CPM Politburo Member Raghavulu: డేటా సెంటర్లు కాదు..ఉపాధి కల్పించే పరిశ్రమలు కావాలి
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:46 AM
డేటా సెంటర్లు ఎన్నివచ్చినా పెద్దగా ఉపాధి అవకాశాలు ఉండ వు కాబట్టి, ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే టెక్స్‌టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫుట్‌వేర్, గార్మెంట్ వంటి పరిశ్రమలను...
స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుకు అప్పగించేందుకు కుట్ర: బీవీ రాఘవులు
విశాఖపట్నం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): డేటా సెంటర్లు ఎన్నివచ్చినా పెద్దగా ఉపాధి అవకాశాలు ఉండ వు కాబట్టి, ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించే టెక్స్‌టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫుట్‌వేర్, గార్మెంట్ వంటి పరిశ్రమలను విశాఖకు తీసుకురావాల్సిన అవసరం ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సూచించారు. ఈ నెల 31న నుంచి జరగబోయే సీఐటీయూ అఖిల భారత మహాసభల ఏర్పాట్లను పరిశీలించేందుకు విశాఖ వచ్చిన ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలో వచ్చిన టీడీపీ, తర్వాత వైసీపీ, నేడు కూటమి ప్రభుత్వం కూడా సదస్సులు పెట్టి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నాయే తప్ప, విదేశీ పెట్టుబడులు మాత్రం రావడం లేదన్నారు. కబుర్లు చెప్పడం పైకంటే పెట్టుబడులు రాబట్టడానికి నిర్దిష్ట ప్రణాళిక తయారుచేయడంపై దృష్టిపెట్టాలని రాఘవులు సూచించారు. స్టీల్‌ప్లాంటు ప్రతిష్ఠను దిగజార్చడం ద్వారా ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని రాఘవులు ఆరోపించారు. నాసిరకం ముడిపదార్థాలను సరఫరా చేసి నాణ్యత తగ్గిపోయిందంటూ ఉక్కు ఉత్పత్తిని కించపరుస్తున్నారన్నారు. రూ.400 కోట్ల మేర జీతాలను బకాయి పెట్టడం ద్వారా బయటకు వెళ్లిపోవడమే మంచిదనే భావన ఉద్యోగుల్లో కల్పిస్తున్నారని విమర్శించారు.