Share News

Teachers: తుదిదశకు టీచర్ల సీనియారిటీ జాబితా

ABN , Publish Date - Feb 12 , 2025 | 01:04 AM

కూటమి ప్రభుత్వం త్వరలో డీఎస్సీ ప్రకటించనున్న నేపథ్యంలో విద్యాశాఖ చేపట్టిన టీచర్ల సీనియారిటీ జాబితా తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.

Teachers: తుదిదశకు టీచర్ల సీనియారిటీ జాబితా
సీనియారిటీ జాబితా తయారీపై సిబ్బందికి సూచనలు ఇస్తున్న డీఈవో వరలక్ష్మి

చిత్తూరు సెంట్రల్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం త్వరలో డీఎస్సీ ప్రకటించనున్న నేపథ్యంలో విద్యాశాఖ చేపట్టిన టీచర్ల సీనియారిటీ జాబితా తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. వాస్తవానికి సీనియారిటీ జాబితా సమర్పణ గడువు ముగిసినా, క్షేత్ర స్థాయిలో తలెత్తిన సాంకేతిక, ఇతర కారణాలతో విద్యాశాఖ మరో రెండ్రోజులు పొడిగించింది. దీనిపై డీఈవో వరలక్ష్మి మంగళవారం తన చాంబర్‌లో ఏడీ రంగస్వామి, సూపరింటెండెంట్లు, సిబ్బందితో కలిసి సమీక్షించారు. సీనియారిటీ జాబితా ఇప్పటి వరకు 82 శాతం పూర్తయిందని, ఎక్కడా పొరపాట్లు ఉండకూడదని చెప్పారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రంగా

ఉమ్మడి చిత్తూరు జిల్లా కేంద్రంగా డీఈవో కార్యాలయంలో చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్‌ యాజమాన్యాల టీచర్ల సీనియారిటీ జాబితా తయారీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 1988 - 2018 మధ్య కాలంలో నిర్వహించిన ఏడు డీఎస్సీల ఆధారంగా టీచర్ల సీనియారిటీ జాబితా తయారు చేస్తున్నారు.ఇందుకోసం ఉమ్మడి చిత్తూరు జిల్లాల సిబ్బంది ఎనిమిది బృందాలుగా పనిచేస్తున్నారు. ఇప్పటికే టీచర్స్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (టీఐఎ్‌స)లో టీచర్లు, వారి సర్వీసు వివరాలతో డీఈవో కార్యాలయంలోని రికార్డులను పోల్చిచూశారు. ఇది కాకుండా హెచ్‌ఎంలు పాఠశాల స్థాయిలో టీచర్ల సీనియారిటీ వివరాలు నమోదు చేసి ఎంఈవోల లాగిన్‌కు, ఆపై డీఈవో లాగిన్‌కు పంపడంతో అక్కడి ప్రత్యేక టీమ్‌ ఎంఈవోలు పంపిన టీచర్ల వివరాలు, రికార్డుల పునఃపరిశీలన చేస్తున్నారు.

82 శాతం ప్రక్రియ పూర్తి

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 4392 ప్రభుత్వ,జడ్పీ, మున్సిపల్‌ యాజమాన్యాల్లో పనిచేస్తున్న 14,385 మంది టీచర్ల సీనియారిటీ జాబితాలో ఇప్పటి వరకు 11,805 మంది రికార్డులు పరిశీంచి (82 శాతం) పూర్తి చేయగా, 2580 రికార్డులు పరిశీలించాల్సి ఉంది.408 పాఠశాలల రెగ్యులర్‌ హెచ్‌ఎంల సీనియారిటీ జాబితా ఇప్పటికే పూర్తి చేసిన విషయం తెలిసిందే. స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ) కేటగిరీలో 8435 మందికిగాను 901 ఖాళీలుండగా, 7,534 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఇప్పటి వరకు 5,134 మంది సీనియారిటీ జాబితా సిద్ధం చేయగా, 2,400 మందివి చేయాల్సి ఉంది. సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) 8295 మందికిగాను 1,852 ఖాళీలుండగా, 6,443 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఇప్పటివరకు 6,263 మంది సీనియారిటీ జాబితా సిద్ధం చేయగా, కేవలం 180 మందివి రికార్డులు పునఃపరిశీలన చేయనున్నట్లు డీఈవో తెలిపారు.


నేడు, రేపు డెస్క్‌ వెరిఫికేషన్‌

హెచ్‌ఎంల సీనియారిటీ జాబితాను ఇప్పటికే విద్యాశాఖ సెంట్రల్‌ డెస్క్‌కు పంపింది.బుధవారం ఎస్జీటీలు, గురువారం ఎస్‌ఏల జాబితాలను పూర్తి స్థాయిలో డెస్క్‌ వెరిఫికేషన్‌ ద్వారా రాష్ట్ర విద్యాశాఖకు పంపనున్నారు. ఇందుకోసం డీఈవో కార్యాలయంలో సిబ్బం ది ముమ్మర కసరత్తు చేస్తున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా సమాచారం

ప్రాథమిక, ప్రాథమికోన్నత,

ఉన్నత పాఠశాలలు 4392

స్కూల్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఏ)

పోస్టులు మంజూరు 8435

పనిచేస్తున్న ఎస్‌ఏలు 7534

ఖాళీలు 901

సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ)

పోస్టుల మంజూరు 8295

పనిచేస్తున్న ఎస్జీటీలు 6443

ఖాళీలు 1852

Updated Date - Feb 12 , 2025 | 01:04 AM