హైడ్రా డేగ కన్ను
ABN , Publish Date - Sep 11 , 2024 | 11:45 PM
చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా దూకుడు పెంచుతోంది. నగర శివార్లలోని చెరువులు, కుంటలు, నాలాలతో పాటు ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను పరిశీలించేందుకు హైడ్రా బృందాలు ఫిర్యాదులు ఆధారంగా స్థల పరిశీలనలు చేస్తున్నాయి.
చెరువులు, కుంటలు, సర్కార్ స్థలాల పరిశీలన
గుట్టుచప్పుడు కాకుండా పర్యటిస్తున్న బృందాలు
సిబ్బంది పెంపుతో మరింత దూకుడు
మూసీ, జంట జలాశయాలపై ప్రత్యేక దృష్టి
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)
చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా దూకుడు పెంచుతోంది. నగర శివార్లలోని చెరువులు, కుంటలు, నాలాలతో పాటు ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను పరిశీలించేందుకు హైడ్రా బృందాలు ఫిర్యాదులు ఆధారంగా స్థల పరిశీలనలు చేస్తున్నాయి. ఇంతేకాక సుదీర్ఘకాలంగా కబ్జాలకు గురవుతున్న చెరువులు, కుంటలు, ఇతర జలాశయాలను పరిశీలించేందుకు గుట్టుచప్పుడు కాకుండా పర్యటిస్తున్నాయి. హైడ్రాను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అదనపు సిబ్బందిని కూడా నియమిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 15 మంది సీఐలు, 8 మంది ఎస్‌ఐ స్థాయి అధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ సంఖ్యను మరింత పెంచనున్నట్లు సమాచారం. అలాగే హైడ్రా కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలపై వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ప్రకటించారు. కోర్టులకు వెళ్లినా కొట్లాడి మరీ అక్రమనిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు. ఇక మధ్య, పేద తరగతి వర్గాల వారికి నష్టం జరకుండా చూస్తామని హైడ్రా అధికారులు చెబుతున్నారు. నివాసం ఉండే ఇళ్ల జోలికి ఇప్పట్లో వెళ్లమని కూడా ప్రకటించారు. తెలిసో తెలియకో ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలో ఇళ్లు కొనుగోలు చేసిన వారికి ఇది కొంత ఊరట కలిగించే విషయం. దొడ్డిదారిన కొందరు బిల్డర్లు హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అనుమతులు తీసుకుని నివాస సముదాయాలు నిర్మించి అమ్మేశారు. తొలుత హైడ్రా ఈ నిర్మాణాలను కూడా కూల్చివేసింది. దీంతో బాధితులతో పాటు కొన్నివర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో హైడ్రా వివరణ ఇచ్చింది.
ఇప్పటికే 112 ఎకరాలు స్వాధీనం
ఇదిలా ఉంటే ఇప్పటికే గ్రేటర్ పరిధిలో 23 ప్రాంతాల్లో 262 ఎకరాల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసి దాదాపు 112 ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా ప్రకటించింది. ఇందులో సింహభాగం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. మాదాపూర్ సున్నం చెరువులో 42, గగన్ పహాడ్ అప్పాచెరువులో 14, దుండిగల్ కత్వా చెరువు పరిధిలోని 13 అక్రమ నిర్మాణాలను తొలగించారు. సున్నం చెరువులో అక్రమణలు తొలగించి 10 ఎకరాలు, గండిపేటలో 8.75 ఎకరాలు, చిలుకూరులో 6.5 ఎకరాలు, కత్వా చెరువులో 2.5 ఎకరాలు, తుమ్మిడి కుంటలో 4.9 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వెల్లడించింది.
హిమాయత్‌సాగర్, మూసీపై దృష్టి
ప్రస్తుతం నగర శివార్లలోని జంట జలాశయాలైన గండిపేట(ఉస్మాన్‌సాగర్) హిమాయత్‌సాగర్ చెరువులతో పాటు మూసీ పరీవాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలపై ఎక్కువ దృష్టి పెడుతోంది. ఇప్పటికే గండిపేట చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా అధికారులు ప్రస్తుతం హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతంతో పాటు మూసీపై దృష్టి సారించారు. హిమాయత్‌సాగర్, మూసీ పరివాహక ప్రాంతంలోని ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు పరిశీలిస్తున్నారు. సంబంధిత అధికారులతో కలిసి రహస్యంగా సర్వేలు చేయించి ఎఫ్‌టీఎల్, బఫర్‌జోజోన్ పరిధి గుర్తించి మార్కింగ్ చేస్తున్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని అజీజ్‌నగర్, నాగిరెడ్డిగూడ రెవెన్యూ పరిధిలో హైడ్రా అధికారులు ఇప్పటికే సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారు. మరో వైపు హైడ్రా కూల్చివేతలతో అప్రమత్తమైన కొంత మంది ముందుగానే స్వయంగా అక్రమణలు తొలగించుకుంటున్నారు. ఇందులో కొందరు ప్రముఖులు కూడా ఉండడం గమనార్హం. బఫర్‌జోన్ పరిధిలోని ప్రహరీ, షెడ్లు తొలగించి ఫెన్సింగ్ వేసుకుంటున్నారు. తొలగించిన శిఽథిలాలుకూడా అక్కడ లేకుండా జాగ్రత్త పడుతున్నారు. త్వరలో హిమాయత్‌సాగర్, మూసీ పరీవాహాక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు భారీ ఆపరేషన్ ఉండవచ్చని తెలుస్తోంది.