Share News

తెలంగాణ 7.391 టీఎంసీలు అదనంగా తరలించింది

ABN , Publish Date - Apr 03 , 2024 | 02:31 AM

: ఉమ్మడి జలాశయాల్లో ఉన్న 80 టీఎంసీల నీటిని... ఏపీ 45 టీఎంసీలు, తెలంగాణ 35 టీఎంసీలు వినియోగించడానికి గతేడాది అక్టోబరు 6వ తేదీన నిర్ణయం తీసుకున్నారని, అయితే ఇప్పటిదాకా తెలంగాణ

తెలంగాణ 7.391 టీఎంసీలు అదనంగా తరలించింది

కృష్ణాబోర్డుకు ఏపీ లేఖ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జలాశయాల్లో ఉన్న 80 టీఎంసీల నీటిని... ఏపీ 45 టీఎంసీలు, తెలంగాణ 35 టీఎంసీలు వినియోగించడానికి గతేడాది అక్టోబరు 6వ తేదీన నిర్ణయం తీసుకున్నారని, అయితే ఇప్పటిదాకా తెలంగాణ 42.391 టీఎంసీలు తరలించిందని ఏపీ ఆరోపించింది. ఈ మేరకు కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాసింది. జంట జలశయాల నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఏకపక్షంగా 7.391 టీఎంసీలను తెలంగాణ అదనంగా తరలించినట్లు ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి వివరించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద 17.60 టీఎంసీలు, నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ కింద 9.715 టీఎంసీలు, హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు 15.076 టీఎంసీలు కలుపుకొని 42.391 టీఎంసీలు వినియోగించుకుందని పేర్కొన్నారు. తాము(ఏపీ) పోతిరెడ్డిపాడు నుంచి 3.43 టీఎంసీలు, హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా 16.13 టీఎంసీలు, ముచ్చుమర్రి నుంచి 7.42 టీఎంసీలు, సాగర్‌ రైట్‌ కెనాల్‌ నుంచి 13.717 టీఎంసీలు, సాగర్‌ లెఫ్ట్‌ కె నాల్‌ ఏపీ భాగం నుంచి 1.760 టీఎంసీలు కలుపుకొని 42.457 టీఎంసీలు తీసుకున్నామని వెల్లడించారు. ఇక ఏపీలో తాగునీటి అవసరాల కోసం 5 టీఎంసీలను ఈనెల 8వ తేదీ నుంచి తరలించడానికి వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని నివేదించారు.

Updated Date - Apr 03 , 2024 | 02:31 AM