దమ్ముంటే.. కబ్జాదారుల పేర్లు చెప్పండి
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:56 PM
పట్టణ శివార్లలోని ఎర్రవంకను టీడీపీ నాయకులు కబ్జా చేశారని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గత సోమవారం గ్రీవెన్సలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంపై స్థానిక టీడీపీ నాయకులు మండిపడ్డారు.
తాడిపత్రి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): పట్టణ శివార్లలోని ఎర్రవంకను టీడీపీ నాయకులు కబ్జా చేశారని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గత సోమవారం గ్రీవెన్సలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంపై స్థానిక టీడీపీ నాయకులు మండిపడ్డారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు మల్లికార్జున, షెక్షావలి, విజయ్‌కుమార్, జింకా లక్ష్మిదేవి, అరుణ, పర్వీన మంగళవారం మాట్లాడారు. పెద్దారెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఎర్రవంకను కబ్జా చేసిన వారి పేర్లను చెప్పాలని, తామే వారిపై చర్యలు తీసుకుంటామని, లేకుంటే పట్టణంలోని పెద్దారెడ్డి తండ్రి విగ్రహం వద్ద ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. కబ్జాల గురించి పెద్దారెడ్డి మాట్లాడుతుండటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. పుట్లూరు మండలం కోమటికుంట్లలో పెద్దారెడ్డి తోట పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని, వంకను కబ్జా చేశాడని, దీనిపై తాము కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆ భూమిని అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారన్నారు. అలాగే పట్టణంలో మున్సిపాలిటీకి సంబంధించిన రెండు సెంట్ల స్థలాన్ని కబ్జా చేసి భవనాన్ని నిర్మించుకున్నారని, దీనిపై మున్సిపల్ అధికారులు నోటీసులు కూడా పెద్దారెడ్డికి ఇచ్చారని తెలిపారు. ఈ విషయాలను అప్పుడే మరచిపోయావా పెద్దారెడ్డీ అన్ని ప్రశ్నించారు.