శారీ.. సారీ
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:33 PM
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ. పూలను పూజించే వేడుక బతుకమ్మ పండుగ ఆడపడుచుల్లో సంబరాన్ని నింపుతుంది.
జిల్లాలో బతుకమ్మ చీరల పంపకానికి మంగళం!
ఈ సారి పంపిణీ లేనట్లే
చీరలకు బదులు నగదు ఇచ్చే యోచనలో సర్కారు ?
మేడ్చల్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ బతుకమ్మ. పూలను పూజించే వేడుక బతుకమ్మ పండుగ ఆడపడుచుల్లో సంబరాన్ని నింపుతుంది. పేద, ధనిక తేడా లేకుండా మహిళలు భక్తిశ్రద్దలతో తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మను కొలుస్తారు. బతుకమ్మ పండుగ సందర్భంగా గత ప్రభుత్వం ఆడపడుచులకు చీరలను సారెగా అందించింది. పండుగ ప్రారంభానికి ముందు ఈ చీరలను పంపిణీ చేసేవారు. తెల్లరేషన్ కార్డులో నమోదైన 18ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు బతుకమ్మ చీరలను అందించారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో గతేడాది 2లక్షల41వేల594 మంది లబ్ధ్దిదారులకు మండలాలు, మున్సిపాల్టీల వారీగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి చీరలను పంపిణీ చేసేవారు. గతేడాది కొత్తకొత్త రంగులతో డాబీ, జాకార్డ్‌లలో 19డిజైన్లు, 190వెరైటీల్లో యువతులు, మహిళలు, వృద్దుల కోసం చీరలు తయారు చే యించి పంపిణీ చేశారు. కానీ ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీని నిలిపివేసింది. నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి కూడా చీరల పంపిణీపై ప్రభుత ్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో దాదాపు ఈఏడాది చీరల పంపిణీ లేనట్టేననని మహిళలు భావిస్తున్నారు. చీరల పంపిణీకి బదులుగా నగదు పంపిణీ చేసే యోచనలో ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఏదీఏమైనా కొన్ని సంవత్సరాలుగా బతుకమ్మ పండుగకు ముందు గత ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని నిలిపివేయడంతో గ్రామాల్లో సందడి తగ్గింది.