అవినీతిమయం!
ABN , Publish Date - Dec 10 , 2025 | 01:11 AM
డీఈవో కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇప్పటి వరకు డీఈవోగా పనిచేసిన రామారావు ఓ కాంట్రాక్టు ఉద్యోగిని సీసీగా పెట్టుకుని వసూళ్ల పర్వం కొనసాగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. బిషప్ అజరయ్య పాఠశాలలో టీచర్ పోస్టుల భర్తీ దగ్గర నుంచి ఓపెన్ స్కూల్స్ పరీక్షల విభాగం వరకు అన్నింటా ధనకార్యలే నిర్వహించినట్టు విమర్శలు వచ్చాయి. కార్యాలయంలో పాలన గాడి తప్పిందని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. నూతన డీఈవో అరునా చక్కదిద్దాలని కోరుతున్నారు.
- డీఈవో కార్యాలయంపై తీవ్ర ఆరోపణలు
- కాంట్రాక్టు ఉద్యోగిని సీసీగా పెట్టుకుని వసూళ్ల పర్వానికి తెర!
- బిషప్ అజరయ్య పాఠశాలలో టీచర్ పోస్టుల భర్తీలోనూ చేతివాటం!
- ఓపెన్ స్కూల్స్ పరీక్షల విభాగంలోనూ మామూళ్లే!
- డీఈవో పీవీజే రామారావుపై పలు ఆరోపణలు.. పల్నాడు జిల్లాకు బదిలీ
- నూతన డీఈవోగా యూవీ సుబ్బారావు
డీఈవో కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఇప్పటి వరకు డీఈవోగా పనిచేసిన రామారావు ఓ కాంట్రాక్టు ఉద్యోగిని సీసీగా పెట్టుకుని వసూళ్ల పర్వం కొనసాగించినట్టు ఆరోపణలు ఉన్నాయి. బిషప్ అజరయ్య పాఠశాలలో టీచర్ పోస్టుల భర్తీ దగ్గర నుంచి ఓపెన్ స్కూల్స్ పరీక్షల విభాగం వరకు అన్నింటా ధనకార్యలే నిర్వహించినట్టు విమర్శలు వచ్చాయి. కార్యాలయంలో పాలన గాడి తప్పిందని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. నూతన డీఈవో అరునా చక్కదిద్దాలని కోరుతున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావును పల్నాడు జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్ జిల్లా డీఈవోగా పనిచేస్తున్న యూవీ సుబ్బారావును కృష్ణా డీఈవోగా నియమించింది. గతంలో యూవీ సుబ్బారావు చాలాకాలం పాటు మచిలీపట్నం డీవైఈవోగా పనిచేశారు. డీఈవోగా పీవీజే రామారావు పనిచేసిన కాలంలో డీఈవో కార్యాలయంలో పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన బదిలీ కావడంతో నూతనంగా వచ్చే డీఈవో అయినా ఈ కార్యాలయంలో పరిపాలనను గాడిలో పెట్టాలని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు.
ధనార్జనే ధ్యేయంగా..
డీఈవోగా పీవీజే రామారావు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డీఈవో కార్యాలయ పనితీరుపై పలు ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టు పద్ధతిపై పనిచేసే ఉద్యోగిని క్యాంప్ క్లర్క్(సీసీ)గా పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. టీచర్‌లకు సర్వీస్ మేటర్‌లకు సంబంధించిన వ్యవహారాల్లో సదరు సీసీని సంప్రదించాలని, అతని నుంచి అనుమతులు వచ్చాకనే ఫైళ్లపై సంతకాలు చేసేవారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. గుట్టుచప్పుడు కాకుండా తాను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఈ సీసీ ద్వారా తెరవెనుక అన్ని వ్యవహారాలు చక్కదిద్దేవారనే విమర్శలు ఉన్నాయి. తన సీసీని ప్రసన్నం చేసుకోని టీచర్‌లకు సంబంధించిన ఫైళ్లు పెండింగ్‌లో పెట్టారని, ఇది జగమెరిగిన సత్యమని టీచర్‌లు, కార్యాలయంలో పనిచేసే అధికారులు, సిబ్బంది బాహాటంగా చెప్పుకుంటున్నారు. డీఈవో కార్యాలయంలోని సిటిజన్ చాప్టర్‌ను పరిశీలిస్తే ఎన్ని ఫైళ్లు పెండింగ్‌లో పెట్టారో తెలిసిపోతుందని ఉపాధ్యాయులు అంటున్నారు.
