వినాయక నిమజ్జనంలో లొల్లి
ABN , Publish Date - Sep 15 , 2024 | 11:54 PM
వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో గణేశుడి నిమజ్జన శోభాయాత్రలో ఆదివారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది.
పూడూరు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలో గణేశుడి నిమజ్జన శోభాయాత్రలో ఆదివారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పూడూరు మండల కేంద్రంలో ఎస్సీకాలనీ, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో ఏర్పాటు చేసిన గణేశులకు ఆదివారం నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు. ఒక వాహనంలో రెండు విగ్రహాలు, మరో వాహనంలో ఒక విగ్రహన్ని శోభయాత్రగా వెళ్లారు. అయితే మండల కేంద్రంలో ఈ గణేశ్ విగ్రహాలను డీజే సౌండ్స్‌తో శోభయాత్ర కొనసాగుతుండగా పోలీసులు వచ్చి డీజేకు అనుమతి లేదని, నిలిపివేయాలని అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఒక గణేశుడి విగ్రహనికి నడిరోడ్డుపై దింపి గ్రామస్థులు నిరసనను వ్యక్తం చేశారు. ఎస్‌ఐ మధుసూధన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్‌ఐ మద్యం సేవించి వివాదాన్ని సృష్టించారని గ్రామస్తులు కొందరు ఆరోపించారు. ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులపై అధికార పార్టీ నేతల ప్రమేయంతోనే ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈవివాదం రాజకీయ రంగు పలుపుకుందని చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల అంతర్గత ఆధిపత్యం కోసమే ఈ వివాదానికి దారి తీసిందని చెబుతున్నారు. అనంతరం పరిగి సీఐ ఎన్ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. డీజే వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. అనంతరం రాత్రి గణేశుల విగ్రహాలను నిమజ్జనం చేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.