Share News

కష్టాలు.. కన్నీళ్లు!

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:31 AM

పుడమి తల్లిని నమ్ముకున్న శ్రమ జీవులు వాళ్లు.. సూర్యోదయానికి ముందే పొలానికి చేరతారు. రోజంతా కష్టపడుతూనే ఉంటారు. చీకటి పడిన తర్వాత గానీ ఇంటికి చేరరు. వారికి ఉన్నది ఒక్కటే వ్యాపకం.. అదే పచ్చని పంటల సాగు.. అటువంటి అన్నదాతలపై తరచూ ప్రకృతి పగపడుతోంది.

కష్టాలు.. కన్నీళ్లు!

- మొంథా తుఫానుతో కుదేలైన అన్నదాతలు

- జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం

- నేలవాలిన వరి.. మొలకెత్తుతున్న కంకులు

- విరిగిపోయిన అరటి, బొప్పాయి చెట్లు

- నీటిలో నాని కుళ్లిపోయిన పసుపు, కంద

- ఆనవాళ్లు లేకుండా పోయిన మిర్చి, టమాటా, కూరగాయ, ఆకు కూరల పంటలు

- రూ.లక్షలాది రూపాయల పెట్టుబడి నీటి పాలు

- జిల్లాలో 400 కిలోమీటర్లు పర్యటించిన ‘ఆంధ్రజ్యోతి’ బృందం

- కృష్ణాతీరంలో ‘పొలంబాట’ పట్టి రైతన్నల కష్టాలు అడిగి తెలుసుకున్న వైనం

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

పుడమి తల్లిని నమ్ముకున్న శ్రమ జీవులు వాళ్లు.. సూర్యోదయానికి ముందే పొలానికి చేరతారు. రోజంతా కష్టపడుతూనే ఉంటారు. చీకటి పడిన తర్వాత గానీ ఇంటికి చేరరు. వారికి ఉన్నది ఒక్కటే వ్యాపకం.. అదే పచ్చని పంటల సాగు.. అటువంటి అన్నదాతలపై తరచూ ప్రకృతి పగపడుతోంది. తుఫాన్లు, వరదల రూపంలో వచ్చి నష్టం కలుగజేస్తోంది. అయినా వెరవక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. అనేక రకాల పంటలను పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన మొంథా తుఫాను రైతన్నలను కోలుకోలేని దెబ్బతీసింది. కృష్ణానది తీరంలో ‘ఆంధ్రజ్యోతి’ బృందం జరిపిన ‘పొలంబాట’ కార్యక్రమంలో భారీగా జరిగిన పంటల నష్టం వెలుగుచూసింది. నదీతీరం ప్రారంభమయ్యే పెనమలూరు నియోజకవర్గం నుంచి కడలిలో కలిసే అవనిగడ్డ, మచిలీపట్నం నియోజకవర్గాల వరకు సుమారు 400 కిలోమీటర్ల పరిధిలో ‘ఆంధ్రజ్యోతి’ బృందం సభ్యులు పర్యటించారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న కష్టాలను కళ్లారా చూశారు. మొంథా తుఫాను ప్రభావంతో వీచిన గాలులు, భారీ వర్షాలకు వరి, అరటి, బొప్పాయి, పసుపు, కంద, వేరుశనగ, మిర్చి, టమాటా, కూరగాయలు, ఆకు కూరలు ఇలా అనేక రకాల పంటలు నేలపాలయ్యాయి. అరటి, కంద పంటలకు ఎకరానికి రూ.1.50 లక్షలు వరకు నష్టం వాటిల్లింది. మిగిలిన పంటల సాగుకు వేలాల్లో పెట్టుబడులు పెట్టి రైతులు తీవ్రంగా నష్టపోయారు. నేలవాలిన వరి పంటను మాత్రమే అధికారులు పరిహారం కోసం అంచనా వేస్తున్నారు. దీనిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. 33 శాతం కన్నా అధికంగా పంట నష్టం జరిగినట్లుగా జాబితాలో రాస్తే ఆ తర్వాత ఆ రైతు ధాన్యం కొనుగోలు చేయబోమని వీఏఏలు చెబుతుండటంతో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న అన్ని పంటలకు పరిహారం ఇవ్వడంతో పాటు పంటల బీమా కూడా వర్తింపుజేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.

Updated Date - Nov 04 , 2025 | 12:32 AM