Share News

‘హై’టెన్షన్‌

ABN , Publish Date - Sep 16 , 2024 | 12:15 AM

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎల్‌అండ్‌టీ సంస్థ బీదర్‌ నుంచి మహేశ్వరం వరకు వేస్తున్న 765కేవీ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ పనులతో రైతుల్లో టెన్షన్‌ నెలకొంది.

‘హై’టెన్షన్‌

ట్రాన్స్‌మిషన్‌ లైన్‌తో ఆందోళన

రైతుల ఆమోదం లేకుండానే భూ సేకరణ

కొనసాగుతున్న బీదర్‌-మహేశ్వరం 765కేవీ లైన్‌ పనులు

400కేవీ లైన్‌కు నిర్ధారించిన పరిహారంతో సరి!

నామమాత్ర కంపెన్సేషన్‌తో రైతుల ఆగ్రహం

ప్రస్తుత మార్కెట్‌ ధర ఇవ్వాలని డిమాండ్‌

పలు చోట్ల పనుల అడ్డగింత

నిరసనలకు సిద్ధమవుతున్న భూ నిర్వాసితులు

పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా చేపడుతున్న బీదర్‌-మహేశ్వరం 765కేవీ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌కు భూమి కోల్పోతున్న రైతుల్లో ఆందోళన నెలకొంది. ఒక్కో టవర్‌కు 970 నుంచి 1,210 గజాల స్థలాన్ని సేకరిస్తున్నారు. భూమికి ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం పరిహారమివ్వాలని రైతులు కోరుతుంటే.. ప్రభుత్వం మాత్రం పదేళ్ల కింద 400కేవీ విద్యుత్‌ లైన్‌కు ఇచ్చిన పరిహారాన్నే ఖరారు చేసింది. భూముల ధరలు పెరిగిన నేపథ్యంలో నామమాత్ర పరిహారంతో చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. తమకు న్యాయమైన పరిహారం ఇచ్చి పనులు చేపట్టాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. రైతులు, సంఘాలు సంఘటితమై ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.

(ఆంధ్రజ్యోతి-రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 15): పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఎల్‌అండ్‌టీ సంస్థ బీదర్‌ నుంచి మహేశ్వరం వరకు వేస్తున్న 765కేవీ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ పనులతో రైతుల్లో టెన్షన్‌ నెలకొంది. ఎకర, రెండెకరాలు సాగుచేసుకుంటున్న సన్న, చిన్నకారు రైతుల జీవితాల్లో విద్యుత్‌ టవర్లు చిచ్చు రేపుతున్నాయి. కోట్ల రూపాయల విలువ చేసే భూముల నుంచి హైటెన్షన్‌ టవర్లు, లైన్లు రైతుల అనుమతి లేకుండానే వేస్తుండడంతో ఆందోళన మొదలైంది. తమకు పరిహారం ఇవ్వకుండానే ఇష్టానుసారం పనులు చేస్తుండడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చేవెళ్ల మండలం రేగడి ఘనాపూర్‌, పలు చోట్ల 765కేవీ లైన్‌ పనులను రైతులు అడ్డుకున్నారు. తమకు మార్కెట్‌ రేటు ప్రకారం పరిహారం చెల్లించాకే పనులు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

2014లో తెలంగాణ ప్రభుత్వం శంకర్‌పల్లి మీదుగా మీర్‌ఖాన్‌పేట వరకు 400కేవీ విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేసింది. ఒక్కో టవర్‌కు 350 గజాల భూమి చొప్పున సేకరించింది. రోడ్డు ఫేసింగ్‌ భూమికి రూ.4.5 లక్షలు, కొంత లోపలికున్న భూమికి రూ.3.5లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. ప్రస్తుతం బీదర్‌ నుంచి మహేశ్వరం వరకు వేస్తున్న 765కేవీ సామర్థ్యం ఉన్న ఒక్కో టవర్‌కు 970 నుంచి 1,210గజాల స్థలం అవసరం. ఈ కారిడార్‌ నిర్మాణం కూడా 60 మీటర్ల వెడల్పుతో చేపట్టారు. పదేళ్ల క్రితం 400 కేవీ విద్యుత్‌ టవర్‌ కోసం సేకరించిన భూమికి నిర్ణయించిన నష్టపరిహారాన్నే ప్రస్తుత 765కేవీ టవర్‌ నిర్మాణాలకు చెల్లిస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి.

