ఇంటింటా ఇంకుడుగుంత ఏర్పాటుకు చట్టం
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:11 AM
ఇంటింటా ఇంకుడు గుంతను తవ్వి వర్షపు నీటిని భూమిలో ఇంకించడానికి చట్టం తీసుకువస్తామని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు.
సీఎం సమక్షంలో రాష్ట్ర సదస్సు
ప్రయోజనాలపై చర్చ : ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్‌నగర్‌అర్బన్, సెప్టెంబరు 4: ఇంటింటా ఇంకుడు గుంతను తవ్వి వర్షపు నీటిని భూమిలో ఇంకించడానికి చట్టం తీసుకువస్తామని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇంకుడు గుంతల నిర్మాణాలతో బహుళ ప్రయోజనాలున్నాయని తెలిపారు. మున్సిపాలిటీలు, పట్టణాలు, నగరాలు, మహానగరాలు క్రాంకిట్ జంగిల్‌గా మారాయని గుర్తుచేశారు. అలాగే కుంటలు, చెరువులు, పాటుకాలువలు అక్రమణకు గురై భవన నిర్మాణాలు వెలుస్తున్నాయని తెలిపారు. షాద్‌నగర్ పట్టణంలో ఉన్న కుంటలు సైతం మాయమైనాయన్నారు. దాంతో కురిసిన ప్రతీ వర్షపు చుక్కా రోడ్లుపైన ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాల్లో నిలుస్తున్నాయని, అదే ఇంటింటా ఇంకుడు గుంతలు తీస్తే చాలావరకు వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భజలం పెరుగుతుందన్నారు. ఇంకుడు గుంతలను తొవ్వి, చెరువులు, కుంటలను పరిరక్షిస్తే జల ప్రళయాలు తగ్గుతాయని వివరించారు. ఈ విధానం విధిగా అమలు చేస్తే తాగునీటి సమస్యనే ఉండబోదని తెలిపారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి, రాష్ట్రస్థాయిలో సదస్సును నిర్వహిస్తామని, ఇంటి నిర్మాణ స్థాయిని బట్టి ప్రతీఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించేలా చట్టం తీసుకువస్తామని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు.