ఇంత ‘చిన్న’ చూపేంటి?
ABN , Publish Date - Dec 10 , 2025 | 01:06 AM
గోదావరి జిల్లాలో నీరు పుష్కలంగా ఉంటుందనేది చాలామంది అభిప్రాయం. కానీ ఇక్కడా మెట్ట ప్రాంతం ఉంది. అటు కాలువల నీరూ, ఇటు బోరు నీరు కూడా లభ్యంకాని పొలాలు వేలాది హెక్టార్లలో ఉన్నాయి. వీటిని సాగు చేయడానికి గతంలో ఏర్పాటుచేసిన చిన్న నీటిపారుదల వ్యవస్థ నిర్వీర్యమై పోయింది. ముఖ్యంగా గత వైసీపీ హయాంలో పైసా విదల్చలేదు. దీంతో మొత్తం చిన్న నీటిపారుదల వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైపోయింది. దీన్ని సరిదిద్ది, ఆయా ఎత్తిపోతల పథకాలకు జీవం పోసేందుకు ప్రభుత్వం దృష్టిపెట్టింది. అయితే అవి ప్రతిపాదనల దశ దాటకపోవడం అన్నదాతలకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది.
ఉమ్మడి జిల్లాల్లో చిన్ననీటి పారుదల వ్యవస్థ నిర్వీర్యం
పదేళ్లుగా రిపేర్లకూ నిధులివ్వని వైనం
ఏజెన్సీ ఎత్తిపోతల పథకాలన్నీ దాదాపుగా మూత
నిర్వహణ బాధ్యత కార్పొరేట్‌కు అప్పగించే యోచన
ఆ మేరకు రూ.600 కోట్లతో ఇప్పటికే ప్రతిపాదనలు
ఇది అమలైతే వేల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు
అయినా రోజులు గడుస్తున్నా ముందుకు కదలని వైనం
గోదావరి జిల్లాలో నీరు పుష్కలంగా ఉంటుందనేది చాలామంది అభిప్రాయం. కానీ ఇక్కడా మెట్ట ప్రాంతం ఉంది. అటు కాలువల నీరూ, ఇటు బోరు నీరు కూడా లభ్యంకాని పొలాలు వేలాది హెక్టార్లలో ఉన్నాయి. వీటిని సాగు చేయడానికి గతంలో ఏర్పాటుచేసిన చిన్న నీటిపారుదల వ్యవస్థ నిర్వీర్యమై పోయింది. ముఖ్యంగా గత వైసీపీ హయాంలో పైసా విదల్చలేదు. దీంతో మొత్తం చిన్న నీటిపారుదల వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తమైపోయింది. దీన్ని సరిదిద్ది, ఆయా ఎత్తిపోతల పథకాలకు జీవం పోసేందుకు ప్రభుత్వం దృష్టిపెట్టింది. అయితే అవి ప్రతిపాదనల దశ దాటకపోవడం అన్నదాతలకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది.
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
కాలువల ద్వారా నీటి సరఫరా లేని మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యవసాయం చేయడంకోసం 1974లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల సంస్థ (ఏపీఐడీ) ఏర్పడింది. ఇది ప్రధానంగా ఎత్తిపోతల పథకాల ఏర్పాటు, నిర్వహణ కోసం పనిచేస్తోంది. కనీసం 50 ఎకరాల నుంచి 5 వేల ఎక రాల వరకూ ఉన్న భూముల కోసం ప్రభుత్వం ఒక్కొక్క ఎత్తిపోతల పథకం నిర్మించి రైతులకు అప్పగించింది. ముఖ్యంగా గోదావరి, కాల్వలు, డ్రైన్ల నుంచి నీటిని ఎత్తిపోసి పంటలు పండిం చడానికి చిన్నచిన్న ఎత్తిపోతల పథకాలను నిర్మించింది. వాటికి ఉచిత కరెంట్ ఇచ్చేది. ఇక వాటి నిర్వహణ, తూడు, డీసిల్టేషన్, చిన్నచిన్న రిపేర్లు వంటివి రైతులు చేసుకోవాలి. దీనికోసం 11 మందితో రైతు కమిటీ ఉంటుంది. రైతుల నుంచి ఎకరాకు రూ.500 నుంచి 1000 వరకూ ఏడాదికి వసూలుచేసి ఎత్తిపోతల పథకాలను మెయింటెనెన్స్ చేస్తారు. పూర్తి మరమ్మతులు వస్తే ప్రభుత్వమే బాగు చేయిస్తుంది. పదేళ్ల నుంచి పాలకులు వీటిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. నిర్వహణకు ఇబ్బంది లేకుండా కొంత సాయం అందించి చేతులు దులిపేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక వీటికోసం పైసా విదల్చలేదు. దాంతో కొన్ని ఎత్తిపోతల పథకా లు మూతపడ్డాయి. మరమ్మతులు లేక ఆ ఎత్తి పోతల ఆయకట్టులో సాగు నిలిచిపోయింది.
