు? ఎవరు ఆదేశించారు? ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను హైకోర్టు కొట్టివేసినప్పుడు.. రిజిస్ట్రేషన్‌ ఎందుకు అప్పీల్‌కు వెళ్లలేదు..? ..ఆరాతీస్తే తెరవెనుక చాలా పరిణామాలే చోటుచేసుకున్నట్లు స్పష్టమవుతోంది. దీనికి తోడు ఆయన పోస్టింగ్‌కు ముందు, తర్వాత జరిగిన వ్యవహారాలపై రిజిస్ట్రేషన్‌ శాఖ కమిషనర్‌-ఐజీ అంబేడ్కర్‌ ఇచ్చిన వివరణ పరిశీలిస్తే ఎక్కడా లేని అనుమానాలు, సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖలో బరితెగింపు ‘పోస్టింగ్‌’పై ‘మంత్రి చెబితే మాకేంటి’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ గత శుక్రవారం (28వ తేదీన) ప్రచురించిన కథనంపై ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి వివరణ ఇస్తే.. అందులో హేతుబద్ధత ఉండాలి. కానీ ఐజీ వివరణ సరికొత్త సందేహాలను లేవనెత్తుతోంది. ప్రభుత్వంతో సంబంధం లేకుండా జరిగిన నిర్ణయాల వెనుక ఏదో దాచినట్లు కనిపిస్తోంది. పైగా ఆయన ఓ విభాగాధిపతిగా చేయాల్సిన పనిచేయలేదని, అది ఆనందరెడ్డికి భారీ ప్రయోజనం కలిగించిందని స్పష్టమవుతోంది.


ప్రభుత్వ నిర్ణయం రాకముందే జాయినింగ్‌ రిపోర్టా?

ఆనందరెడ్డి తన సస్పెన్షన్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తొలి ప్రతివాదిగా రెవెన్యూ శాఖ (రిజిస్ట్రేషన్‌) స్పెషల్‌ సీఎస్‌ ఉన్నారు. రెండో ప్రతివాదిగా రిజిస్ట్రేషన్‌ కమిషనర్‌-ఐజీ, మూడో ప్రతివాదిగా చిత్తూరు డీఐజీ ఉన్నారు. నిబంధనల ప్రకారం.. హైకోర్టు ఆదేశాల నేపఽథ్యంలో సబ్‌రిజిస్ట్రార్‌ ఆనందరెడ్డిపై విధించిన సస్పెన్షన్‌ను తొలగించి.. పోస్టింగ్‌ ఇవ్వాల్సింది స్పెషల్‌ సీఎస్‌. అంటే ప్రభుత్వమే ఆ పనిచేయాలి. దాని నిర్ణయం రాకముందే ఆనందరెడ్డి 20వ తేదీనే చిత్తూరు డీఐజీ ముందు జాయినింగ్‌ రిపోర్టు ఎలా ఇచ్చారు? తర్వాత తనకు ఇంతకుముందు ఇచ్చిన రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌ పోస్టు తిరిగి ఇవ్వాలంటూ 24వ తేదీన రిజిస్ట్రేషన్‌ ఐజీ, స్పెషల్‌ సీఎ్‌సకు విడివిడిగా వినతిపత్రాలు సమర్పించారు. సస్పెన్షన్‌ ఎత్తివేయకుండానే 20నే ఆయన ఎలా జాయినింగ్‌ రిపోర్టు ఇచ్చారనేది ప్రశ్న.

తనకు పోస్టింగ్‌ ఇవ్వాలన్న ఆనందరెడ్డి వినతిపత్రంపై ఫైలు తయారు చేసి 24వ తేదీన స్పెషల్‌ సీఎస్‌కు ఐజీ ఫైలు పంపారు. ఇక ఆయన చేయడానికి ఏమీలేదు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూడాలి. కానీ.. అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఆనందరెడ్డి విషయంలో చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఇన్‌చార్జి డీఐజీకి అంబేడ్కర్‌ లిఖితపూర్వక ఆదేశాలిచ్చారు. ఏ నిబంధన కింద ఈ ఆదేశాలిచ్చారు? కోర్టు ఉత్తర్వులపై ప్రభుత్వం (స్పెషల్‌ సీఎస్‌) నిర్ణయం తీసుకోకుండానే.. నిర్ణయం తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారిని ఐజీ ఎలా ఆదేశిస్తారు? ఇదే అసలు విషయం. ఇలా ఆదేశం ఇవ్వడం వెనకున్న కారణం ఏమిటన్నదే చర్చనీయాంశంగా మారింది.


మంత్రి తిరస్కరించారుగా..!

రేణిగుంటలో ఆనందరెడ్డిని డిప్యుటేషన్‌పై సబ్‌రిజిస్ట్రార్‌గా నియమించాలన్న ప్రతిపాదనను 26వ తేదీన రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తిరస్కరించారు. ఫైలును వెనక్కి పంపించారు. కానీ రేణిగుంట డిప్యుటేషన్‌ను తిరస్కరించాలని తాను 24నే ప్రతిపాదన పంపించానని ఐజీ తెలిపారు. అదే నిజమైతే ఆనందరెడ్డికి రేణిగుంటలో పోస్టింగ్‌ ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించింది ఎవరు? మంత్రి ఎందుకు తిరస్కరించారు..?

