Overseas Education: విదేశీ విద్యకు చలో
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:17 AM
గత దశాబ్దకాలంగా విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్న భారత విద్యార్థుల్లో అత్యధికం ఏపీ నుంచే ఉన్నారు. మహారాష్ట్ర, తమిళనాడులాంటి రాష్ర్టాల కంటే కూడా ఏపీ విద్యార్థులే ఎక్కువగా విదేశీ బాట పడుతున్నారు.
ఏటా లక్షల్లో విదేశాలకు విద్యార్థులు
వారిలో ఎక్కువ మంది ఏపీ నుంచే
సగటున ఏడాదికి 50 వేల మంది పైనే
అమెరికా వెళ్లేవారిలో తెలుగువారే అధికం
విదేశీ వ్యవహారాలు, ఓపెన్ డోర్స్ నివేదికలు
‘‘అమెరికా వెళ్లినప్పుడు ఏదైనా వీధిలో గట్టిగా తెలుగులో మాట్లాడండి. వెంటనే ఎవరో ఒకరు పలుకుతారు. అమెరికాలో ఉన్న ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు తెలుగువారే’’..అని సీఎం చంద్రబాబు తరచూ చెబుతుంటారు. ఒక్క అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ అభివృద్ధి చెందిన దేశం చూసినా పరిస్థితి అలాగే మారుతోంది. విదేశీ విద్య కోసం ఏపీ విద్యార్థులు క్యూ కడుతున్నారు. చాలా మంది చదువు అనంతరం అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు.
ఎక్కువ మంది విద్యార్థులు భారీస్థాయి వేతనాలను ఆశించే విదేశీ బాట పడుతున్నారని నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. విదేశాలకు వెళ్తున్న వారిలో చదువు అనంతరం తిరిగి స్వరాష్ట్రానికి వస్తున్నవారు చాలా తక్కువమందే ఉంటున్నారు. ఆ నివేదికల ప్రకారం విదేశాల్లో చదువుకునేందుకు
విదేశీ బాట వెనుక?
ఎవరెందుకు వెళ్తున్నారంటే..
ఆకర్షణీయ ప్యాకేజీ కోసం 44శాతం
నాణ్యమైన విద్య కోసం 33శాతం
మంచి కోర్సుల కోసం 17శాతం
అంతర్జాతీయ గుర్తింపు కోసం 6శాతం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
గత దశాబ్దకాలంగా విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్న భారత విద్యార్థుల్లో అత్యధికం ఏపీ నుంచే ఉన్నారు. మహారాష్ట్ర, తమిళనాడులాంటి రాష్ర్టాల కంటే కూడా ఏపీ విద్యార్థులే ఎక్కువగా విదేశీ బాట పడుతున్నారు. వివిధ నివేదికల అంచనాల ప్రకారం ఏడాదికి 50 వేల మంది ఏపీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్నారు. బీటెక్ పూర్తిచేసిన అభ్యర్థులు మాస్టర్స్ చేసేందుకు రాష్ట్రం నుంచి అమెరికా వెళ్తున్నారు. ఆ తర్వాత లండన్‌ను ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటున్నారు.
ఇటీవల బ్రిటన్ వీసాను సులభతరం చేయడంతో ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు రెండో ఆప్షన్ కింద లండన్‌ను ఎంచుకుంటున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలను పరిశీలిస్తే ఎక్కువ మంది ఏపీ నుంచే విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్నట్టు స్పష్టమవుతోంది. 2016లో దేశం నుంచి 3.71లక్షల మంది వెళ్తే వారిలో ఏపీ విద్యార్థులు 46,818 మంది ఉన్నారు. 2017లో 56,093 మంది, 2018లో 62,771 మంది, 2019లో 35,614 మంది విదేశీ విద్య కోసం వెళ్లారు. 2021లో కొవిడ్ నేపథ్యంలో ఆ సంఖ్య 11,790కు తగ్గిపోయింది. కొవిడ్ అనంతరం ఆ సంఖ్య మళ్లీ భారీగా పెరిగింది. తాజాగా ‘ఓపెన్ డోర్స్’ సంస్థ విడుదల చేసిన నివేదికలో విదేశీ విద్యకోసం భారతీయ విద్యార్థుల్లో మహారాష్ట్ర తర్వాత ఏపీ విద్యార్థులే అత్యధికంగా ఉన్నారని స్పష్టం చేసింది. మహారాష్ట్ర, ఏపీ, పంజాబ్, తెలంగాణనుంచి ఎక్కువమంది విదేశాల్లో చదువుతున్నారు.
అమెరికాలో తెలుగు హవా
ఇతర దేశాలు ఒకెత్తు అయితే.. అమెరికా వెళ్లడానికి ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతారు. ‘ఓపెన్ డోర్స్’ నివేదిక ప్రకారం 2024-25లో 3,63,019 మంది విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు వెళ్లారు. వారిలో ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్లు అంచనా. యూఎస్ కాన్సులేట్ వివరాల ప్రకారం 2023లో 1.8 లక్షల మంది విద్యార్థులకు అమెరికా వీసాలు జారీచేస్తే అందులో 56శాతం తెలుగు విద్యార్థులే ఉన్నారు. వీరిలో 22శాతం మంది విద్యార్థులు ఏపీ నుంచి ఉండచ్చని అంచనా. మిగిలినవారు తెలంగాణ నుంచి వెళ్లారు. అలాగే కెనడాకు ఎక్కువగా వెళ్తున్న విద్యార్థులు కూడా తెలుగువారే. మరో నివేదిక ప్రకారం విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల్లో ఏపీ వాటా 12శాతంగా ఉంది. మహారాష్ట్ర 11శాతం, గుజరాత్ 8శాతం, తమిళనాడు 7శాతం, కర్ణాటక 5శాతం మంది ఉన్నారు. కాగా, ఇటీవల ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త వీసా ఆంక్షల నేపథ్యంలో అమెరికాకు వెళ్లేవారి సంఖ్య కొంతమేరకు తగ్గుముఖం పట్టింది.
ప్రపంచమంతా భారతీయులు
అమెరికా, కెనడా, లండన్ లాంటి దేశాలతో పాటు భారతీయ విద్యార్థులు ప్రపంచమంతా విస్తరిస్తున్నారు. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకు వెళ్తున్నారు. కేంద్రప్రభుత్వ నివేదిక ప్రకారం 2024లో ఆస్ర్టేలియాకు 68,572 మంది వెళ్లారు. బంగ్లాదేశ్‌కు 29,323 మంది, కెనడాకు 1,37,608 మంది, చైనాకు 4,978 మంది, సైప్ర్‌సకు 3,162 మంది, ఫ్రాన్స్‌కు 8,536 మంది, జార్జియాకు 9,720 మంది, జర్మనీకి 34,702 మంది, ఐర్లాండ్‌కు 10,438 మంది, ఇటలీకి 3,965 మంది, ఖజకిస్తాన్‌కు 11,638 మంది, కిర్గిస్తాన్‌కు 11,875 మంది, న్యూజిలాండ్‌కు 7,297 మంది, ఫిలిప్పీన్స్‌కు 8,101 మంది, రష్యాకు 31,444 మంది, సింగపూర్‌కు 14,547 మంది, యూకేకు 98,890 మంది, యూఎ్‌సకు 2,04,058 మంది, ఉజ్బెకిస్తాన్‌కు 9,915 మంది వెళ్లారు. ఇలా.. ప్రపంచంలో 215 దేశాల్లో భారతీయ విద్యార్థులు చదువుతున్నారు.