Police Investigation: ఖాకీ కొడుకే కారకుడు
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:30 AM
ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను బలితీసుకున్న ‘చిలకలూరిపేట బైపాస్’ ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కారు ప్రమాదానికి కారణం అతడి ముఠాయే
రవాణా అధికారుల వేషంలో హైవేపై దందాలు
‘పేట’ బైపాస్‌లో లారీని ఆపిన గ్యాంగ్
లారీ హఠాత్తుగా ఆగడంతో వెనుక నుంచి ఢీకొన్న కారు
ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల దుర్మరణం
చిలకలూరిపేట, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులను బలితీసుకున్న ‘చిలకలూరిపేట బైపాస్’ ప్రమాదంపై సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవాణా శాఖ అధికారుల ముసుగులో హైవేపై వాహనాలను ఆపి... దందా సాగిస్తున్న ముఠా కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని తేలింది. ఈ ‘చోర్ ముఠా’ నాయకుడు ఒక ఏఎస్‌ఐ కుమారుడు కావడం గమనార్హం. గురువారం రాత్రి చిలకలూరిపేట బైపాస్‌లో ముందు వెళ్తున్న లారీని కారు ఢీకొనడంతో... అందులో ఉన్న ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించారు. వీరిలో నలుగురు అయ్యప్ప దీక్షలో ఉన్నారు. రవాణా శాఖ అధికారులు... ట్రాక్టర్లలోడ్‌తో వెళ్తున్న లారీని ఆకస్మికంగా ఆపడమే ప్రమాదానికి కారణమని తొలుత వార్తలు వచ్చాయి. దీంతో... రవాణా అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించారు. హైవేలో ఉన్న అన్ని సీసీ కెమెరాల్లోని ఫుటేజీని పరిశీలిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక కారులో ఉన్న వారు... రవాణా శాఖ అధికారుల తరహాలో, లారీని ఆపాలంటూ సైగ చేస్తూ దానిని ఓవర్‌టేక్ చేసి, హఠాత్తుగా రోడ్డుపక్కన ఆగారు. దీంతో.. లారీ నడుపుతున్న డ్రైవర్ ఒక్కసారిగా వాహన వేగాన్ని తగ్గించారు. ఈ లారీ వెనుకే ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు వేగంగా వస్తోంది.
లారీ సడన్‌గా ఆగడంతో వీరి కారు దానిని వెనుక నుంచి బలంగా ఢీకొంది. క్షణాల్లో ఘోరం జరిగిపోయింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగి... ఆ రోజు, ఆ ‘స్పాట్’లో తమ సిబ్బంది తనిఖీలు జరిపారా అనే కోణంలో ఆరా తీశారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి... ప్రమాదానికి కారణమైన కారు నంబరును గుర్తించి.. అది తమ శాఖది కాదని నిర్ధారణకు వచ్చారు. మరోవైపు పోలీసులు తీగ లాగితే.. డొంక కదలినట్లు.. ముఠా అక్రమాల గుట్టు వెలుగు చూసింది. దొంగ నంబరు ప్లేటుతో రవాణా శాఖ అధికారుల వేషంలో హైవేలో వాహనాలను ఆపి, దందా చేస్తున్న ‘చోర్ ముఠా’ వల్లే ఈ ఘోరం జరిగినట్లు తేలింది.
తండ్రి అండతో నేరాలు
‘చోర్ ముఠా’ నాయకుడు నర్సరావుపేటకు చెందిన ఒక ఏఎస్‌ఐ కొడుకు అని నిర్ధారణ అయినట్లు సమాచారం. ఈ ముఠా కార్లు కూడా దొంగలించి విక్రయించినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిసింది. గతంలో బంగారం విక్రయిస్తామని కొందరి వద్ద రూ.40 లక్షలు కాజేశారు. ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేసినా విచారణ జరపకుండా అప్పటి పోలీసు అధికారులు నేరస్థులకు సహకరించినట్లు తెలిసింది. తండ్రి పోలీస్ అధికారి కావడంతో బంగారం కేసు నుంచి తప్పించినట్లు ప్రచారం. అలాగే కార్లు కాజేసిన కేసుల్లో కూడా సదరు గ్యాంగ్ లీడర్.. తన తండ్రిని అడ్డుపెట్టుకొని సులువుగా తప్పించుకున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. నకరికల్లు మండలం నరశింగపాడుకు చెందిన ఓ యువకుడు కూడా ఈ నేరాల్లో భాగస్వామిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరితో పాటు మొత్తం ఐదుగురు పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ముఠా గురించి పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్‌కు సోమవారం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు ఎస్పీ కృష్ణారావు వచ్చి కేసు వివరాలను ఆరా తీశారు.