Share News

ఫలించిన పోరాటం !

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:03 AM

లగచర్ల భూ సేకరణను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని లగచర్ల తదితర గ్రామాల్లో ఫార్మా కారిడార్‌ ఏర్పాటుకు భూ అభిప్రాయ సేకరణలో అధికారుల జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం విదితమే. గిరిజన, రైతు, ప్రజాసంఘాల నాయకులు వ్యతిరేకించారు. ప్రజా వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తాజాగా ఫార్మా భూ సేకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.

ఫలించిన పోరాటం !

ఫార్మా భూ సేకరణ రద్దుతో సద్దుమణిగిన వివాదం

ఫలించిన గిరిజనులు, రైతు, ప్రజాసంఘాల ఆందోళనలు

వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. రైతుల్లో ఆనందం

రాష్ట్రంలో సంచలనం రేపిన లగచర్ల ఘటన

లగచర్ల భూ సేకరణను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని లగచర్ల తదితర గ్రామాల్లో ఫార్మా కారిడార్‌ ఏర్పాటుకు భూ అభిప్రాయ సేకరణలో అధికారుల జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం విదితమే. గిరిజన, రైతు, ప్రజాసంఘాల నాయకులు వ్యతిరేకించారు. ప్రజా వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తాజాగా ఫార్మా భూ సేకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.

కొడంగల్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): లగచర్ల ఫార్మా భూ సేకరణ ప్రతిపాదనను ఉప సంహరించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కొడంగల్‌ నియోజకవర్గంలోని లగచర్ల, రోటిబండ తండా, పులిచర్ల తండా, పోలేపల్లి, హకీంపేట్‌ గ్రామాల పరిధిలో ఫార్మా విలేజ్‌ల ఏర్పాటుకు భూముల సేకరణ కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో అధికారులపై దాడి జరగడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం విదితమే. తమ గ్రామాల్లో ఫార్మా వద్దంటూ భూ సేకరణ ప్రక్రియను విరమించుకోవాలని మొదటి నుంచి గిరిజన, రైతు, ప్రజా సంఘాల నాయకులు వ్యతిరేకించారు. ప్రజా వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తాజాగా ఫార్మా భూ సేకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా భూ సేకరణను ఉప రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం రైతులకు ఉపశమనం కలిగించింది. గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత భూ సేకరణను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటన చేశారు. ఆయా గ్రామాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంచలనం రేపిన లగచర్ల ఘటన

సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌ పరిధిలోని దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా భూ అభిప్రాయ సేకరణలో అధికారులపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. భూ అభిప్రాయ సేకరణలో భాగంగా లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండా, హకీంపేట్‌, పోలెపల్లి గ్రామాల పరిధిలో 1314.21 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫార్మా విలేజ్‌ల ఏర్పాటు ప్రకటన వెలువడినప్పటి నుంచి రైతులు, గిరిజనుల నుంచి భూ సేకరణను వ్యతిరేకిస్తూ నిరసనలు, ఆందోళనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 11న భూసేకరణపై ప్రజాభిప్రాయం సేకరించేందుకు లగచర్లకు వెళ్లిన జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, అదనపు కలెక్టర్‌ లింగ్యానాయక్‌, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి ఇతర అధికారులపై స్థానిక రైతులు, ఇతర గ్రామాల ప్రజలు దాడికి పాల్పడడమే కాకుండా వారి వాహనాలను ధ్వంసం చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. కాగా, ఈ దాడిలో కడా అధికారి వెంకట్‌రెడ్డికి తీవ్ర గాయాలు కాగా, ఇంకా ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. లగచర్ల ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 71 మందిపై కేసులు నమోదు చేయగా, వారిలో 29 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, మిగతా వారు పరారీలో ఉన్నారు. రిమాండ్‌కు తరలించిన వవారిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఆయన ప్రధాన అనుచరుడు బోగమోని సురేశ్‌ కూడా ఉన్నారు.

ఢిల్లీకి చేరిన లగచర్ల...

ఫార్మా భూ సేకరణపై నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా అధికారులపై జరిగిన దాడి ఘటనలో గిరిజన రైతుల అరెస్టులు, రిమాండ్‌ల నేపథ్యంలో బాధిత కుటుంబాల ఆందోళనలు, నిరసనలు ఢిల్లీకి చేరాయి. ఢిల్లీలోని జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళ జాతీయ మానవ హక్కుల కమిషన్లకు వారు ఫిర్యాదు చేశారు. తమ వారిని పోలీసులు అక్రమంగా రాత్రిపూట అరెస్టు చేశారని, ఈ సందర్భంగా పోలీసులు తమ పట్ల అసభ్యకరంగా, అమానుషంగా, దౌర్జన్యంగా వ్యవహరించారంటూ పలువురు మహిళలు కమిషన్లకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ప్రతినిదులు, జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యులు లగచర్ల, రోటిబండ తండా తదితర గ్రామాల్లో పర్యటించి బాధిత కుటుంబాల నుంచి వివరాలు సేకరించారు.

