ACB DG Atul Singh: అవినీతిని నిర్మూలిద్దాం
ABN , Publish Date - Nov 03 , 2025 | 05:57 AM
సమాజంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగోడగా మారిన అవినీతి నిర్మూలనకు అందరం కలిసి కృషి చేద్దామని ఏసీబీ డీజీ అతుల్ సింగ్ పిలుపునిచ్చారు.
అభివృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడదాం
విజిలెన్స్ వారోత్సవ ర్యాలీలో ఏసీబీ డీజీ అతుల్ పిలుపు
అమరావతి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): సమాజంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగోడగా మారిన అవినీతి నిర్మూలనకు అందరం కలిసి కృషి చేద్దామని ఏసీబీ డీజీ అతుల్ సింగ్ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా విజిలెన్స్ వారోత్సవాలు ఆదివారం ముగిశాయి. ‘విజిలెన్స్.. మన భాగస్వామ్య బాధ్యత’ అనే థీమ్‌తో వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అవినీతి వల్ల కలిగే నష్టం వివరించే కార్యక్రమాలను ఏసీబీ నిర్వహించింది. చివరిరోజు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడలో అతుల్ సింగ్ మాట్లాడుతూ.. ‘అందరం పోరాటం చేస్తేనే అవినీతిని అరికట్టేందుకు వీలవుతుంది. ఎవరికి వారే ఇదొక యజ్ఞంలా భావించి అవినీతి కట్టడికి నడుం భిగిస్తేనే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ అవినీతి జరుగుతున్నట్టు తెలిసినా ఏసీబీ(1064)కి సమాచారం ఇవ్వండి. అవినీతిని పారదోలితేనే సమాజం బాగుంటుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం నెరవేరుతుంది. రాష్ట్ర ప్రగతితో ఆంధ్రుల భవిష్యత్తు బాగుంటుంది’ అన్నారు. సైకిల్ ర్యాలీలో ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మి, అదనపు ఎస్పీలు సుధాకర్ లోసారి, దిలీప్ కిరణ్ పలువురు డీఎస్పీలు, సీఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.