ఎక్కడెక్కడ.. పంపింగ్ స్కీములెన్ని..
మెట్ట, ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్న, మధ్యతరహా ఎత్తిపోతల పథకాలు గోదావరి జిల్లాల్లో పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 101 పంపింగ్ స్కీమ్‌లుండగా, వాటి పరిఽధిలో 37,450 ఎకరాల ఆయకట్టు ఉండేది. దీంట్లో పోలవరం ప్రాజెక్టు ముంపు వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో 50 ఎత్తిపోతల పథకాలు పనిచేయ కుండాపోగా, మరో 20 ఎత్తి పోతల పథకాలు నిర్వీర్యమ య్యాయి. కొంతకాలం వీటిని మైక్రో ఇరిగేషన్ డెవలప్మెంట్ సంస్థ తన అధీనంలో నిర్వహించినా, ఏజెన్సీ ప్రజల్లో స్పం దన లేదనే కారణంతో ఇది కూడా వదిలేసినట్టు అధికారు లు చెబుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 35 స్కీమ్‌లు ఉండగా, అందులో ఆరింటింటిని మొత్తం తొలగిం చారు. ఇక 29 స్కీమ్‌ల కింద 55,113 ఎకరాల ఆయకట్టు ఉంది. అందులో కొన్ని ఎకరాల కు మాత్రమే నీటిసరఫరా అవుతోంది. ప్రస్తుతం ఉమ్మడి తూర్పు, పశ్చిమగో దావరి జిల్లాలో కాటవరం, కుమారదేవం, వేగేశ్వ రపు రం, పైడిమెట్ట, చాగల్లు బ్రాహ్మణగూడెం వంటి వి మాత్రం ఓ మాదిరిగా పనిచేస్తున్నాయి. వేము లవాడ -1,2, పెదపూడి, పల్లిపాలెం-1,2, పనిచేస్తు న్నాయి. మిగతా ప్రాంతాల్లో రిపేర్లకు గత పదేళ్ల నుంచి పాలకులు నిధులు ఇవ్వకపో వడంతో ఎక్కడివక్కడ చతికిలపడ్డాయి. 2016లో తెలుగు దేశం ప్రభుత్వం ఈ వ్యవస్థ బతికించడానికి కొం త ప్రయత్నం చేసింది. కొత్త ఎత్తిపోతల పథకా లను కూడా ప్రతిపాదించింది. కానీ 2019లో అధి కారంలోకి వచ్చిన వైసీపీ వీటి విషయం పూర్తిగా పక్కన పెట్టేసింది. రైతుల చొరవ వల్ల నామ మాత్రంగా కొన్ని ఉనికిని కాపాడుకుంటున్నాయి. ఇటీవల రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ మొల్లేరు- గోవిందపురం- మల్లవరం స్కీమ్ పను లు ఇంతవరకు చేపట్టలేదు. ఇది కొత్త స్కీమ్. గతంలో 22 శాతం పని జరిగి ఆగింది.