రైతులు ఆసక్తిగా లేరు..

వామపక్ష నాయకులు, ప్రజా సంఘాలు, గిరిజన సంఘాల నాయకులు గ్రామాల్లో పర్యటించి సమగ్ర నివేదికతో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఫార్మాకు భూములను ఇచ్చేందుకు రైతులు ఆసక్తిగా లేరనే విషయం సీఎం దృష్టికి తీసుకు వెళ్లారు. ఫార్మా కోసం భూ సేకరణ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రైతులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు.

భూ అభిప్రాయ సేకరణ

ఫార్మా విలేజ్‌ల కోసం కారిడార్‌కు దుద్యాల మండలంలోని లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండా, హకీంపేట్‌, పోలెపల్లి గ్రామాల్లో 1314.21 ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూ సేకరణకు ప్రతిపాదించిన 1314.21 ఎకరాల్లో 637.36 ఎకరాలు అసైన్డ్‌ భూములు, 677.27 పట్టా భూములు ఉన్నాయి. లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల పరిధిలో 677.36 ఎకరాల భూ సేకరణ చేయాలని ప్రతిపాదించగా, వాటిలో 156.05 ఎకరాల అసైన్డ్‌ భూములు, 521.22 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. హకీంపేట్‌ పరిధిలో 506.13 ఎకరాలలో అసైన్డ్‌ 351.10 ఎకరాలు, పట్టాభూములు 155.03 ఎకరాలు, పోలేపల్లి పరిధిలో 130.21 ఎకరాల అసైన్డ్‌ భూములను సేకరించాలని భావించగా, మొదటి నుంచి రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూ వచ్చింది. చివరకు భూ సేకరణను ప్రభుత్వం ఉప సంహరించుకున్నట్లు ప్రకటించడంతో ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. కాగా ఈనెల 11వ తేదీ నుంచి చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో దుద్యాల మండలంలో ఫార్మాకు బదులుగా మల్టీపర్పస్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఫార్మా విలేజ్‌లకు బదులుగా కాలుష్యం వెదజల్లని ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నట్లు సమాచారం.మల్టీ పర్పస్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ కోసం అవసరమైన భూముల సేకరణకు తాండూరు సబ్‌ కలెక్టర్‌ను భూసేకరణ అధికారిగా నియమించినట్లు జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ తెలిపారు.

భూములు ఇచ్చేది లేదు

ప్రభుత్వం ఫార్మాను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసినా మాలో సంతోషం లేదు. ఈ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు పెట్టే ప్రయత్నం చేసినా మేము మా భూములు ఇచ్చేది లేదు. మా భూముల జోలికి ఎవరు వచ్చినా ఊరుకునేది లేదు..

: రాంనాయక్‌, రోటిబండతండా

నోటిఫికేషన్‌ రద్దు చేసినా..

ఫార్మా భూ సేకరణ రద్దు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినా ఇంకా మాకు భయంగానే ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి లగచర్ల ప్రాంతంలోని గిరిజనుల భూములను తీసుకోమని ప్రకటిస్తే సంతోషిస్తాం. మా భూములు మాకే ఉండాలి.

అంబిక, రోటిబండ తండా

మా పిల్లలను విడుదల చేయాలి

ఫార్మా భూసేకరణ రద్దు ప్రకటన సంతోషాన్ని మిగల్చలేదు. అరెస్టయిన మా పిల్లలను జైలు నుంచి విడుదల చేసి మా భూములకు భద్రత కల్పిస్తేనే మాకు సంతోషం. తండా పరిసరాల్లో తరచూ పోలీసులు ఉండడంతో భయంగా గడుపుతున్నాం.

రూప్లనాయక్‌, పులిచర్లకుంట తండా

మా భూములు కోల్పోవడం బాధగా ఉంది

భూములను తీసుకోవడం సరైంది కాదు. భూములు కోల్పోతే ఏ ఊరో చెప్పుకోలేని పరిస్థితి. ఫార్మా విలేజ్‌ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిసింది. కానీ తిరిగి ఇండసి్ట్రీయల్‌ కారిడార్‌ కోసం భూములను సేకరిస్తామని ప్రకటించడం వల్ల మా భూములకు ఎక్కడ ముప్పు వస్తుందోనని భయం జ్యోతి, రోటిబండ తండా

మా భూముల జోలికి వస్తే ఊరుకోం

ఫార్మా ఇతర అవసరాలకు మా భూముల జోలికి వస్తే ఎదురు తిరుగుతాం. పంట సాగుకు తప్పా, మిగతా ఏ పనికైనా మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. అరెస్టు చేసిన వారిని వెంటనే వదిలి పెట్టాలి.

సక్రిబాయి, రోటిబండ తండా

Updated Date - Nov 30 , 2024 | 12:03 AM