Share News

మహాత్మా.. మన్నించు!

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:05 AM

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహాత్ముడి విగ్రహాలకు కనీస నిర్వహణ కరువైంది. పలు చోట్ల విగ్రహాలు ధ్వంసమవుతున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారు. నేడు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విగ్రహాలు, పార్కుల తీరుపై ప్రత్యేక కథనాలు..

మహాత్మా.. మన్నించు!

గాంధీజీ విగ్రహాలు, చేతికర్రలు ధ్వంసం

కనీసం రంగులు కూడా వేయని దుస్థితి

గాంధీ పార్కుల్లో కనీస వసతులు కరువు

నేడు జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహాత్ముడి విగ్రహాలకు కనీస నిర్వహణ కరువైంది. పలు చోట్ల విగ్రహాలు ధ్వంసమవుతున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారు. నేడు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా విగ్రహాలు, పార్కుల తీరుపై ప్రత్యేక కథనాలు..

పెద్దేముల్‌, అక్టోబరు 1: పెద్దేముల్‌ మండల పరిధిలో మండల కేంద్రంలో ఒకే ఒక గాంధీజీ విగ్రహం ఉంది. అది పూర్తిగా శిథిలమై కింద పడిపోయే పరిస్థితికి చేరింది. చేతిలో కర్రలేదు. విగ్రహం నిలబడే స్థితిలో లేదు. శిథిలమైన విగ్రహానికి తీగకట్టి నిలబడేలా చేశారు. ఆయన జయంతి, వర్ధంతి వచ్చినపుడు మాత్రం పలువురు రాజకీయ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ఫొటోలు దిగి అక్కడితో మరిచిపోతున్నారు. శిథిలావస్థకు చేరినా కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామనే ఆలోచనే లేకుండా పోయింది. రాజకీయాల కోసం ఊరూరా విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నా.. వాటి నిర్వహణను మాత్రం గాలికి వదిలేస్తున్నారు. గాంధీ జయంతి రోజైనా పెద్దేముల్‌ మండల కేంద్రంలో నూతన విగ్రహం ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

రంగులకు నోచుకోని దుస్థితి

చేవెళ్ల: చేవెళ్ల మండల పరిధిలోని తల్లారం పంచాయతీ సమీపంలోని ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహం కనీసం రంగులకు నోచుకోవడం లేదు. చాలా సంవత్సరాల క్రితం గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న ఈ విగ్రహానికి రంగులు వేయకపోవడంతో వెలసిపోయి దర్శనమిస్తోంది. ఏడాదికి ఒకసారి జయంతివేడుకలు నిర్వహించినప్పటికి విగ్రహానికి మాత్రం రంగులు వేయడం మరిచారు. దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహనీయుడు జాతిపిత మహత్మా గాంధీజీ విగ్రహం జయంతి రోజైనా కనీస అలంకరణకు నోచుకోకపోవడం పలువురు అసహంనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 02 , 2024 | 08:07 AM