ఎరువులు, విత్తనాలపై జీఎస్టీ ఎత్తేయాలి
ABN , Publish Date - Sep 11 , 2024 | 11:49 PM
కేంఎరువులు, విత్తనాలపై జీఎస్టీని ఎత్తివేయాలని రైతు సంక్షేమ కమిషన్ రాష్ట్ర చైర్మన్ ఎం.కోదండరెడ్డి డిమాండ్ చేశారు. రైతులను నానా ఇబ్బందులు పెడుతున్న ధరణి పోర్టల్‌ను త్వరలో రద్దు చేసి భూమాత పోర్టల్ ద్వారా రైతుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, ధరణి పోర్టల్ కారణంగా రాష్ట్రంలో వేలాది మంది రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు నోచుకోలేకపోతున్నారని అన్నారు.
త్వరలో ధరణి పోర్టల్ రద్దు
భూమాత పోర్టల్‌తో తీరనున్న రైతుల కష్టాలు
రైతు సంక్షేమ కమిషన్ రాష్ట్ర చైర్మన్ కోదండరెడ్డి
యాచారం, సెప్టెంబరు 11 : కేంఎరువులు, విత్తనాలపై జీఎస్టీని ఎత్తివేయాలని రైతు సంక్షేమ కమిషన్ రాష్ట్ర చైర్మన్ ఎం.కోదండరెడ్డి డిమాండ్ చేశారు. రైతులను నానా ఇబ్బందులు పెడుతున్న ధరణి పోర్టల్‌ను త్వరలో రద్దు చేసి భూమాత పోర్టల్ ద్వారా రైతుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, ధరణి పోర్టల్ కారణంగా రాష్ట్రంలో వేలాది మంది రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలకు నోచుకోలేకపోతున్నారని అన్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా యాచారం, గున్‌గల్, నందివనపర్తి, తక్కళ్లపల్లి, మొండిగౌరెల్లి, మేడిపల్లి, కుర్మిద్ద, తాటిపర్తి, మంతన్‌గౌరెల్లి. చింతపట్ల గ్రామాల్లో ప్రముఖ న్యాయవాది సునీల్ తన బృందంతో పర్యటించి రైతుల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. వాటన్నింటినీ క్రోడీకరించి ఓ పుస్తకంగా తీర్చిదిద్ది బుధవారం యాచారం మండల కేంద్రంలో ఏర్పాటు ఆయా గ్రామాల రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డికి కోదండరెడ్డి అందించారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ ఎరువులు, విత్తనాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. తాను ఇదే అంశంపై కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడనున్నట్లు తెలిపారు. భూమాత పోర్టల్ రాగానే మండలంలో ఏ ఒక్క గ్రామంలో రైతుల భూ తగాదాలు లేకుండా చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను కోరారు. ధరణి పోర్టల్ తీరుపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. ధరణి పోర్టల్ బడా రైతులకు మాత్రమే ఉపయోగపడింది తప్ప.. పేద, మధ్యతరగతి రైతులకు గత 8 ఏళ్లుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోలేకపోవడం దారుణమన్నారు. కాగా, ఆయా గ్రామాల్లో పట్టా భూములపై 3039, ఇనాం భూములపై 346, లావణి భూములపై 814, సీలింగ్ భూములపై 105, ప్రభుత్వ భూములపై 75, భూదాన్ భూములపై 86 ఫిర్యాదులు అందాయని ప్రముఖ న్యాయవాది సునీల్ తెలిపారు. రైతులు ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు యుద్ధప్రాతిపదికన సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకం ఉందన్నారు. వీటితో పాటు పట్టాదారు పాసుబుక్‌ల కోసం 558 మంది, భూముల విభజనపై 4,465 ఫిర్యాదులు అందాయని ఆయన చెప్పారు. మండలంలో వందకు వంద శాతం భూతగాదాలు లేకుండా చేసి రాష్ట్రంలో ఆదర్శ మండలముగా మార్చడం కోసం తన బృందం చొరవ తీసుకుంటుందని సునీల్ వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దార్ అయ్యప్ప, రైతులు తదితరులు పాల్గొన్నారు.