49 స్కీమ్‌లు.. రూ.600 కోట్లు
తెలంగాణలో కాకతీయ మిషన్ మాదిరిగా ఓ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థకు మరమ్మతులు, నిర్వ హణ బాధ్యత అప్పగించే ఆలోచన ప్రభుత్వం వద్ద ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వీటి మరమ్మతులకు సంబంధించి అధికారులు ప్రభుత్వా నికి ప్రతిపాదనలు పంపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ని మొత్తం ఎత్తిపోతల పథకాలను వదిలేసి,మెట్ట ప్రాంతంలోని ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులతోపాటు ఐదేళ్లపాటు నిర్వహణ చేయడానికి ఓ కార్పొరేట్ సంస్థకు అప్పగించే విధంగా ప్రతిపాద నలు సిద్ధచేశారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదా వరి జిల్లాల్లోని 49 ఎత్తిపోతల పథకాలకు మొ త్తం రూ.600 కోట్లతో అంచనాలు సిద్ధం చేశారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో..
తూర్పుగోదావరి జిల్లాలో పది చిన్నఎత్తిపోతల పథకాలు ఉండ గా, ఇవి పాక్షికంగా పనిచేస్తున్నాయి. అందులో కొవ్వూరు నియోజ కవర్గంలో కుమారదేవం, బ్రాహ్మణగూడెం, చాగల్లు, వేగేశ్వరపురం, పైడిమెట్ట-1, నిడదవోలు స్కీమ్‌లు ఉండగా అనపర్తిలో పి.బి.దేవం- 1,2, కాపవరం, రాజానగరం నియోజకవర్గంలోని కాటవరం ఉన్నా యి. ఇక్కడ మొత్తం 23,745 ఎకరాల ఆయకట్టు ఉంది. వీటి రిపే ర్లకు రూ.4815.50 లక్షలు. నిర్వహణకు రూ.14745 లక్షలు.. మొత్తం రూ.195 కోట్ల 60 లక్షల 50 వేలతో అంచనాలు పంపించారు. కాకి నాడ జిల్లాలో అత్యధికంగా 14 స్కీమ్‌లు ఉన్నాయి. వాటిలో పెద్దా పురం నియోజకవర్గంలోని వేట్లపాలెం, కట్టమూరు, కట్టమూరు మినీ, పెద్దాపురం-1, పెద్దాపురం-2, జి.మేడపాడు, పెదబ్రహ్మదేవం- 3, కాకినాడ రూరల్‌లో వేములవాడ-2, పెద్దపురపాడు, గొర్రిపూడి, వేములవాడ- అనపర్తి నియోజకవర్గం పరిధిలోని పెదపూడి, దోమా డ, జగ్గంపేట నియోజకవర్గంలోని సోమవరం పథకాలున్నాయి. ఇక్కడ 13,710 ఎకరాల ఆయకట్టు ఉంది. వీటి రిపేర్లు, నిర్వహణకు రూ.122 కోట్ల 25 లక్షల 32 వేలు అంచనా వేశారు. అంబేడ్కర్ కోన సీమ జిల్లాలో 5 పథకాలు ఉన్నాయి. అవి రాజోలు నియోజవర్గం లోని చింతలమోరి, కొత్తపేట నియోజకవర్గంలోని వసంతవాడ, ఉచ్చిలి పథకాలు. ఇక్కడ మొత్తం 4,970 ఎకరాల ఆయకట్టు ఉంది. వీటి రిపేర్లు, నిర్వహణకు రూ.34 కోట్ల 8 లక్షల 37 వేలతో అంచ నాలు సిద్ధంచేశారు. రామచంద్రపురం నియోజకవర్గంలో పల్లిపా లెం-1,2 పథకాల్లో 927 ఎకరాల ఆయకట్టు ఉంది. రిపేర్లు, మెయిం టెనెన్స్ కోసం రూ.3 కోట్ల 48 లక్షలతో అంచనాలు సిద్ధం చేశారు.