Share News

‘యంగ్‌ ఇండియా’కు స్థలాలు ఖరారు

ABN , Publish Date - Sep 11 , 2024 | 11:43 PM

అన్ని రకాల గురుకుల విద్యాలయాలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌’ స్కూళ్లను ఏర్పాటు చేయబోతుంది. నాణ్యమైన విద్య, వసతి అందించే విధంగా మోడల్స్‌ను తయారు చేశారు.

‘యంగ్‌ ఇండియా’కు స్థలాలు ఖరారు
యాలాల మండలం దౌలాపూర్‌ వద్ద కేటాయించిన స్థలం

అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు

మొదటి విడతలో కొడంగల్‌, తాండూరులో నిర్మాణం

ఒకే గొడుగు కిందకు గురుకుల రెసిడెన్షియల్స్‌

తాండూరు, సెప్టెంబరు 11: అన్ని రకాల గురుకుల విద్యాలయాలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌’ స్కూళ్లను ఏర్పాటు చేయబోతుంది. నాణ్యమైన విద్య, వసతి అందించే విధంగా మోడల్స్‌ను తయారు చేశారు. తొలి యేడాది తాండూరు డివిజన్‌ పరిధిలో తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాల్లో ఈ విద్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు అవసరమైన 20ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గలైన పరిగి, వికారాబాద్‌, తాండూరు, కొడంగల్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో ‘యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌’ స్కూళ్ల ఏర్పాటుకు యాలాల మండలం దౌలాపూర్‌ గ్రామశివారు కొడంగల్‌ మార్గంలో సర్వే నెంబరు 69లో 23.5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ స్థలాన్ని రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఏర్పాటు కోసం కేటాయిస్తూ కలెక్టర్‌కు ప్రతిపాదనలు పంపాలని ఎమ్మెల్యే ఆర్డీవోను ఆదేశించారు. తాండూరు డివిజన్‌ పరిధిలోకి వచ్చే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించే కొడంగల్‌ నియోజకవర్గంలో మోడల్‌ యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టారు. కొడంగల్‌ రెవెన్యూ గ్రామంలో సర్వే నం. 496లో 20ఎకరాలు కేటాయించారు.

ఒకే ప్రాంగణంలో..

ప్రస్తుతం ఎక్కడెక్కడో వేర్వురుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జనరల్‌ గురుకుల పాఠశాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో ఒకే ప్రాంగణంలో ఈ గురుకులాలన్నింటినీ నిర్మించనున్నారు. అన్నివర్గాల విద్యార్థుల మధ్య స్నేహభావం పెరిగి అంతరాలు తొలగిపోయే ఆస్కారముంటుందని సర్కార్‌ శ్రీకారం చుట్టింది. షెడ్యూల్డ్‌ కులాల, షెడ్యుల్డ్‌ తెగల సంక్షేమం కోసం ఈ యంగ్‌ ఇండియా ఇంటిగ్రే టెడ్‌ స్కూళ్ల నిర్మాణానికి అవసరమైన బడ్జెట్‌ను కేటాయించారు.

పరిగి, వికారాబాద్‌లో చాలని జాగలు

పరిగి, వికారాబాద్‌ నియోజకవరాల్లో గుర్తించిన స్థలాలు సరిపోవడం లేదు. 20 నుంచి 25 ఎకరాలు కావాల్సి ఉండగా, పరిగిలో 7.25 ఎకరాల ప్రభుత్వ భూములను గుర్తించారు. వికారాబాద్‌లో 20 ఎకరాల స్థలం గుర్తించినప్పటికీ అలంపల్లిలో 10 ఎకరాలు, గంగారంలో 10 ఎకరాల భూములు వేర్వేరుగా ఉండడంతో ఇక్కడ నిర్మించడం సాధ్యం కాదు. తాండూరు, కొడంగల్‌లో అవసరమైన మేరకు ప్రభుత్వ భూమి ఉండడంతో మొదటి దశలో ఈ రెండు సెగ్మెంట్లలో ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లు నిర్మాణానికి లైన్‌ క్లియర్‌ అయింది.

ఈ ఏడాది నిర్మాణ పనులు ప్రారంభిస్తాం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం ఆలోచనలతో దేశంలో ఎక్కడ లేని విధంగా విద్యకు ప్రాధాన్యతమిస్తూ‘ యంగ్‌ ఇండియా ఇంటి గ్రేటేడ్‌ ’ స్కూళ్లను నిర్మించుకోబోతున్నాం. జిల్లాలోనే తాండూరు నియోజవర్గంలో మొదట స్థల సేకరణ ప్రక్రియను పూర్తి చేశాం. ఈ ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణానికి త్వరలో ఉత్తర్వులు రానున్నాయి.

-మనోహర్‌రెడ్డి , తాండూరు ఎమ్మెల్యే

అంచనా వ్యయం ఖరారు కాలేదు

ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణానికి అంచన ఎంత అన్న విషయాన్ని ఇంకా ప్రభుత్వంతేల్చలేదు. ఇంకా పూర్తిస్థాయి నమూనా కూడా ఖరారు కావాల్సి ఉంది. మోడల్‌గా కొడంగల్‌, మధిరలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఎంత ఖర్చు అవుతుందో లెక్కించి ఇతర ప్రాంతాల్లో నిర్మించేందుకు అవసరమైన నిధులను మంజూరు చేయనున్నారు.

-శ్రీనివాస్‌ రావు , ఆర్డీవో

జిల్లాలో సూళ్ల ఏర్పాటుకు స్థలాల గుర్తింపు ఇలా

నియోజకవర్గం రెవెన్యూ పరిధి సర్వే విస్తీర్ణం నం. (ఎకరాల్లో)

తాండూరు దౌలాపూర్‌ 69 23.05

కొడంగల్‌ కొడంగల్‌ 469 20.01

వికారాబాద్‌ అలంపల్లి 503 10

గంగారం 67 10

పరిగి పరిగి 530 7.25

Updated Date - Sep 11 , 2024 | 11:43 PM