బీదర్‌-మహేశ్వరం 765కేవీ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ రైతులను నష్టాల్లోకి నెట్టేస్తుంది. పరిహార నిర్ధారణలో అధికారులు, నిర్మాణ సంస్థ కలిసి రైతులను నిండా ముంచుతున్నారు. టవర్లకు అవసరమైన అల్యూమినియం, స్టీల్‌, సిమెంట్‌, కూలీలను ప్రస్తుత ధరల మేరకు నిర్ణయించి, రైతుల భూమికి మాత్రం పదేళ్ల కిందటి ధరలనే నిర్ధారించడం అనుమానాలకు తావిస్తోంది. రైతుల సమ్మతి లేకుండా భూముల్లో టవర్లు నిర్మించడంపైనా ఆందోళన వ్యక్తమవుతోంది. న్యాయమైన పరిహారం ఇవ్వకుంటే ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ పనులను అడ్డుకుంటామని రైతులు, భూ నిర్వాసితులు హెచ్చరిస్తున్నారు. అలాగే కర్నూలు నుంచి వచ్చే లైన్‌కు జారీ చేసిన ఉత్తర్వులను బీదర్‌ లైన్‌కు చూపి ప్రైవేట్‌ భూముల్లో టవర్లు వేయడం సరి కాదంటున్నారు.

190 కిలో మీటర్ల ట్రాన్స్‌మిషన్‌ లైన్‌

కర్ణాటక రాష్ట్రం బీదర్‌లో ఏర్పాటు చేసిన భారీ సోలార్‌ పవర్‌ప్లాంట్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు బీదర్‌ నుంచి కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలోని 765కేవీ పవర్‌ గ్రిడ్‌ అనుసంధానానికి 190 కిలోమీటర్ల భారీ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌కు నిర్ణయిచింది. సంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లోని 20 మండలాలు, 315 గ్రామాల మీదుగా లైన్‌ వేయనున్నారు. ఇందుకు బీదర్‌ పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ బహిరంగ ప్రకటనా జారీ చేసింది. లైన్ల నిర్మాణ కాంట్రాక్ట్‌ ఎల్‌అండ్‌టీ దక్కించుకుంది. సదరు సంస్థ భూముల ప్రస్తుత ధరలు, రైతుల అభిప్రాయాన్ని లెక్కలోకే తీసుకోకుండా ఏకపక్షంగా పరిహారాన్ని నిర్ధారించి టవర్లు ఏర్పాటు చేస్తోంది. ఇతర జిల్లాలతో పోలిస్తే రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు ఎక్కువ. స్థానిక మార్కెట్‌ విలువను పరిగణలోకి తీసుకోకుండా అన్ని జిల్లాలకూ ఒకే రీతిన చెల్లింపులు చేస్తుండడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు విద్యుత్‌ టవర్లు, కారిడార్‌ కింద ఇకపై ఎలాంటి వాణిజ్య భవనాలు, గోదాములకు అనుమతించరు. వరి, పత్తి వంటి చిన్న మొక్కల పంటలు మినహా ఎత్తుగా పెరిగే పండ్ల తోటలు, టేకు, ఎర్రచందనం వంటి వాటి సాగును అనుమతించరు. ఆశించిన పరిహారం రాక, భవిష్యత్తులో మార్కెట్‌ ధరకు అనుగుణంగా ఆయా భూములను అమ్ముకోలేక రైతులు నష్టపోయే పరిస్థితి తలెత్తోంది.

ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ వెళ్లే మార్గాలివే...

