శ్రీవారి ఆలయం ముందు కార్తీక వెలుగులు
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:38 PM
తిరుమల శ్రీవారి ఆలయం కార్తీక వెలుగుల్లో ప్రత్యేక కళతో దర్శనమిచ్చింది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం కార్తీక వెలుగుల్లో ప్రత్యేక కళతో దర్శనమిచ్చింది. తిరుమల, తిరుపతి స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయం ముందున్న గొల్లమండపం నుంచి అఖిలాండం వరకు నేతి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేతి దీపాల వెలుగుల్లో ఆలయ ప్రాంతమంతా ప్రత్యేక శోభను సంతరించుకుంది.
తిరుమల క్షేత్రంలో బుధవారం రాత్రి కార్తీక పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. విశేష అలంకరణలో మలయప్పస్వామి తన ఇష్టవాహనమైన గరుడుడిపై కొలువుదీరి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల గోవింద నామస్మరణలు, కర్పూర హారతుల నడుమ గరుడవాహనం కన్నులపండువగా జరిగింది. కార్తీక మాసంలోని పౌర్ణమి కావడంతో ఈ గరుడ వాహన సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి