సత్యవేడుకు రెవెన్యూ డివిజన్ వచ్చేనా?
ABN , Publish Date - Nov 04 , 2025 | 12:48 AM
జిల్లాలో మారుమూల నియోజకవర్గంగా పేరుపడిన సత్యవేడుకు రెవెన్యూ డివిజన్ మంజూరు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ నియోజకవర్గంలోని ఏడు మండలాలూ ప్రస్తుతం శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట డివిజన్ల నడుమ విభజితమైన సంగతి తెలిసిందే.
శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట డివిజన్ల నడుమ చీలిన నియోజకవర్గం
ఎన్నికల ప్రచారంలో పరిశీలిస్తానంటూ చంద్రబాబు హామీ
ప్రభుత్వానికి తరచూ ఎమ్మెల్యే వినతులు
జిల్లాలో మారుమూల నియోజకవర్గంగా పేరుపడిన సత్యవేడుకు రెవెన్యూ డివిజన్ మంజూరు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ నియోజకవర్గంలోని ఏడు మండలాలూ ప్రస్తుతం శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట డివిజన్ల నడుమ విభజితమైన సంగతి తెలిసిందే. సత్యవేడును రెవెన్యూ డివిజన్ చేసి నియోజకవర్గం మొత్తాన్ని దాని పరిధిలోకి తేవాలన్నది అక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధుల కోరిక.
- తిరుపతి, ఆంధ్రజ్యోతి
సత్యవేడు నియోజకవర్గం భౌగోళికంగా అతి పెద్దది. సత్యవేడు, నాగలాపురం, పిచ్చాటూరు, నారాయణవనం, కేవీబీపురం, బుచ్చినాయుడుకండ్రిగ, వరదయ్యపాలెం మండలాలున్నాయి. గత ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టినపుడు వీటిలో సత్యవేడు, వరదయ్యపాలెం, బీఎన్ కండ్రిగ మండలాలు మూడింటినీ సూళ్ళూరుపేట రెవిన్యూ డివిజన్ పరిధిలో చేర్చింది. మిగిలిన నాగలాపురం, పిచ్చాటూరు, కేవీబీపురం, నారాయణవనం మండలాలను శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో కలిపింది. దీంతో ఎమ్మెల్యే, కలెక్టర్ తదితరులు నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షించే సమయంలో ఇద్దరు ఆర్డీవోల నుంచీ సమాచారం తీసుకోవాల్సి వస్తోంది. సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఇద్దరు ఆర్డీవోలను సంప్రదించాలి. ఇది పాలనాపరంగా అసౌకర్యంగా మారుతోంది.
సత్యవేడు డివిజన్‌పై ఎన్నికల్లో హామీ
గత ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు సత్యవేడుకు వచ్చిన సందర్భంలో పార్టీ అభ్యర్థి హోదాలో కోనేటి ఆదిమూలం ఈ అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై స్పందించిన చంద్రబాబు బహిరంగసభలో ప్రసంగిస్తూ దీన్ని ప్రస్తావించారు. అధికారంలోకి వస్తే సత్యవేడులో రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.
ప్రస్తుత కసరత్తులోనే తేల్చాలంటున్న జనం
గత వైసీపీ ప్రభుత్వం అశాస్త్రీయంగా జరిపిన జిల్లాల, రెవెన్యూ డివిజన్ల పునర్విభజనను సరిదిద్దేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. నగరి, తిరుపతి, శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్లలో మార్పులు అనివార్యం కానున్నాయి. నగరి డివిజన్ తిరుపతి జిల్లా పరిధిలోకి రావడంతో పాటు తిరుపతి డివిజన్ పరిధి నుంచీ వడమాలపేట, పుత్తూరు మండలాలు నగరి డివిజన్ పరిధిలోకి వెళ్లనున్నాయి. అలాగే వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాలు శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలోకి రానున్నాయి. ఈ మార్పులు ఎలాగూ జరుగుతాయి కనుక అదే సందర్భంలో సత్యవేడు డివిజన్ ఏర్పాటుపైనా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో పాటు ప్రజలు సైతం కోరుతున్నారు. సత్యవేడు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని ఏడు మండలాలనూ దాని పరిధిలోకి తేవాలని అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా సత్యవేడు, వరదయ్యపాలెం, బీఎన్ కండ్రిగ మండలాలు పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. శ్రీసిటీ సెజ్‌తో పాటు పలు ఏపీఐఐసీ పారిశ్రామిక వాడలు ఇప్పటికే ఉండగా, మరిన్ని పార్కులు ఏర్పాటవుతున్నాయి. దీంతో తరచూ ప్రభుత్వం ఈ మండలాల్లో పరిశ్రమల కోసం భూములు సేకరిస్తోంది. సత్యవేడు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటైతే భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశముంటుంది. అదే సమయంలో నియోజకవర్గ ప్రజల రెవెన్యూ, భూముల సంబంధ సమస్యల పరిష్కారం కూడా త్వరగా జరిగేందుకు ఆస్కారముంటుంది. నియోజకవర్గ ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేలా సత్యవేడు డివిజన్ ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముంది.