రైతు పండగను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Nov 29 , 2024 | 10:52 PM
మహబూబ్‌నగర్‌లో జరిగే రైతు పండగను విజయవంతం చేయాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు.
కలెక్టర్ నారాయణరెడ్డి
రంగారెడ్డి అర్బన్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌లో జరిగే రైతు పండగను విజయవంతం చేయాలని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగుతున్న రైతు పండుగకుశనివారం షాద్‌నగర్, కల్వకుర్తి ప్రాంతాల నుంచి రైతులను తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులకు 95 బస్సులు, మహిళా రైతులకు 45 బస్సులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ బస్సుకు ఒక లైజన్ అధికారి, ఒక కానిస్టేబుల్‌ను నియమించాలని తెలిపారు. రైతులకు తాగునీరు, భోజన వసతి, వారికి కావాల్సిన సదుపాయాలు సమకూర్చాలని సూచించారు.
ప్రజా విజయోత్సవ కార్యక్రమాలపై..
డిసెంబరు 1వ తేదీ నుంచి 9వ వరకు తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలకు సంబంధించి జిల్లాలో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయి, మండల స్థాయి, మున్సిపాలిటీల పరిధిలో నిర్వహించే కార్యక్రమాలకు ఎంపీడీవోలు, కమిషనర్లు బాధ్యతగా పనిచేయాలన్నారు.
సర్వే డాటా ఎంట్రీ వేగిరం
కుటుంబ సర్వే డాటా ఎంట్రీ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందని, వెనుకబడిన మండలాల్లో ఆదివారం వరకు వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్వో సంగీత, జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.