Boyi Vijayabharati: ప్రఖ్యాత రచయిత్రి, సాహిత్య పరిశోధకురాలు బోయి విజయ భారతి ఇకలేరు
ABN, Publish Date - Sep 29 , 2024 | 04:43 AM
జ్యోతిరావుఫూలే జీవిత చరిత్రను తెలుగులోకి అనువదించిన తొలి రచయిత్రి, పురాణ, ఇతిహాసాలపై విశ్లేషణాత్మక వ్యాఖ్యానాలు రాసిన ప్రసిద్ధ విమర్శకురాలు బోయి విజయభారతి (84) ఇకలేరు.
ఫూలే జీవిత చరిత్రను తెలుగులోకి అనువదించిన తొలి రచయిత్రి
సీఎం రేవంత్, కేసీఆర్ సంతాపం
రాహుల్ బొజ్జాను పరామర్శించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): జ్యోతిరావుఫూలే జీవిత చరిత్రను తెలుగులోకి అనువదించిన తొలి రచయిత్రి, పురాణ, ఇతిహాసాలపై విశ్లేషణాత్మక వ్యాఖ్యానాలు రాసిన ప్రసిద్ధ విమర్శకురాలు బోయి విజయభారతి (84) ఇకలేరు. కొంతకాలంగా జీర్ణకోశ సమస్యతో బాధపడుతున్న ఆమె నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 6గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె, ప్రముఖ కవి బోయి భీమన్న, నాగరత్నమ్మ దంపతుల కుమార్తె. ప్రఖ్యాత మానవహక్కుల న్యాయవాది దివంగత బొజ్జా తారకం సతీమణి. విజయభారతి కుమార్తె డాక్టర్ మహిత ఉస్మానియా మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ కాగా, కుమారుడు రాహుల్ బొజ్జా తెలంగాణ ఇరిగేషన్ శాఖలో ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్నారు.
విజయభారతి పుట్టి, పెరిగింది ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజోలులో. అక్కడే ఎస్‌ఎల్సీ పూర్తిచేసిన అనంతరం కాకినాడలోని పిఠాపురం ప్రభు త్వ కళాశాలలో ఇంటర్ అభ్యసించారు. కోఠి మహిళా కళాశాలలో డిగ్రీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చదివారు. ‘దక్షిణ దేశీయాంధ్ర వాజ్మయం - సాంఘిక పరిస్థితులు’ అంశంపై పరిశోధన పూర్తిచేశారు. కొద్దికాలం సమాచార, పౌరసంబంధాల శాఖలో అనువాదకురాలిగా సేవలందించారు. నిజామాబాద్ మహిళా కళాశాల అధ్యాపకురాలిగా, వైస్ ప్రిన్సిపల్‌గా 1965 నుంచి78 వరకు పనిచేశారు. తెలుగు అకాడమీలో రీసర్చి ఆఫీసరుగా, డిప్యూటీ డైరెక్టరుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇన్‌చార్జి డైరెక్టర్‌గా 1999లో పదవీ విరమణ పొందారు.
ఆమె హయాంలోనే రాష్ట్ర స్థాయి ఇంటర్ పాఠ్యపుస్తకాలు ఇంగ్లిషు మాధ్యమంలో రాయించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. భారతీయ కులవ్యవస్థ ఆధారంగా పురాణ, ఇతిహాసాలపై విశ్లేషణాత్మక వ్యాఖ్యానాలు రాశారు. ‘సత్యహరిశ్చంద్రుడు’, ‘వ్యవస్థను కాపాడిన రాముడు’, ‘షట్చక్రవర్తులు’, ‘రామాయణ మునులు’, ‘దశావతారాలు’, ‘నరమేధాలు - నియోగాలు’, ‘ఇతిహాసాలు మహాభారతం’, ‘పురాణాలు - మరోచూపు’, ‘ఇతిహాసాలు - రామకథ’ తదితర రచనలు వెలువడ్డాయి. విజయభారతి రాసిన ‘బాబాసాహెబ్ డాక్టర్ అంబేడ్కర్’, ‘మహాత్మా జ్యోతిరావు ఫూలే’ జీవిత చరిత్రలు అమితాదరణ పొందాయి. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఉమ్మడి ఏపీ మాజీ ప్రధాన కార్యదర్శి కాకిమాధవరావు, ఆదిత్యానాథ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తదితరులు ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి, రాహుల్ బొజ్జాను పరామర్శించారు.
టీఎ్‌సపీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, జూలూరు గౌరీశంకర్, విజయభారతి భౌతికకాయాన్ని సందర్శించారు. విజయ భారతి కోరిక మేరకు భౌతికకాయాన్ని ఉస్మానియా మెడికల్ కళాశాలకు అందించనున్నట్లు కుటుం బ సభ్యులు తెలిపారు. కాగా, ప్రముఖ రచయిత్రి బోయి విజయభారతి మరణం బాధాకరం అంటూ సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా ఆమె అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేశారు. విజయభారతి కుటుంబానికి ఎక్స్ వేదికగా రేవంత్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. విజయభారతి మరణం పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
Updated Date - Sep 29 , 2024 | 04:43 AM