సజావుగా కుటుంబ సర్వే!
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:17 AM
జిల్లాలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే సవ్యంగా సాగుతోంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు.
రెండు రోజుల్లో 19 శాతం పూర్తి
కుటుంబాల వివరాల సేకరణలో ఎన్యూమరేటర్లు బిజీ
సర్వేకు డుమ్మా కొట్టిన ఏడుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
నోటీసులు వెనక్కి తీసుకోవాలి, లేదంటే ఆందోళన చేస్తాం : పీఆర్‌టీయూ
రంగారెడ్డి అర్బన్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే సవ్యంగా సాగుతోంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. సర్వేలో 5,364 మంది ఎన్యూమరేటర్లు పనిచేస్తున్నారు. పది మంది ఎన్యుమరేటర్లకు ఓ సూపర్‌వైజర్ పర్యవేక్షణ చూస్తున్నారు. ఒక్కో ఎన్యుమరేటర్ 150-175 ఇళ్లను సర్వే చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గడువులోగా సర్వేను పూర్తిచేసేలా ఎన్యూమరేటర్లు చురుగ్గా పనిచేస్తున్నారు. జిల్లాలో ఈనెల 10వ తేది నాటికి 10 శాతం సర్వే పూర్తి కాగా, సోమవారం వరకు 19 శాతం సర్వే పూర్తి చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో 56 అంశాలతో పాటు 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలతో సమాచారం సేకరిస్తున్నారు. సర్వేలో 2వేల మంది వరకు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులను ఎన్యుమరేటర్లుగా నియమించడంతో విద్యార్థులకు ఉదయం పూట మాత్రమే తరగతులు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం తర్వాత టీచర్లు సర్వేలో పాల్గొంటున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఆదివారం సర్వేకు డుమ్మా కొట్టిన ఏడుగురు టీచర్లకు జిల్లా విద్యాధికారి సుశీందర్‌రావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఉపాధ్యాయులు సక్రమంగా సర్వే చేస్తున్నారా లేదా అనే అంశాన్ని పరిశీలించేందుకు ఆకస్మికంగా తనిఖీ నిర్వహిస్తున్నారు. రాత్రి 7 గంటలకు సర్వే చేయాల్సి ఉండగా, కొంతమంది ఉపాధ్యాయులు ఆరేడు ఇళ్లను సర్వే చేసి ఇంటిబాట పడుతున్నారు. షోకాజ్ నోటీసులు ఎలా జారీ చేస్తారంటూ.. మహేశ్వరం మండల పీఆర్‌టీయూ నాయకులు ఎం. జానకిరాం, ఆనంద్‌కుమార్, గౌర జంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనారోగ్యం కారణంగా ఏడుగురు ఎన్యుమరేటర్లు సర్వే చేయలేకపోయారని పీఆర్‌టీయూ నాయకులు డీఈవోకు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా జరిగేలా 15 రోజుల్లో పూర్తి చేసేలా కలెక్టర్ నారాయణరెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. తుక్కుగూడ, శంకర్‌పల్లి, షాద్‌నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న సర్వే తీరును ఆయన ఇప్పటికే పరిశీలించారు. ఎన్యుమరేటర్లకు సూచనలు సలహాలిచ్చారు. సమగ్ర సర్వేలో సేకరించిన వివరాలను పూర్తి గోప్యంగా, భద్రంగా ఉంచేలా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఎన్యూమరేటర్ల నుంచి సేకరించిన పత్రాలను ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయంలో ఇనుప పెట్టెల్లో, స్ర్టాంగ్ రూముల్లో భద్ర పర్చుతున్నారు. సర్వే వివరాలను కంప్యూటర్‌లో ఎంట్రీ చేసేందుకు ఇంకా లాగిన్ రాలేదని అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లకు ఆస్తుల వివరాలు చెప్పటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.