‘కారుణ్య’మేదీ?
ABN , Publish Date - Oct 25 , 2024 | 11:34 PM
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి.. అనారోగ్య కారణాలు, రోడ్డు ప్రమాదాలు ఇతరత్రా కారణాల వల్ల మరణించిన వారి వారసులు కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నారు. ఏడేళ్లుగా ఈ నియామకాల ప్రక్రియను పట్టించుకోకపోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 550 మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.
ఏడేళ్లుగా నిలిచిన నియామకాల ప్రక్రియ
కొన్ని శాఖల్లో పూర్తిగా ఆగిన వైనం
ఉమ్మడి జిల్లాలో 550దరఖాస్తుల పెండింగ్
వయసు మీరుతుండడంతో ఆందోళనలో ఆశావహులు
‘మెడికల్ అన్‌ఫిట్’ విషయంలోనూ తీవ్ర జాప్యం
హనుమకొండ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండి.. అనారోగ్య కారణాలు, రోడ్డు ప్రమాదాలు ఇతరత్రా కారణాల వల్ల మరణించిన వారి వారసులు కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్నారు. ఏడేళ్లుగా ఈ నియామకాల ప్రక్రియను పట్టించుకోకపోవడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 550 మంది దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ధరఖాస్తులు చేసుకున్నవారిలో పంచాయతీరాజ్, విద్యాశాఖలకు సంబంధించినవారే ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 550 దరఖాస్తుల్లో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినవి సుమారు 175 ఉండగా విద్యాశాఖకు చెందినవి 190. రెవెన్యూలో 140 ఎక్సైజ్ శాఖకు సంబంధించినవి 45 ఉన్నాయి. వీరంతా కారుణ్య నియామకాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఆయా శాఖల్లో వీటి గురించి పట్టించుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే పంచాయతీరాజ్, విద్య, ఎక్సయిజ్, రెవెన్యూ శాఖల్లో కారుణ్య నియామకాలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసు, విద్యుత్, నీటిపారుదల తదితర శాఖల్లో అలాగే ఆర్‌టీఈలో మాత్రం రెండేళ్ల క్రితం కొంత మేర నియామకాలు జరిపారు. ఈ నియామకాల గురంచి గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని, ప్రస్తుత సర్కార్ కూడా ఇప్పటి వరకు దృష్టి సారించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారుణ్య నియామకాల కోసం దరఖాస్తులు చేసుకున్నవారు సంబంధిత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా, పలుమార్లు కలెక్టర్లను కలిసి వినతి పత్రాలను అందజేసినా, ప్రజాప్రతినిధులను కలిసి వేడుకుంటున్నా ఫలితం లేకుండా పోయింది. కొవిడ్ సమయంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 180 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొవిడ్ వల్ల చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పిల్లలకు ఆరు నెలల్లో కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పించనున్నట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. దీనితో చనిపోయినవారి స్థానంలో తమకు ఉద్యోగాలు ఇవ్వాలని పలువురు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్నవారిలో వయసు పెరుగుతుండటంతో తమకు కొలువులు దక్కుతాయా లేదా అన్న ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కారుణ్య నియామకాలపై దృష్టి పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
నోటిఫికేషన్లలో చేర్చి...
గతేడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం వివిధ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. పలు శాఖల్లో ఖాళీలను అధికారులు ఇండెంట్ రూపంలో ఇవ్వడంతో వాటిని నోటిఫికేషన్లలో చేర్చారు. ఆయా జిల్లాలో కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులను పక్కకు పెట్టకపోవడంతో ఆ పోస్టులు కూడా భర్తీ అయ్యే అవకాశం ఉంది. దీంతో కారుణ్య నియామకాల కోసం దరఖాస్తులు పెట్టుకున్నవారు ఆందోళన చెందుతున్నారు. అయితే ఆయాశాఖల్లో ఖాళీలకు నోటిఫికేషన్లు ఇచ్చినందు వల్ల కారుణ్య నియామకాలతో పాటు ఇతర కోట కింద పోస్టులు భర్తీ చేయవద్దని కలెక్టర్లకు సీఎస్ నుంచి ఆదేశాలు అందినట్టు సమాచారం.
నీటిపారుదల శాఖలో నో చాన్స్
నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్, స్టెనో, టైపిస్టు ఉద్యోగాలను గ్రూప్ 4 ద్వారా మాత్రమే భర్తీ చేయాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేటగిరి పోస్టులను డిపెండెంట్, కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేయరాదని ఇటీవల జారీ అయిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. దీంతో నీటిపారుదల శాఖలో కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లినట్లయింది.
నేరుగా రిక్రూట్‌మెంట్ చేస్తే ఎలా!
వాస్తవానికి ఆయా ప్రభుత్వ శాఖల వారీగా కారుణ్య నియామకాల కోసం వచ్చిన ధరఖాస్తులను అధికారులు పరిశీలించి ఆ పోస్టులను మినహాయించి మిగిలిన పోస్టులను నోటిఫికేషన్‌లో చూపాల్సి ఉంటుంది. కానీ హడావుడిగా ఖాళీలను లెక్కించి సమాచారం ఇవ్వడంతో ఆ మేరకు జారీ అవుతున్న నోటిఫికేషన్ల వల్ల ఖాళీ పోస్టులు లేకుండా పోతున్నాయని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఇప్పుడు పరిస్థితుల్లో శాంక్షన్డ్ పోస్టులే చాలా తక్కువగా ఉన్నాయి. వాటిని డైరెక్టర్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేస్తే ఇక ఏండ్ల తరబడి ఖాళీలు ఉండకపోవచ్చని, ఫలితంగా కారుణ్య నియామకాలు జరగకపోవచ్చనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
మెడికల్ అన్‌ఫిట్ పరిస్థితీ అంతే..
సర్వీస్‌లో ఉండి తీవ్ర అనారోగ్యానికి గురై ఉద్యోగం చేయలేని స్థితిలో ఉన్నవాళ్లు మెడికల్ అన్‌ఫిట్ కోసం దరఖాస్తు పెట్టుకుంటారు. వారికి బదులు కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలని కోరుతారు. ఇలాంటి దరఖాస్తులు కూడా ఉమ్మడి జిల్లాలో 43 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని పరిశీలించడానికి జీఏడీతో పాటు ఉన్నతాధికారుల కమిటీ ఉంటుంది. ఆ కమిటీ కాలపరిమితి ఎప్పుడో ముగిసింది. కొత్త కమిటీని ఇప్పటి వరకు వేయలేదు. ఈ దరఖాస్తులను పరిశీలించేవారే లేరు. ఈ పోస్టుల భర్తీ అనుమానమే.