ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా యాట గీత ఖరారు
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:00 AM
ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వారం, పది రోజుల్లో కమిటీ ఏర్పాటుకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. కాగా, చైర్మన్, వైస్ చైర్మన్ కమిటీ సభ్యుల పేర్లను అందరికీ ఆమోదయోగ్యంగా.. పార్టీ కోసం కష్టపడిన వారి పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. ఆ
వైస్ చైర్మన్‌గా గూడూరు భాస్కర్‌రెడ్డి, సూదిని శ్రీనివాస్‌రెడ్డి పేర్ల పరిశీలన
వారం రోజుల్లో కమిటీ ఏర్పాటు
కసరత్తు ప్రారంభించిన ఎమ్మెల్యే కసిరెడ్డి
అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయం
విధేయత, కష్టపడిన వారికి స్థానం
ఆమనగల్లు, సెప్టెంబరు 15 : ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వారం, పది రోజుల్లో కమిటీ ఏర్పాటుకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. కాగా, చైర్మన్, వైస్ చైర్మన్ కమిటీ సభ్యుల పేర్లను అందరికీ ఆమోదయోగ్యంగా.. పార్టీ కోసం కష్టపడిన వారి పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. ఆమనగల్లు, కడ్తాల్, మాడ్గుల, తలకొండపల్లి మండలాలతో కూడిన ఆమనగల్లు మార్కెట్ కమిటి కి గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నియమించిన పాలకవర్గం పదవీ కాలం గడువు అక్టోబరు 11 2023తో ముగిసింది. దాంతో కాంగ్రెస్‌కు చెందిన చాలామంది మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ పదవులపై ఆశలుపెంచుకొని ఎవరికి వారు ప్రయత్నాలు సాగిస్తూ వస్తున్నారు. అయితే, రిజర్వేషన్‌లో భాగంగా బీసీ మహిళకు కేటాయించిన ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఈసారి పెద్దగా పోటీ కూడా ఏర్పడలేదు. బీసీ కులగణన, ఆరు గ్యారంటీలు పూర్తిస్థాయిలో అమలు చేసిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్ల ద్వారా కొంతమంది పార్టీ నేతలకు అవకాశం లభిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికల వరకు పార్టీ మరింత బలోపేతానికి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం, ఎమ్మెల్యే కసిరెడ్డి భావిస్తున్నారు. కల్వకుర్తి, ఆమనగల్లు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల విషయంలో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. దాంతో కడ్తాల్ మండలం మైసిగండి గ్రామానికి చెందిన టీపీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివా్‌సగౌడ్ సతీమణి పద్మశ్రీ పేరును ప్రతిపాదించగా.. అందుకు కార్పొరేషన్ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న శ్రీనివా్‌సగౌడ్ అయిష్టత చూపినట్లు సమాచారం. ఆ తరువాత మాడ్గుల మండలం సుద్దపల్లి మాజీ సర్పంచ్ యాచారం వెంకటేశ్వర్లుగౌడ్ సతీమణి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయనకు ఇతర అవకాశాలు కల్పించడానికి నిర్ణయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తూ వంశీకి నమ్మిన బంటుగా పేరుగాంచిన ఆ మనగల్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ సతీమణి గీత పేరును చైర్మన్ పదవికి ఖరారు చేసినట్లు సమాచారం. వైస్ చైర్మన్ పదవికి కడ్తాల మండల కేంద్రానికి చెందిన ఎమ్మెల్యే కసిరెడ్డి అనుచరుడు కాంగ్రెస్ జిల్లా నాయకులు గూడూరు భాస్కర్‌రెడ్డితో పాటు మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామానికి చెందిన రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు సూదిని శ్రీనివా్‌సరెడ్డి పేర్లు పరిశీలిస్తున్నారు. ఏళ్ల కాలంగా తనవెంట నడుస్తున్న గూడూరు భాస్కర్‌రెడ్డి వైపే ఎమ్మెల్యే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మాడ్గులకు చెందిన సీనియర్ నాయకుడు సూదిని కొండల్‌రెడ్డి పేరు కూడా వైస్ చైర్మన్ పదవికి చర్చకు వచ్చినా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన్ను బరిలో నిలపాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. డైౖరెక్టర్ పదవులకు మండలానికి రెండేసి పేర్లను తీసుకున్నట్లు సమాచారం. చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు పేర్లు దాదాపు ఖరారు కావడంతో పాలకవర్గం నియామకానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వానికి తుది జాబితా అందజేయనున్నారు.