కేశంపేట మండలంలోని పోమాల్‌పల్లె, పెద్దగుట్ట, లేమామిడి, చిన్నకుంటపల్లె, వేముల్‌నర్వ, బోదనంపల్లె, కేశంపేట్‌, కొత్తపేట, అల్వాల్‌, పోచన్నపేట్‌, చిన్నకుంటపల్లి, ఇప్పలపల్లె, చౌలపల్లి, పడకల్‌, న్యామతాపూర్‌ సాకేత్‌ కోట్ల, రావిచెడు, చౌలపల్లి ఈస్ట్‌, సంతాపూర్‌. చేవెళ్ల మండలం హస్తేపూర్‌, అంతారం, నాన్‌చెరువు, ఖానాపూర్‌, రేగడి ఘనాపూర్‌, దేవరంపల్లి, బస్తేపూర్‌, చెనువెల్లి, ఇంద్రాడ్డినగర్‌, మీర్జాగూడ, వెంకన్నగూడ, కిష్టాపూర్‌, ఆలూరు, బస్తేపూర్‌, నౌలయపల్లి, కౌకుంట్ల. షాబాద్‌ మండలం బొబ్బిలిగామ, కొమరబండ, ఎర్రోనిగూడ, తిమ్మారెడ్డిగూడ, నాగరగూడ, పోలారం, ముద్దెంగూడ, సంకెపల్లిగూడ, గొల్లూరిగూడెం, బోన్‌గిరిపల్లె, షాబాద్‌, కుమ్మరిగూడ, మల్లారెడ్డిగూడ, కేశగూడెం, మరియాపూర్‌, టేకులపల్లి, చెర్యగూడెం, యల్గొండగూడ, కాస్తిపూర్‌, నారెడ్లగూడ, మీరాపూర్‌దర్గా, బోడంపహాడ్‌, మన్మర్రి, దోసాడ, బీరంపల్లె, ఉత్తరా్‌సపలల్లి, చుక్కమెట్‌, రేగడి చిలకమర్రి, ఓబగుంట, మక్తగూడ. కొందుర్గు మండలం రేగడి చిలకమ్మర్రి, చుక్కమ్మెట్‌, ఉత్తరా్‌సపల్లి, టేకులపల్లి, ముట్పూర్‌ బీరంపల్లి. ఫరూక్‌నగర్‌ మండలం లింగారెడ్డిగూడ, అప్పారెడ్డిగూడ, యల్లపల్లి, మొగిలగిద్ద, మొల్లోని గడ్డతండా, రంగంపల్లి, రంగధాముల, రంగసముద్రం, చౌలపలెల్ల వెస్ట్‌, పీర్లగూడ, చౌలపల్లి, దేవునిపల్లి, కందివనం, సూవర్ణకటూర్‌, చించోడ్‌, అయ్యవారిపల్లి, కంసాన్‌పల్లె, రిగ్వేద ఇందీవరం, భీమారం, ఉరేంకితండా, మొల్లోనిగడ్డతండా, ఉదిత్యాల్‌, విట్యాల్‌ వీరన్నపాళ్య, సూరారం, బాలానగర్‌, యల్లంపల్లి, ఎల్కట్ట. కడ్తాల్‌ మండలం రావిచెడ్‌, న్యామతాపూర్‌, మక్తమాదారం, నాగిరెడ్డిగూడ, టక్రాజ్‌గూడ, కొండ్రిగానిబోడుతండా, సాలాపూర్‌, వంపుగూడ, చెల్లంపల్లె, మైసిగండి, దాసగిరిపల్లి తండా, పడకల్‌, ఎక్రాజిగూడ, అవురం విల్లా, కడ్తాల్‌, మహిసమ్మ, కనుగుబాయి తండా, గానుగుమర్ల తండా, హన్మాన్‌పల్లి, దాసర్లపలల్లి, తరంగ్‌ సిటీ, ఎక్రాజ్‌గూడ, అన్మాన్‌పల్లి. కందుకూరు మండలం సాయిరెడ్డిగూడ, ముచ్చెర్ల, ఉట్లపల్లి, సర్వరావులపల్లి, అన్మాన్‌పల్లి, మరియకుంట తండా, పోచమ్మరాలు తండా, సర్వరావులపల్లె, వాయిల్‌కుంటతండా, మహ్మద్‌పూర్‌, దెబ్బగూగ, దాసర్లపల్లి, లచ్చానాయక్‌ తండా గ్రామాలు ఉన్నాయి.

వికారాబాద్‌ జిల్లా..

పూడూరు మండలం తిరుమలాపూర్‌, కండ్లపల్లి, మన్నెగూడ, పోతిరెడ్డిగూడ, కుత్బుల్లాపూర్‌, మేడికొండ, రేగడి మామిడిపల్లి, పుడుగుర్తి, మిట్ట కంకల్‌, రేగడి దోస్వాడ, ఏట్ల ఎర్రవల్లి. మర్పల్లి మంలం ఘానాపూర్‌, మెగిలిగుండ్ల, కొంశెట్‌పల్లి, తుమ్మలపల్లి, బైకల్‌, పిల్లిగుండ. మోమిన్‌పేట మండలం కొల్కుంద, అమ్రాది ఖర్దు, బూర్గుపల్లి, కాస్లాబాద్‌, మోమిన్‌పేట్‌, టేకులపల్లి, ఎన్కతల. నవాబుపేట మండలం అర్కతల, మీనపల్లి కలాన్‌, తిమ్మారెడ్డిపల్లి, యావాపూర్‌, వట్టి మీనపల్లి, నవాబుపేట, ఎల్లకొండ, గిల్లగూడ, వట్టిమీనపల్లి, చిట్టిగిద్ద, కేశవపల్లి, ఎక్మామిడి, మాదిరెడ్డిపల్లి, లింగంపల్లి, పులిమామిడి, అత్తాపూర్‌, చిన్హల్‌పేట్‌, అక్నాపూర్‌, పూలపల్లి, నారాయణగూడెం, ద్తాపూర్‌, సిద్దులూరు, మింగాల్‌, సిద్దులూర్‌ పైగ, పూడూరు మండలం కండ్లపల్లి, బాకాపూర్‌, పోతిరెడ్డిగూడ, తిమ్మాపూర్‌, కుత్బుల్లాపూర్‌, చన్గోముల్‌, మామిడిపల్లి కలాన్‌, రేగడి మామిడిపల్లి, పుడుగుర్తి, కన్కల్‌, చింతలపల్లి.

Updated Date - Sep 16 , 2024 | 12:15 AM