ఆనందరెడ్డికి రేణిగుంటలో డిప్యుటేషన్‌ ఇవ్వకూడదనుకుంటే.. అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని చిత్తూరు డీఐజీని 26వ తేదీన ఐజీ ఎలా ఆదేశించారు? మరుసటి రోజునే.. అంటే 27వ తేదీన ఆనందరెడ్డి కోరుకున్నట్లుగా రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌గా డిప్యుటేషన్‌ ఇస్తూ చిత్తూరు ఇన్‌చార్జి డీఐజీ ఉత్తర్వులు ఇచ్చారు. ఇదెలా సాధ్యమైందో ఐజీ చెప్పాల్సి ఉంది. నిబంధనలు, బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం.. ప్రభుత్వం వద్దన్నా ఓ జిల్లా స్థాయి అధికారి ఎలా ఉత్తర్వులు ఇచ్చారు? పైగా ఆ ఉత్తర్వులో ఐజీ లేఖను ప్రస్తావించారు కూడా. అంబేడ్కర్‌ చెబుతున్న ప్రకారం.. డిప్యుటేషన్‌ రద్దుచేయాలని 24నే ఆయన ప్రతిపాదన పంపిస్తే.. అందుకు పూర్తి విరుద్దంగా.. 26న ఐజీ రాసిన లేఖను ఉటంకిస్తూ చిత్తూరు డీఐజీ రేణిగుంటలో ఆనందరెడ్డికి పోస్టింగ్‌ ఎలా ఇచ్చారు? అంటే ఈ విషయంలో ఇంకేదో జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన పై అధికారి నిర్ణయానికి విరుద్ధంగా.. ప్రభుత్వ నిర్ణయం రాకుండానే ఆనందరెడ్డికి రేణిగుంటలోనే పోస్టింగ్‌ ఇవ్వడంలో ఒక్క చిత్తూరు ఇన్‌చార్జి డీఐజీ పాత్ర మాత్రమే ఉందా?

ఇందులో మరో కీలకమైన కోణం ఉంది. ఇద్దరు డీఐజీలు వేర్వేరుగా జరిపిన విచారణల్లో ఆనందరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని తేలింది. ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ కొట్టివేస్తే.. ఆ వెంటనే అప్పీల్‌కు ఎందుకు వెళ్లలేదు? ఆ పని చేయకుండా స్పెషల్‌ సీఎస్‌, ఐజీని ఎవరైనా ఆపారా? ఈ వ్యవహారంలో నిజంగా ప్రభుత్వం తప్పుచేసిందా.. లేక ఆనందరెడ్డిని కాపాడేందుకే ఉన్నతాధికారులు అప్పీల్‌కు వెళ్లకుండా ఆగిపోయారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభుత్వం నిష్పాక్షిక విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు.


ఇదీ ఆనందరెడ్డి కథ..

రిజిస్ట్రేషన్‌ శాఖలో చిత్తూరు జిల్లా ఆడిట్‌ విభాగంలో ఉద్యోగం చేస్తున్న ఆనందరెడ్డికి ఈ ఏడాది మార్చి 10న తిరుపతి జిల్లా రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌గా డిప్యుటేషన్‌పై పోస్టింగ్‌ ఇచ్చారు. ఆయన అక్కడ అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అక్టోబరు 14న ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం అనంతపురం రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీని అక్టోబరు 16న ఆదేశించింది. ఆనందరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని నిగ్గుతేలుస్తూ ఆయన 18న నివేదిక ఇచ్చారు. ఇంకా ఈ విషయంలో సమగ్ర విచారణ అవసరమని సిఫారసు చేశారు. దీంతో రెండో దఫా నెల్లూరు డీఐజీని విచారణకు నియమించారు. ఆనందరెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఆయనా నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన్ను సస్పెండ్‌ చేయాలని రిజిస్ట్రేషన్‌ ఐజీ నవంబరు 11న చిత్తూరు రిజిస్ట్రేషన్‌ డీఐజీని ఆదేశించారు. ఆయన ఆనందరెడ్డిని సస్పెండ్‌ చేశారు.

హైకోర్టు సస్పెండ్‌ చేశాక..

తనను సస్పెండ్‌ చేయడాన్ని ఆనందరెడ్డి హైకోర్టులో సవాల్‌ చేశారు. సస్పెన్షన్‌ ఉత్తర్వును కోర్టు సస్పెండ్‌ చేసింది. దీంతో తన సస్పెన్షన్‌ ఉత్తర్వును రద్దుచే యాలని ఆనందరెడ్డి నవంబరు 24న రెవెన్యూ (రిజిస్ట్రేషన్‌) స్పెషల్‌ సీఎస్‌, రిజిస్ట్రేషన్‌ ఐజీకి వినతిపత్రం సమర్పించారు. ఆ విన్నపాన్ని ప్రభుత్వ పరిశీలనకు అదే రోజు (24వ తేదీ) పంపించినట్లు ఐజీ తన వివరణలో పేర్కొన్నారు. రేణిగుంట సబ్‌ రిజిస్ట్రార్‌గా డిప్యుటేషన్‌ను రద్దుచేయాలని తాను ప్రభుత్వానికి అదే రోజు సిఫారసు చేశానన్నారు. అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఆనందరెడ్డి విషయంలో చర్యలు తీసుకోవాలని చిత్తూరు డీఐజీని ఆదేశిస్తూ 26వ తేదీన లేఖ రాశానని సుస్పష్టంగా తెలియజేశారు. ‘ఆంధ్రజ్యోతి’ కథనంలో పేర్కొన్న అంశాల్లో అధికారుల వైఫల్యం లేదని.. ఎవరి తప్పూ లేదని, అన్నీ కాకతాళీయంగానే జరిగిపోయాయన్నట్లుగా ఆయన వివరణ ఉంది. కానీ ఆయన సదరు వివరణ ద్వారా అనేక అనుమానాస్పద అంశాలను ప్రభుత్వాన్ని, విభాగాధిపతిని ఇరకాటంలో పడేసే ప్రశ్నలుగా మలిచారు.

Updated Date - Dec 01 , 2025 | 05:03 AM