ఒకరి పొరపాటు... మరొకరి అత్యాశ
ABN , Publish Date - Oct 22 , 2024 | 12:41 AM
బస్సు ప్రయాణంలో ఒకరి పొరపాటు మరొకరికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది.
బస్టాండ్‌లో తారుమారైన బంగారు ఆభరణాల సంచి
భువనగిరిలో పొరపాటున తీసుకెళ్లిన వ్యక్తి
సీసీపుటేజీ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు
భువనగిరి టౌన్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): బస్సు ప్రయాణంలో ఒకరి పొరపాటు మరొకరికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఏడు రోజుల్లో ఈ కేసును ఛేదించిన పోలీసులు బాధిత కుటుంబానికి రూ.5లక్షల విలువైన బంగారు ఆభరణాలు అందజేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ రవికిరణ్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ సురేష్‌కుమార్ ఇందుకకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ అంబర్‌పేట్‌లోని గంగానగర్‌కాలనీకి చెందిన గజ్జి జ్యోతి కుటుంబంతో కలిసి దసరా పండుగ కోసం మహబూబాబాద్ జిల్లా కే సము ద్రంలోని పుట్టింటికి వెళ్లింది. ఈ నెల 14వ తేదీన హైదరాబాద్ వెళ్లేందుకు కేసముద్రం బస్టాండ్‌లో బస్సు ఎక్కింది. మార్గమధ్యలో భువనగిరి బస్టాండులో కొంతమంది ప్రయాణికులు కిందికి దిగారు. ఘట్‌కేసర్ వరకు వెళ్లాక తనతో పాటు తెచ్చుకున్న రూ.5లక్షల విలువైన బంగారు ఆభరణాలతో ఉన్న బ్యాగు కనిపించకపోవడంతో ఆందో ళనకు గురై వెనక్కి వచ్చి భువనగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బస్టాండ్‌లోని సీసీపుటేజీల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓ గుర్తుతెలియని ప్రయాణికుడు జ్యోతి బ్యాగును తీసుకుని బస్సు దిగినట్లు గుర్తించారు. ఆ బ్యాగు తనది కాదని గమనించి వెనక్కివచ్చిన ప్రయాణికుడు బస్సు వెళ్లిపోవటంతో ఆ సంచిని బస్టాండ్‌లోనే వదిలి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మరో గుర్తుతెలియని వ్యక్తి ఆ సంచిని తీసుకుని హైదరాబాద్ వైపు వెళ్లే బస్సు ఎక్కినట్లు సీసీ ఫుటేజీలో తేలింది. పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆభరణాలు ఉన్న సంచిని తీసుకువెళ్లిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా వినుకొండ మండలం తిమ్మయ్యపాలెం గ్రామస్థుడిగా గుర్తించారు. మూడు రోజుల క్రితం పోలీసులు అక్కడికి వెళ్లి అతని నుంచి బంగారు ఆభరణాలు ఉన్న సంచిని స్వాధీనం చేసుకుని సోమవారం బాధితురాలికి అప్పగించారు.