పాడికుండలా ఓపెన్ స్కూల్ విభాగం
జిల్లాలో ఓపెన్ స్కూల్స్‌కు సంబంధించిన పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు డీఈవో కార్యాలయంలో ప్రత్యేక విభాగం ఉంది. ఈ విభాగాన్ని వాస్తవంగా డీఈవో కార్యాలయంలో పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉన్న అధికారి పర్యవేక్షించాలి. కానీ ఈ అధికారిని పక్కనపెట్టి, మచిలీపట్నం మండలంలో పనిచేసే, తనకు అనుకూలమైన ఒక టీచర్‌కు ఈ విభాగంలో కీలక బాధ్యతలను అప్పగించారు. సదరు ఉపాధ్యాయుడు పాఠశాలకు వెళ్లకుండా ఓపెన్ స్కూల్ విభాగంలోనే ఉండిపోతున్నాడు. దీనిపై అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో డీఈవో ఈ ఉపాధ్యాయుడిని పాఠశాలకు పంపినా, తెరవెనుక ఓపెన్ స్కూల్స్ నిర్వాహకులతో సంప్రదింపులు జరిపే బాధ్యతలను అప్పగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో జిల్లాలో 2,500 మందికిపైగా ఏటా పరీక్షలు రాస్తారు. పాస్ గ్యారంటీ పేరుతో ఒక్కొక్కరి నుంచి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేశారనే ఆరోపణలు మూటగట్టుకున్నారు.
టీచర్ పోస్టుల నియామకంలోనూ..
విజయవాడలోని బిషప్ అజరయ్య ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో ఇటీవల కాలంలో ఐదు టీచర్ పోస్టులను ప్రభుత్వ అనుమతితో భర్తీ చేశారు. ఈ పోస్టుల నియామకంలో ఉమ్మడి జిల్లా విద్యాశాఖలో పరిపాలనను చూసేది తానే అని చెప్పి కృష్ణా డీఈవో ఒక్కో పోస్టుకు లక్షలాది రూపాయలు వసూలు చేసిన అంశంపై జిల్లావ్యాప్తంగా చర్చ జరిగింది. టీచర్‌లుగా పనిచేస్తూ దీర్ఘకాలిక సెలవుపై విదేశాలకు వెళ్లే ఉపాధ్యాయులకు అనుమతులు ఇచ్చేందుకు, తిరిగి వచ్చిన వారిని మళ్లీ విధుల్లో చేర్చుకునేందుకు ఇంతరేటని నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొన్నారు. పెడన మండలం కొంకేపూడి జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఒక టీచర్ పిల్లలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై డీఈవోకు ఫిర్యాదు చేసినా సదరు టీచర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నామమాత్రంగా నోటీసు జారీ చేసి విషయాన్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలు డీఈవో ఎదుర్కొన్నారు.
కొత్త డీఈవో రాకతోనైనా మార్పు వచ్చేనా!
గత 15 నెలలుగా డీఈవో కార్యాలయంలో పాలన గాడితప్పింది. గతంలో మచిలీపట్నం డీవైఈవోగా పనిచేసిన యూవీ సుబ్బారావుకు డీఈవో కార్యాయలంలో ఏం జరుగుతుందో కొంతమేర అవగాహన ఉంది. ప్రస్తుతం ఆయన డీఈవోగా వస్తుండటంతో కార్యాలయంలో పాలనను గాడిలో పెట్టేందుకు ఎంతమేర కృషి చేస్తారనేది వేచిచూడాలి.